Rajat
-
పంత్‌ను ప్రత్యేకంగా కలిసిన ఇద్దరు.. ఎవరో తెలుసా?
డెహ్రడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా కలిశారు. వారెవరో కాదు.. అతడిని కాపాడిన రక్షకులు రజత్, నిషు. ఆస్పత్రికి వెళ్లి పంత్‌ను స్వయంగా కలిశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పంత్ ఒంటి నిండా బాండేజ్‌లు ఉన్నట్టు ఫొటోలో కనిపించింది. రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన వెంటనే అక్కడే ఉన్న రజత్, నిషు.. సకాలంలో స్పందించి అతడిని కారు నుంచి బయటకు తీసుకువచ్చారు. తర్వాత అక్కడికి వచ్చిన బస్ డ్రైవర్ సుశీల్ కుమార్.. అంబులెన్స్ ఏర్పాటు చేసి, పోలీసులకు ఫోన్ చేశారు. వీరు ముగ్గురి సహాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పంత్‌ను తాము గుర్తించలేదని, అతడు క్రికెటర్ అన్న సంగతి తమకు తెలియదని రజత్, నిషు.. వార్తా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. సుశీల్ కుమార్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అటు బీసీసీఐ కూడా రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ప్రకటన చేసింది. శ్రీలంకతో మంగళవారం టీ20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం పంపారు. (క్లిక్ చేయండి: మిస్ యూ పంత్! ప్లీజ్.. త్వరగా కోలుకో.. కలిసి ఆడుదాం!) -
ఏపీలో కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు గీత విధానం (పాలసీ) అమలులో ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కల్లుగీత లైసెన్సింగ్ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. పరిహారం పెంపు.. తాటిచెట్ల పెంపకానికి ప్రాధాన్యత ► కల్లు రెంటల్స్ (కిస్తీలు)ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. రాష్ట్రంలో కల్లుగీత కార్మిక సొసైటీలు, గీచే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు అనుమతి(లైసెన్స్) ఇస్తారు. ► కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపిస్తారు. వైఎస్సార్ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారు. ► కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. ఇందులో రూ.5 లక్షలు వైఎస్సార్ బీమా ద్వారా, మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ► కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందజేత. ► ఎన్ఆర్ఈజీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల కింద తాటి, ఈత వంటి చెట్లను పెంచేలా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సమృద్ధిగా పెంచడానికి చర్యలు తీసుకుంటారు. -
27 నుంచి అల్లూరి జయంత్యుత్సవాలు
సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జూన్ 27 నుంచి జూలై 4వ తేదీ వరకు స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి త్యాగాన్ని చాటి చెప్పేలా వేడుకలు ఉంటాయన్నారు. ఉత్సవాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని, పాండ్రంగిలోని అల్లూరి మెమోరియల్ మ్యూజియం, పార్కుతో పాటు అల్లూరి విగ్రహాన్నీ ఆవిష్కరిస్తారని, అక్కడే స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తారని వివరించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం సంగీత విభావరి, సురభి నాటికలు, దేశభక్తిని పెంపొందించేలా కళా ప్రదర్శనలుంటాయని తెలిపారు. విద్యార్థులకు వక్తృత్వం, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగోలి, లఘు చిత్రాలు, పాటలు–నృత్య పోటీలు, అల్లూరి పోరాటాన్ని గుర్తు చేసేలా ప్రత్యేక ఏకపాత్రాభినయ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రజలకు అవగాహన కల్పించేలా ఊరేగింపులు, సైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, యోగా, ఫొటో గ్యాలరీ, 125 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. -
పతా.. ఈ అడ్రెస్ ఎక్కడ..?
