అయూబ్, జాన్ మనోజ్‌లపై జీవితకాల బహిష్కరణ
హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పదవిలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు... మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, మాజీ కార్యదర్శి జాన్ మనోజ్‌లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) జీవితకాల బహిష్కరణ విధించింది. ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ్ తెలిపారు. 2014 నుంచి 2016 వరకు అయూబ్, జాన్ మనోజ్‌లు హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించారు. ‘డెలాయిట్, ఇతర ఆడిట్ నివేదికల్లో అయూబ్, జాన్ మనోజ్‌లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలింది.
దీనికి సంబంధించి మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే వెంటనే బహిష్కరణ విధించాం. ఈ విషయంలో వారి నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయూబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాపై సస్పెన్షన్ విధించారు. దానికి ఇది కక్ష సాధింపు చర్యగా అనుకోకూడదు’ అని శేష్‌నారాయణ్ వివరించారు. అయూబ్, జాన్ మనోజ్‌లపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సమావేశం తీర్మానించిందని శేష్‌నారాయణ్ తెలిపారు.
అయూబ్, జాన్ మనోజ్ హయాంలో ఇతర కార్యవర్గ సభ్యులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయని... వారిపై కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. ఆధారాలు లభించగానే ఇతర సభ్యులపై కూడా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయూబ్, జాన్ మనోజ్‌లను సస్పెండ్ చేయడంతో... ఇక నుంచి వీరిద్దరికి చెందిన జట్లు హెచ్‌సీఏకు సంబంధించిన మ్యాచ్‌ల్లో ఆడే అర్హతను కోల్పోయాయి.
సమాచారం లేదు: అయూబ్
తనపై హెచ్‌సీఏ జీవితకాల బహిష్కరణ విధించిన విషయం అధికారికంగా తెలియదని అర్షద్ అయూబ్ వివరించారు. అధికారిక సమాచారం లభించాకే ఈ విషయంపై స్పందిస్తానని ఆయన అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు హెచ్‌సీఏ కార్యవర్గానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారమే లేదు. నేనైతే ఎలాంటి తప్పు చేయలేదు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదు’ అని భారత జట్టు మాజీ సభ్యుడైన అయూబ్ తెలిపారు.