Ayub
-
తమ్ముడూ.. ఇది తగునా
తాడిపత్రి: మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాలకు విరివిగా రుణాలు ఇచ్చి, తద్వారా వారి పురోభివృద్ధికి కృషి చేస్తుంటే.. ఇదే అదునుగా చూసి ఓ తెలుగు తమ్ముడు అడ్డదారిని ఎంచుకున్నాడు. బినామీల పేరిట డ్వాక్రా గ్రూపు ఏర్పాటు చేసి, బ్యాంకు ద్వారా వచ్చే రుణాలను స్వాహా చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. గత టీడీపీ హయాంలోనూ పసుపు– కుంకుమ పేరిట వచ్చిన రూ.2లక్షలు స్వాహా చేశాడు. ఇదేమని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నాడు. మొత్తం వ్యవహారంపై మహిళలు నిలదీయడంతో విషయం కాస్త బట్టబయలైంది. పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఆయూబ్‌బాషా ఏటిగడ్డపాలెంలో నివాసం ఉంటున్నాడు. తన భార్య కలైగర్ షమీనాతోపాటు మరో తొమ్మిది మంది మహిళలతో అఫ్రిన్ గ్రూప్ (ఎంపీఎస్ 12001401500) పేరుతో 2015 డిసెంబర్ 27న ఏర్పాటు చేశారు. ఆస్పత్రి పాలెంలోని బీమామిత్ర పర్వీన్ అడ్రస్‌తో గ్రూప్‌ను ఏర్పాటు చేయించాడు.ఏ ఒక్కరూ స్థానికులు గ్రూపులో లేరు. వాస్తవంగా పర్వీన్ అనే మహిళ కూతురు తస్లీం రీసోర్స్‌పర్సన్(ఆర్పీ)గా పనిచేస్తోంది. రీసోర్స్‌పర్సన్‌గా ఉన్న మహిళ భర్త రైల్వేశాఖలో ఉద్యోగి. ఆర్పీ తస్లీం పేరున ఆమె తల్లి పర్వీన్ గ్రూపు వ్యవహారాలను చూస్తోంది. ఏటిగడ్డ పాలెంకు చెందిన అచ్చుకట్ల షేకున్బీ, కలైగర్ షమీనా, ఫాబినా షమీమ్, కిష్టిపాడు షేకున్బీ, పామిడి హజీరా, షేక్ గౌసియా, షేక్ మహాబుబ్‌బీ, తసబ్ హసీనా, తేరన్నపల్లి హాబీదా గ్రూపుగా ఏర్పడ్డారు. రూ.3 లక్షలు స్వాహాకు యత్నం: 2015లో స్థానిక కెనరా బ్యాంకులో 3341101012850 నంబర్‌తో ఖాతాను ప్రారంభించారు. మొదట గ్రూపు సభ్యులకు రూ.లక్ష రుణాలు మంజూరు కాగా ఒక్కొక్కరికి టీడీపీ నాయకుడు రూ.10 వేలు పంపిణీ చేశాడు. రెండో సారి 2018 ఆగస్టు 20న గ్రూపులోని మహిళా సభ్యులకు రూ.2లక్షలు రుణాలు మంజూరైంది. ఒక్కొక్కరికి రూ.20 వేలు పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే పంపిణీ చేసి రూ.లక్ష స్వాహా చేశాడు. టీడీపీ హయాంలో మహిళలకు ఇచ్చిన పసుపు–కుంకుమ కానుక కింద రూ.2 లక్షలు స్వాహా చేసినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులు: ఇటీవల గ్రూపు మహిళలు 10 మందికి కెనరా బ్యాంకు రూ.3లక్షలు రుణం మంజూరు చేసింది. గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.30వేలు చొప్పున ఆ గ్రూప్ లీడరైన ఆయూబ్ సతీమణి కలైగర్ షమీనా పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఆయూబ్‌బాషా మహిళలను మభ్యపెట్టి రూ.5వేల చొప్పున తీసుకోవాలని సూచించాడు. దీంతో మహిళలందరూ నిరాకరించారు. మూకుమ్మడిగా బ్యాంకర్లు, మున్సిపాలిటీలోని మెప్మా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రూప్ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టారు. తనను ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు మహిళలు వాపోతున్నారు. రెండు విడతలుగా స్వాహా రెండు విడతలుగా రూ.15వేలు స్వాహా చేశాడు. తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వాలని ప్రశ్నిస్తే గ్రూపు నుండి తొలగిస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయమై బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్తే మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా గ్రూపుల సీఓకు