వాళ్లందరూ నాకు స్ఫూర్తి
‘సక్సెస్ అనేది ఓవర్‌నైట్‌లో రాదు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన చిరంజీవిగారు, మోహన్‌బాబుగారు ఎంతో కష్టపడ్డారు కాబట్టే... ఇప్పుడీ స్థాయిలో ఉన్నారు. సినిమా నేపథ్యం అయినప్పటికీ... బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున గార్లు కష్టపడబట్టే సక్సెస్ అయ్యారు. వాళ్లందరూ నాకు స్ఫూర్తి’’ అన్నారు రజత్. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆయన హీరోగా పరిచయమైన సినిమా ‘శ్రీవల్లీ’. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ సిన్మా శుక్రవారం విడుదలైంది. ప్రేక్షకుల స్పందన చాలా హ్యాపీగా ఉందంటున్న రజత్ మాట్లాడుతూ– ‘‘నాన్న విజయ్ రామరాజుగారు హైకోర్టులో క్రిమినల్ లాయర్.
అమ్మ హౌస్ వైఫ్. మాది చిత్తూరులోని మదనపల్లి. నేను హైదరాబాద్‌లో బీటెక్ చేశా. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఆసక్తి. చిరంజీవిగారి సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నన్ను లాక్కొచ్చారని చెప్పాలి! ‘వైజాక్’ సత్యానంద్‌గారి దగ్గర ట్రయినింగ్ తీసుకున్నా. రచయితగా, దర్శకుడిగా సక్సెస్‌లో ఉన్న విజయేంద్రప్రసాద్‌గారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. ఆయన్నుంచి కష్టపడే తత్వం నేర్చుకున్నా. ఈ సినిమా క్లైమాక్స్ 20 నిమిషాలు, అందులో గ్రాఫిక్స్ సూపర్బ్ అంటుంటే హ్యాపీగా ఉంది. నా నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఎటువంటి పాత్రలకైనా నేను సిద్ధమే’’ అన్నారు.