ఆయన్ను కలిశాక అరగంటలో కథ చెబుతున్నా– సుకుమార్
‘‘విజయేంద్రప్రసాద్‌గారు ‘భజరంగీ భాయిజాన్’ చిత్రకథను కేవలం 22 నిమిషాల్లో చెప్పారు. గతంలో గంటల తరబడి కథలు చెప్పే నేను ఆయన్ను కలసిన తర్వాతే అరగంటలో కథ చెబుతున్నా. సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాన్స్, హిస్టరీ.. అన్ని కథలూ చెప్పగలరు. ఆయనోసారి కథ చెప్పి బయటకు వెళ్లబోతుంటే తలుపులు వేసి కాళ్లమీద పడ్డా. రెండు కాళ్లనూ పూర్తిగా టచ్ చేశా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన సినిమా ‘శ్రీవల్లీ’. ఈ చిత్రం టీజర్‌ను సుకుమార్ విడుదల చేశారు. ‘‘ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం వల్ల ఆమెకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పుడేం జరిగిందనేది ఆసక్తిగా ఉంటుంది. ఓ సీన్‌లో నేహా టాప్‌లెస్‌గా నటించింది’’ అని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
సుకుమార్ మాట్లాడుతూ – ‘‘ఈ వయసులో విజయేంద్రప్రసాద్‌గారు దర్శకత్వం వహించడం చాలా అద్భుతమైన విషయం. ‘టెన్షన్‌లు తట్టుకోలేక ఎప్పుడు దర్శకత్వం మానేసి నిర్మాణంవైపు వెళ్దామా?’ అని భయపడుతున్న నాకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఇదొక విచిత్రమైన కథ. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. రాజ్‌కుమార్ బృందావనంతో కలసి త్వరలో ఓ చిత్రం నిర్మించనున్నా’’ అన్నారు. ‘‘విజయేంద్రప్రసాద్‌గారు కథాబలి. ఆయన దగ్గరున్న కథల్లో ఆణిముత్యంలాంటి కథతో ఈ సినిమా చేశాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత సునీతా రాజ్‌కుమార్. రజత్, నేహా హింగే, నిర్మాత రాజ్‌కుమార్ బృందావనం పాల్గొన్నారు.