ప్రీతిబాయి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న కృతికా శుక్లా
కర్నూలు (సెంట్రల్): కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని సుగాలి ప్రీతిబాయి తల్లిదండ్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా ఆదివారం కలిశారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ప్రీతిబాయి కేసును విచారించాలని సీఎం వైఎస్ జగన్ కొంతకాలం క్రితం సీబీఐకి లేఖ రాశారు. అయితే ఈ కేసును సీబీఐ తీసుకోకపోవడంతో సందిగ్ధత నెలకొంది.
ఈ క్రమంలో తదుపరి ఏమి చేద్దామన్న విషయంపై మాట్లాడేందుకు సీఎం వైఎస్ జగన్ తన ప్రతినిధిగా దిశా ప్రత్యేక అధికారి కృతికా శుక్లాను ప్రీతిబాయి తల్లిదండ్రులైన పార్వతీదేవి, రాజునాయక్‌ల దగ్గరకు పంపారు. ఆమె ఆదివారం కర్నూలులో వారిని కలసి చర్చించారు. తమ బిడ్డ మరణంపై సీబీఐ విచారణే కావాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి కృతికా శుక్లా స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment