kritika
-
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్‌కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్‌గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్‌కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
పతా.. ఈ అడ్రెస్ ఎక్కడ..?
కావలసిన వారి చిరునామా వెతుక్కుంటూ ఒకరు ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండీ?’’ అని అడిగితే.. ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండి’’ అని వెటకారంగా సమాధానం చెబుతారు మరొకరు. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన జోకు ఇది. స్క్రీన్ మీద నటులు పడే తంటాలు మనకు నవ్వు తెప్పిస్తే, రియల్ లైఫ్‌లో మాత్రం ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇల్లు, ఆఫీస్‌ల అడ్రెస్‌ను కనుక్కోవాలంటే తిప్పలు తప్పవు. కొత్త ఏరియాలో ఒకరి అడ్రెస్ కనుక్కోవాలన్నా, మన ఆర్డర్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్‌కు మన అడ్రెస్ వివరంగా చెప్పాలన్నా, గొంతు నొప్పి పుట్టేలా అరవాల్సిందే. అందరిలాగే ఈ ఇబ్బందులన్నీ కృతికా జైన్ కు కూడా ఎదురయ్యాయి. అడ్రెస్ దొరకగానే సమస్య తీరిపోయిందిలే అనుకోలేదు. తనలా ఇబ్బంది పడేవారందరికీ ఓ చక్కని పరిష్కారం చూపాలనుకుని ‘పతా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక . ఇండోర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృతికా జైన్‌కు విదేశాల్లో చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల విద్య అయిన తరువాత పైచదువులు విదేశాల్లో చదువుకుంటానని మారాం చేసింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఒక్కదానివి అంతదూరం వెళ్లి చదువుకోవడం కష్టం’ అని వారించారు తల్లిదండ్రులు. దీంతో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్తానని మరోసారి తల్లిదండ్రులను అడిగి ఒప్పించింది. విదేశాలకు వెళ్లేందుకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి, న్యూయార్క్ యూనివర్సిటీలో ‘మేనేజ్మెంట్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేసేందుకు అడ్మిషన్ సంపాదించింది. అడ్రెస్సే కెరియర్‌గా.. చదువులో భాగంగా న్యూయార్క్‌లో రెండేళ్లపాటు ఉన్న కృతికను.. అక్కడి రోడ్లు, అడ్రెస్ తెలిపే మార్కింగ్‌లు ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ రంగాన్ని తన కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. కానీ ఇండియా వచ్చిన వెంటనే మంచి సంబంధం రావడంతో కృతికకు వివాహం అయింది. పెళ్లి తరువాత ఒకరోజు కృతిక తనకు తెలిసిన వారింటికి వెళ్లడానికి బయలుదేరింది. అడ్రెస్ దొరకక పోవడంతో, చుట్టుపక్కల వారిని అడిగింది. కానీ వారు చెప్పింది కూడా అర్థంకాకపోవడంతో.. తను వెళ్లాల్సిన అడ్రెస్‌కు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడింది. మరోసారి ఆన్ లైన్ లో ఆర్డరిచ్చిన ప్యాకేజీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌కు తన అడ్రెస్ సరిగా అర్థం కాకపోవడంతో, ప్యాకేజీ ఇంటికి రావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో న్యూయార్క్‌లో అడ్రెస్‌లకు గూగుల్ మార్కింగ్ ఉన్నట్టే, ఇండియాలో కూడా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు, అనుకుని సహ వ్యవస్థాపకులు అయిన రజత్, మోహిత్ జైన్ లతో కలిసి ‘పతా’ యాప్‌ను రూపొందించింది. పతా.. అడ్రెస్‌ను ఖచ్చితంగా చూపించే యాపే ‘పతా’. మన డిజిటల్ అడ్రెస్‌ను పతా రూపొందిస్తోంది. ఇది కాంప్లెక్స్ అడ్రెస్‌కు ఒక కోడ్‌ను ఇస్తుంది. ఈ కోడ్ ఆఫీసు లేదా ఇంటి అడ్రెస్‌ను కచ్చితంగా చూపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న భవనాలను ఫొటోలతో సహా చూపిస్తుంది. దీనివల్ల అడ్రెస్‌ను పదేపదే వివరించాల్సిన పని ఉండదు. ఇంకా అడ్రెస్‌ను మన వాయిస్‌తో ఒకసారి రికార్డు చేసి షేర్ చేయవచ్చు. ఇదంతా ఒక్క క్లిక్‌తో అయ్యేలా చేస్తుంది పతా యాప్. ఈ యాప్ కోడ్‌తోపాటు మన వాయిస్‌తో అడ్రెస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పతా యాప్‌లో మన లొకేషన్స్ కు వచ్చిన కోడ్ లింక్‌ను.. మన అడ్రెస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, వారు గమ్యస్థానానికి సులభంగా చేరుకోగలుగుతారు. గతేడాది ‘అడ్రెస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించి, దీనిద్వారా పతా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక. ప్రస్తుతం ఈ యాప్ 50 లక్షలకు పైగా డౌన్ లోడ్స్‌తో దూసుకుపోతోంది. ‘పతా’ యాప్ సహ వ్యవస్థాపకులతో కృతిక -
‘దిశ వన్ స్టాప్’.. మహిళలపై వేధింపులకు ఫుల్స్టాప్