కావలసిన వారి చిరునామా వెతుక్కుంటూ ఒకరు ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండీ?’’ అని అడిగితే.. ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండి’’ అని వెటకారంగా సమాధానం చెబుతారు మరొకరు. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన జోకు ఇది. స్క్రీన్ మీద నటులు పడే తంటాలు మనకు నవ్వు తెప్పిస్తే, రియల్ లైఫ్‌లో మాత్రం ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇల్లు, ఆఫీస్‌ల అడ్రెస్‌ను కనుక్కోవాలంటే తిప్పలు తప్పవు. కొత్త ఏరియాలో ఒకరి అడ్రెస్ కనుక్కోవాలన్నా, మన ఆర్డర్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్‌కు మన అడ్రెస్ వివరంగా చెప్పాలన్నా, గొంతు నొప్పి పుట్టేలా అరవాల్సిందే. అందరిలాగే ఈ ఇబ్బందులన్నీ కృతికా జైన్ కు కూడా ఎదురయ్యాయి. అడ్రెస్ దొరకగానే సమస్య తీరిపోయిందిలే అనుకోలేదు. తనలా ఇబ్బంది పడేవారందరికీ ఓ చక్కని పరిష్కారం చూపాలనుకుని ‘పతా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక . ఇండోర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృతికా జైన్‌కు విదేశాల్లో చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల విద్య అయిన తరువాత పైచదువులు విదేశాల్లో చదువుకుంటానని మారాం చేసింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఒక్కదానివి అంతదూరం వెళ్లి చదువుకోవడం కష్టం’ అని వారించారు తల్లిదండ్రులు. దీంతో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్తానని మరోసారి తల్లిదండ్రులను అడిగి ఒప్పించింది. విదేశాలకు వెళ్లేందుకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి, న్యూయార్క్ యూనివర్సిటీలో ‘మేనేజ్మెంట్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేసేందుకు అడ్మిషన్ సంపాదించింది. అడ్రెస్సే కెరియర్‌గా.. చదువులో భాగంగా న్యూయార్క్‌లో రెండేళ్లపాటు ఉన్న కృతికను.. అక్కడి రోడ్లు, అడ్రెస్ తెలిపే మార్కింగ్‌లు ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ రంగాన్ని తన కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. కానీ ఇండియా వచ్చిన వెంటనే మంచి సంబంధం రావడంతో కృతికకు వివాహం అయింది. పెళ్లి తరువాత ఒకరోజు కృతిక తనకు తెలిసిన వారింటికి వెళ్లడానికి బయలుదేరింది. అడ్రెస్ దొరకక పోవడంతో, చుట్టుపక్కల వారిని అడిగింది. కానీ వారు చెప్పింది కూడా అర్థంకాకపోవడంతో.. తను వెళ్లాల్సిన అడ్రెస్‌కు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడింది. మరోసారి ఆన్ లైన్ లో ఆర్డరిచ్చిన ప్యాకేజీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌కు తన అడ్రెస్ సరిగా అర్థం కాకపోవడంతో, ప్యాకేజీ ఇంటికి రావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో న్యూయార్క్‌లో అడ్రెస్‌లకు గూగుల్ మార్కింగ్ ఉన్నట్టే, ఇండియాలో కూడా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు, అనుకుని సహ వ్యవస్థాపకులు అయిన రజత్, మోహిత్ జైన్ లతో కలిసి ‘పతా’ యాప్‌ను రూపొందించింది. పతా.. అడ్రెస్‌ను ఖచ్చితంగా చూపించే యాపే ‘పతా’. మన డిజిటల్ అడ్రెస్‌ను పతా రూపొందిస్తోంది. ఇది కాంప్లెక్స్ అడ్రెస్‌కు ఒక కోడ్‌ను ఇస్తుంది. ఈ కోడ్ ఆఫీసు లేదా ఇంటి అడ్రెస్‌ను కచ్చితంగా చూపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న భవనాలను ఫొటోలతో సహా చూపిస్తుంది. దీనివల్ల అడ్రెస్‌ను పదేపదే వివరించాల్సిన పని ఉండదు. ఇంకా అడ్రెస్‌ను మన వాయిస్‌తో ఒకసారి రికార్డు చేసి షేర్ చేయవచ్చు. ఇదంతా ఒక్క క్లిక్‌తో అయ్యేలా చేస్తుంది పతా యాప్. ఈ యాప్ కోడ్‌తోపాటు మన వాయిస్‌తో అడ్రెస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పతా యాప్‌లో మన లొకేషన్స్ కు వచ్చిన కోడ్ లింక్‌ను.. మన అడ్రెస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, వారు గమ్యస్థానానికి సులభంగా చేరుకోగలుగుతారు. గతేడాది ‘అడ్రెస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించి, దీనిద్వారా పతా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక. ప్రస్తుతం ఈ యాప్ 50 లక్షలకు పైగా డౌన్ లోడ్స్‌తో దూసుకుపోతోంది. ‘పతా’ యాప్ సహ వ్యవస్థాపకులతో కృతిక -
