
ఆస్పత్రిలో పంత్‌ను కలిసిన రజత్, నిషు (ఫొటో: ఇండియా టుడే)
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్‌ను ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా కలిశారు.
డెహ్రడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా కలిశారు. వారెవరో కాదు.. అతడిని కాపాడిన రక్షకులు రజత్, నిషు. ఆస్పత్రికి వెళ్లి పంత్‌ను స్వయంగా కలిశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పంత్ ఒంటి నిండా బాండేజ్‌లు ఉన్నట్టు ఫొటోలో కనిపించింది.
రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన వెంటనే అక్కడే ఉన్న రజత్, నిషు.. సకాలంలో స్పందించి అతడిని కారు నుంచి బయటకు తీసుకువచ్చారు. తర్వాత అక్కడికి వచ్చిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్.. అంబులెన్స్ ఏర్పాటు చేసి, పోలీసులకు ఫోన్ చేశారు. వీరు ముగ్గురి సహాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రమాద సమయంలో పంత్‌ను తాము గుర్తించలేదని, అతడు క్రికెటర్ అన్న సంగతి తమకు తెలియదని రజత్, నిషు.. వార్తా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. సుశీల్ కుమార్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అటు బీసీసీఐ కూడా రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రకటన చేసింది. శ్రీలంకతో మంగళవారం టీ20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపారు. (క్లిక్ చేయండి: మిస్ యూ పంత్! ప్లీజ్.. త్వరగా కోలుకో.. కలిసి ఆడుదాం!)