సాక్షి, అమరావతి: దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు వెనకంజ వేసే బాధిత మహిళలకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం నుంచి అవసరమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు వరకు పూర్తి బాధ్యత వహిస్తున్నాయి. దాంతో గతానికి భిన్నంగా బాధిత మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా సత్వర న్యాయాన్ని పొందుతున్నారు. ఐదు రకాలుగా భరోసా బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసే దిశగా రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లను తీర్చిదిద్దడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యాచరణ నిర్దేశించారు. దిశ వ్యవస్థ పరిధిలోకి వీటిని తీసుకువచ్చి ‘దిశ వన్‌స్టాప్ సెంటర్లు’గా తీర్చిదిద్దారు. దాంతో దిశ వన్‌స్టాప్ సెంటర్లు మహిళల సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ ఇన్స్పెక్టర్ సహా 18 మంది సిబ్బందిని నియమించింది. వీరిలో వీలైనంత వరకు మహిళలనే నియమించారు. ఈ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటూ బాధిత మహిళలకు ఐదు రకాల సేవలు అందిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. బాధిత మహిళలకు ఐదు రోజుల వరకు ఆశ్రయం కల్పించేందుకు వసతి ఏర్పాట్లు చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడే మహిళల పరిస్థితిని గుర్తించి వారికి తగిన సహాయం చేసి సమస్య పరిష్కారానికి వన్‌స్టాప్ సెంటర్లు చొరవ చూపిస్తున్నాయి. అందుకోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దిశ యాప్, 108 కమాండ్ కంట్రోల్, పోలీస్ స్టేషన్ల నుంచి వన్‌స్టాప్ సెంటర్లకు సమాచారం వస్తుంది. ఆ వెంటనే ఇక్కడి సిబ్బంది బాధిత మహిళలతో మాట్లాడి వారి సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. వారి సమస్య పూర్తి పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉంటున్నారు. గృహ హింస, బాల్య వివాహాల కేసుల్లో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యాచారం, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు అవసరమైన వైద్య పరీక్షల నిర్వహణ, అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు వరకు వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బంది బాధ్యత వహిస్తున్నారు. ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా కలిగేంత వరకు వన్‌స్టాప్ సెంటర్లే బాధ్యత తీసుకుంటుండటం విశేషం. 35 శాతం పెరిగిన కేసుల పరిష్కారం వన్‌స్టాప్ సెంటర్‌ను ఆశ్రయిస్తే చాలు తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది. మహిళలపై వేధింపులను ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణిస్తూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడమే దీనికి కారణం. దాంతో గతంలో కంటే బాధిత మహిళలు ధైర్యంగా వన్‌స్టాప్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. 2018 నాటితో పోలిస్తే వన్‌స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలపై వేధింపుల కేసుల పరిష్కారం 35 శాతం పెరగడం విశేషం. కొత్తగా 5 వన్‌స్టాప్ కేంద్రాల నిర్మాణం రాష్ట్రంలో ప్రస్తుతం 8 జిల్లా కేంద్రాల్లో వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భావనాలు ఉన్నాయి. మిగిలిన ఐదు జిల్లాల్లో కూడా వన్‌స్టాప్ సెంటర్లకు శాశ్వత భవనాలను నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో శాశ్వత భవనాలు 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. బాధిత మహిళలకు పూర్తి భరోసా బాధిత మహిళల సమస్యల పరిష్కారం కోసం వన్‌స్టాప్ సెంటర్లు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాయి. అవసరమైతే బాధిత మహిళల ఇంటికే సిబ్బంది వెళ్లి మరీ సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అవసరమైన మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నాం. తీవ్రమైన కేసుల్లో మహిళలకు వైద్య పరీక్షల నిర్వహణ, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకూ అన్నీ వన్‌స్టాప్ సెంటర్ల సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. – కృతికా శుక్లా, కమిషనర్, మహిళా–శిశు సంక్షేమ శాఖ -
మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం
సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని అమలు చేస్తోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, బాలికల పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఈనెల నుంచి ఉచితంగా న్యాప్కిన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.31.48 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాల్లో చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు న్యాప్కిన్లను అందిస్తున్నామన్నారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకోసారి పదేసి న్యాప్కిన్లను అందిస్తామన్నారు. దీని వల్ల రుతుక్రమం సమయంలో పాఠశాల, కాలేజీ మానేసే వారి సంఖ్యను తగ్గించడంతో పాటు వారి పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందన్నారు. న్యాప్కిన్ల పంపిణీ కోసం ఆయా విద్యా సంస్థల్లో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని, అధ్యాపకురాలిని నోడల్ అధికారిగా నియమించినట్టు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వైఎస్సార్ చేయూత స్టోర్స్‌లో నాణ్యమైన న్యాప్కిన్లను తక్కువ ధరకు విక్రయించేలా నిర్ణయం తీసుకున్నట్టు కృతికా శుక్లా తెలిపారు. -
న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
కర్నూలు (సెంట్రల్): కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని సుగాలి ప్రీతిబాయి తల్లిదండ్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా ఆదివారం కలిశారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రీతిబాయి కేసును విచారించాలని సీఎం వైఎస్ జగన్ కొంతకాలం క్రితం సీబీఐకి లేఖ రాశారు. అయితే ఈ కేసును సీబీఐ తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తదుపరి ఏమి చేద్దామన్న విషయంపై మాట్లాడేందుకు సీఎం వైఎస్ జగన్ తన ప్రతినిధిగా దిశా ప్రత్యేక అధికారి కృతికా శుక్లాను ప్రీతిబాయి తల్లిదండ్రులైన పార్వతీదేవి, రాజునాయక్‌ల దగ్గరకు పంపారు. ఆమె ఆదివారం కర్నూలులో వారిని కలసి చర్చించారు. తమ బిడ్డ మరణంపై సీబీఐ విచారణే కావాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి కృతికా శుక్లా స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రతి జిల్లాలో ‘దిశ’ ప్రత్యేక కోర్టు
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ–2019’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ చట్టం పరిరక్షణ ప్రత్యేకాధికారి కృతికా శుక్లా తెలిపారు. ఇందుకోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు, ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్, బోధనాస్పత్రుల్లో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఆస్పత్రుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లోనే కఠిన శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు. చట్టం అమలుకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనతోపాటు సిబ్బంది నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, సిబ్బందిని కూడా నియమిస్తామని తెలిపారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బాధితురాలు ఆస్పత్రిలో చేరిన ఆరు గంటల్లోనే వైద్య నివేదికలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఈనెల 7 నుంచి ‘దిశ యాప్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, కాల్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జనవరి నెలను ‘దిశ’ మాసంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు నాటికల్లా దిశ చట్టం అమలులోకి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్భయ చట్టం కంటే ఈ దిశ చట్టం ఎంతో పటిష్టమైనదని చెప్పారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించాల్సి ఉందని చెప్పారు. వైఎస్సార్ కిశోరి వికాస పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే వ్యక్తిగత రక్షణ (సెల్ఫ్ డిఫెన్స్)పై అవగాహన కల్పిస్తామని కృతికా శుక్లా తెలిపారు. -
క్రితిక దర్శకత్వంలో విజయ్‌ఆంటోని
సంగీత దర్శకుడు విజయ్‌ఆంటోని వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.సంగీతదర్శకుడుగా, కథానాయకుడిగా జోడు గుర్రాల సక్సెస్ స్వారీ చేస్తున్న ఈయన పిచ్చైక్కారన్ చిత్రంతో అసాధారణ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నటించిన సైతాన్ ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం యమన్ గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్న విజయ్‌ఆంటోని తదుపరి రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ స్వంత నిర్మాణ సంస్థలోనే నటించిన ఈయన తొలిసారిగా బయట సంస్థల్లో నటించనున్నారు.అందులో ఒకటి రాధిక, శరత్‌కుమార్ నిర్మించనున్న చిత్రం. ఇది త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. తాజాగా మరో చిత్రానికి విజయ్‌ఆంటోని సైతాన్ చేశారని తెలిసింది.ఇంతకు ముందు శివ, ప్రియఆనంద్ జంటగా వణక్కంచెన్నై వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన క్రితిక ఉదయనిధిస్టాలిన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.ఇందులో విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటించనున్నారట.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.