జీఎస్టీ ఎగవేతదారులను పట్టేద్దాం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు దృష్టిసారించారు. సమాచార మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి, ఆదాయ నష్టానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గురువారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ(వాణిజ్యం, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నేతృత్వంలోని రాష్ట్ర అధికారులు, విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నరేష్ నేతృత్వంలోని కేంద్ర అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు తరుచూ సమావేశమవుతూ సమాచారం మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టు రజత్‌భార్గవ చెప్పారు. ఇరు విభాగాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా జీఎస్టీ ఆదాయానికి నకిలీ ఇన్వాయిస్లతో భారీగా గండి కొడుతున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లయిమ్‌లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డీజీజీఐ, ఏపీఎస్డీఆర్ఐ వంటి వాటి సహకారంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం తీసుకుని విశ్లేషించనున్నారు. సమావేశంలో రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్, వైజాగ్ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాహీమ్ అహ్మద్ పాల్గొన్నారు. -
దర్శకుడు రజత్ ముఖర్జీ కన్నుమూత
ప్రముఖ హిందీ దర్శకుడు రజత్ ముఖర్జీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘ప్యార్ తునే క్యా కియా, రోడ్, లవ్ ఇన్ నేపాల్’ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వీటిలో ‘రోడ్’ సినిమా రజత్ ముఖర్జీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ‘రజత్ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అన్నారు నటుడు మనోజ్ భాజ్‌పాయ్. డైరెక్టర్ అనుభవ్ సిన్హా, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ హన్సల్ మెహతాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు రజత్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే రిషీకపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ తదితరులు అనారోగ్యంతో మృతి చెందగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
అది అతి పెద్ద యజ్ఞం
– విజయేంద్రప్రసాద్ ప్రస్తుత రోజుల్లో కొత్తవారితో సినిమా తీసి రిలీజ్ చేయడమే నా దృష్టిలో అతి పెద్ద యజ్ఞం. ఆ పనిని మా నిర్మాతలు విజయవంతంగా పూర్తిచేశారు. ముఖ్యంగా నాలాంటి తిక్కవాడితో సినిమా తీసి సక్సెస్ అయ్యారు’’ అని ప్రముఖ రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్ అన్నారు. రజత్, నేహాహింగే జంటగా ఆయన దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లీ’ విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీవల్లీ’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. రజత్ ఫేస్‌లో నెగటివ్ షేడ్స్ చూసి ఈ సినిమాలో హీరోగా అవకాశామిచ్చాను. మోహన్‌బాబు, చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు చాలా మంది విలన్‌గా మొదలై, గొప్ప నటులయ్యారు. వారి తరహాలోనే రజత్ అడుగులు వేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్ర విజయం మరిన్ని సినిమాల్ని రూపొందించడానికి మాలో ధైర్యాన్ని నింపింది’’ అన్నారు నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్. -
వాళ్లందరూ నాకు స్ఫూర్తి
