కావలసిన వారి చిరునామా వెతుక్కుంటూ ఒకరు ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండీ?’’ అని అడిగితే.. ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండి’’ అని వెటకారంగా సమాధానం చెబుతారు మరొకరు. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన జోకు ఇది. స్క్రీన్ మీద నటులు పడే తంటాలు మనకు నవ్వు తెప్పిస్తే, రియల్ లైఫ్‌లో మాత్రం ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇల్లు, ఆఫీస్‌ల అడ్రెస్‌ను కనుక్కోవాలంటే తిప్పలు తప్పవు.
కొత్త ఏరియాలో ఒకరి అడ్రెస్ కనుక్కోవాలన్నా, మన ఆర్డర్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్‌కు మన అడ్రెస్ వివరంగా చెప్పాలన్నా, గొంతు నొప్పి పుట్టేలా అరవాల్సిందే. అందరిలాగే ఈ ఇబ్బందులన్నీ కృతికా జైన్ కు కూడా ఎదురయ్యాయి. అడ్రెస్ దొరకగానే సమస్య తీరిపోయిందిలే అనుకోలేదు. తనలా ఇబ్బంది పడేవారందరికీ ఓ చక్కని పరిష్కారం చూపాలనుకుని ‘పతా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక .
ఇండోర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృతికా జైన్‌కు విదేశాల్లో చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల విద్య అయిన తరువాత పైచదువులు విదేశాల్లో చదువుకుంటానని మారాం చేసింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఒక్కదానివి అంతదూరం వెళ్లి చదువుకోవడం కష్టం’ అని వారించారు తల్లిదండ్రులు. దీంతో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్తానని మరోసారి తల్లిదండ్రులను అడిగి ఒప్పించింది. విదేశాలకు వెళ్లేందుకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి, న్యూయార్క్ యూనివర్సిటీలో ‘మేనేజ్‌మెంట్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేసేందుకు అడ్మిషన్ సంపాదించింది.
అడ్రెస్సే కెరియర్‌గా..
చదువులో భాగంగా న్యూయార్క్‌లో రెండేళ్లపాటు ఉన్న కృతికను.. అక్కడి రోడ్లు, అడ్రెస్ తెలిపే మార్కింగ్‌లు ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ రంగాన్ని తన కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. కానీ ఇండియా వచ్చిన వెంటనే మంచి సంబంధం రావడంతో కృతికకు వివాహం అయింది. పెళ్లి తరువాత ఒకరోజు కృతిక తనకు తెలిసిన వారింటికి వెళ్లడానికి బయలుదేరింది. అడ్రెస్ దొరకక పోవడంతో, చుట్టుపక్కల వారిని అడిగింది. కానీ వారు చెప్పింది కూడా అర్థంకాకపోవడంతో.. తను వెళ్లాల్సిన అడ్రెస్‌కు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడింది. మరోసారి ఆన్ లైన్ లో ఆర్డరిచ్చిన ప్యాకేజీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌కు తన అడ్రెస్ సరిగా అర్థం కాకపోవడంతో, ప్యాకేజీ ఇంటికి రావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో న్యూయార్క్‌లో అడ్రెస్‌లకు గూగుల్ మార్కింగ్ ఉన్నట్టే, ఇండియాలో కూడా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు, అనుకుని సహ వ్యవస్థాపకులు అయిన రజత్, మోహిత్ జైన్ లతో కలిసి ‘పతా’ యాప్‌ను రూపొందించింది.
పతా..
అడ్రెస్‌ను ఖచ్చితంగా చూపించే యాపే ‘పతా’. మన డిజిటల్ అడ్రెస్‌ను పతా రూపొందిస్తోంది. ఇది కాంప్లెక్స్ అడ్రెస్‌కు ఒక కోడ్‌ను ఇస్తుంది. ఈ కోడ్ ఆఫీసు లేదా ఇంటి అడ్రెస్‌ను కచ్చితంగా చూపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న భవనాలను ఫొటోలతో సహా చూపిస్తుంది. దీనివల్ల అడ్రెస్‌ను పదేపదే వివరించాల్సిన పని ఉండదు. ఇంకా అడ్రెస్‌ను మన వాయిస్‌తో ఒకసారి రికార్డు చేసి షేర్ చేయవచ్చు. ఇదంతా ఒక్క క్లిక్‌తో అయ్యేలా చేస్తుంది పతా యాప్. ఈ యాప్ కోడ్‌తోపాటు మన వాయిస్‌తో అడ్రెస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పతా యాప్‌లో మన లొకేషన్స్ కు వచ్చిన కోడ్ లింక్‌ను.. మన అడ్రెస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, వారు గమ్యస్థానానికి సులభంగా చేరుకోగలుగుతారు. గతేడాది ‘అడ్రెస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించి, దీనిద్వారా పతా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక. ప్రస్తుతం ఈ యాప్ 50 లక్షలకు పైగా డౌన్ లోడ్స్‌తో దూసుకుపోతోంది.
‘పతా’ యాప్ సహ వ్యవస్థాపకులతో కృతిక
Comments
Please login to add a commentAdd a comment