‘సక్సెస్ అనేది ఓవర్‌నైట్‌లో రాదు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన చిరంజీవిగారు, మోహన్‌బాబుగారు ఎంతో కష్టపడ్డారు కాబట్టే... ఇప్పుడీ స్థాయిలో ఉన్నారు. సినిమా నేపథ్యం అయినప్పటికీ... బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున గార్లు కష్టపడబట్టే సక్సెస్ అయ్యారు. వాళ్లందరూ నాకు స్ఫూర్తి’’ అన్నారు రజత్. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆయన హీరోగా పరిచయమైన సినిమా ‘శ్రీవల్లీ’. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ సిన్మా శుక్రవారం విడుదలైంది. ప్రేక్షకుల స్పందన చాలా హ్యాపీగా ఉందంటున్న రజత్ మాట్లాడుతూ– ‘‘నాన్న విజయ్ రామరాజుగారు హైకోర్టులో క్రిమినల్ లాయర్. అమ్మ హౌస్ వైఫ్. మాది చిత్తూరులోని మదనపల్లి. నేను హైదరాబాద్‌లో బీటెక్ చేశా. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఆసక్తి. చిరంజీవిగారి సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నన్ను లాక్కొచ్చారని చెప్పాలి! ‘వైజాక్’ సత్యానంద్‌గారి దగ్గర ట్రయినింగ్ తీసుకున్నా. రచయితగా, దర్శకుడిగా సక్సెస్‌లో ఉన్న విజయేంద్రప్రసాద్‌గారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. ఆయన్నుంచి కష్టపడే తత్వం నేర్చుకున్నా. ఈ సినిమా క్లైమాక్స్ 20 నిమిషాలు, అందులో గ్రాఫిక్స్ సూపర్బ్ అంటుంటే హ్యాపీగా ఉంది. నా నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఎటువంటి పాత్రలకైనా నేను సిద్ధమే’’ అన్నారు. -
మా లక్ష్యం అదే!
కథలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం’’ అని నిర్మాతలు రాజ్‌కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్ అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వారు నిర్మించిన ‘శ్రీవల్లీ’ సినిమా ఈరోజు రిలీజవుతోంది. రాజ్‌కుమార్, సునీత మాట్లాడుతూ– ‘‘మాది పాలకొల్లు. ఈ ప్రాంతం నుంచి ఉద్దండులైన సినీ ప్రముఖులు వచ్చారు. వారి స్ఫూర్తితో సినిమా రంగంలోకి వచ్చాం. ‘బాహుబలి’ మాటల రచయిత విజయ్‌కుమార్ ద్వారా విజయేంద్ర ప్రసాద్‌గారిని కలిశాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఆయన చెప్పిన కథ నచ్చింది. ఆయన మాత్రమే కథకి న్యాయం చేయగలరని భావించి, దర్శకత్వం చేయమన్నాం. శ్రీవల్లీ అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ప్రతిక్షణం మలుపులతో కొత్త అనుభూతినిస్తుంది. గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. రాజ్‌తరుణ్ హీరోగా సుకుమార్ రైటింగ్స్‌లో మా తర్వాతి సినిమాను చేయనున్నాం. ఈ చిత్రానికి ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తారు. ఎప్పటికైనా పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలన్నదే మా అభిలాష’’ అన్నారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్
‘బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్’ వంటి అద్భుతమైన చిత్రాలకు కథ అందించి, ‘రాజన్న’ మూవీతో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్రీవల్లీ’. రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తాయి. టీజర్, ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ బాగుందని పలువురు ప్రముఖులు ఫోన్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్. -
సైంటిఫిక్ థ్రిల్లర్
రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’ వంటి యాక్షన్, హ్యూమన్ ఎమోషన్స్ కథలు రాసిన ఆయన కలం నుంచి ఇప్పుడో సైంటిఫిక్ థ్రిల్లర్ కథ వస్తోంది. ‘శ్రీవల్లి’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. రజత్, నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24న టీజర్‌ను, త్వరలో పాటలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ఆసక్తికరంగా సాగే సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్.