ఫిర్యాదు చేయాలని బ్యాంకర్లు సూచించారు. – షేక్ మహబూబ్‌బీ పాసు పుస్తకాలు ఇవ్వలేదు టీడీపీ నాయకుడు ఆయూబ్ బాషా గ్రూపుకు సంబంధించిన పొదుపు సంఘానికి చెందిన పాసుపుస్తకాలు కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. పాసుపుస్తకాలు ఇవ్వాలని అడిగితే మొహం చాటేస్తున్నాడు. నాకు రావాల్సిన రూ.20 వేలు రెండు విడతలుగా స్వాహా చేశాడు. – షేక్ గౌసియా సున్నా వడ్డీ వసూలు నేను గ్రూపులో రెండో లీడర్. ఇంత వరకు పొదుపు సంఘం పాసుపుస్తకాలు ఇవ్వలేదు. రుణాల డబ్బు నేను చూడలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సున్నా వడ్డీ వర్తిస్తుందని ప్రకటించినా మాతో వడ్డీ వసూలు చేశాడు. మెప్మా నుంచిì గ్రూపునకు అందాల్సిన రాయితీలు ఏవీ అందలేదు. పసుపు–కుంకుమ కానుక కింద వచ్చిన రూ.2 లక్షలను స్వాహా చేశాడు. – తసబ్ హసీనా -
నటుడు నాజర్‌పై ఆరోపణలు
సాక్షి, చెన్నై : వృద్ధాప్యంలో, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను నటుడు నాజర్ పట్టించుకోవడం లేదని, వారికి ఆర్థిక సాయం చేయకున్నా కనీసం పరామర్శించడానికి కూడా రావడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. ఈ విషయంలో నాజర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం చెన్నైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు. ఈయన నిర్మాతగా, దర్శకుడిగా కూడా చిత్రాలు చేశారు. ప్రస్తుతం దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగాను పదవిలో ఉన్నారు. అంతేకాదు. నాజర్ భార్య కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ చెన్నై స్థానం నుంచి పోటీ చేశారు. కాగా, నాజర్ తమకు ఎలాంటి సాయం చేయడం లేదని, తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చిన వీరు తాజాగా మరోసారి నాజర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాజర్ తమ్ముళ్లు జవహర్, ఆయుబ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ తాము నలుగురు అన్నదమ్ములమని అందులో నాజర్నే పెద్ద వాడని తెలిపారు. వివాహనంతరం తమ కుటుంబానికి దూరంగా వెళ్లిపోయాడని చెప్పారు. మిగిలిన ముగ్గురిలో చివరి సోదరుడు మానసికంగా వ్యాధిగ్రస్తుడని తెలిపారు. దీంతో తామిద్దరమే కుటుంబ భారాన్ని మోసుకొస్తున్నట్లు చెప్పారు. తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంతో, అనారోగ్యానికి గురయ్యారన్నారు. కాగా, నటుడిగా బాగా సంపాదించిన నాజర్ తన భార్య పిల్లలకే ఖర్చు చేసుకుంటున్నాడు గానీ, తమకెలాంటి సాయం అదించడం లేదన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోకపోగా, కనీసం వారిని చూడడానికి కూడా రావడంలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాజర్ స్పందించకపోతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అయూబ్, జాన్ మనోజ్‌లపై జీవితకాల బహిష్కరణ
హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పదవిలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు... మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, మాజీ కార్యదర్శి జాన్ మనోజ్‌లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) జీవితకాల బహిష్కరణ విధించింది. ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ్ తెలిపారు. 2014 నుంచి 2016 వరకు అయూబ్, జాన్ మనోజ్‌లు హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులుగా వ్యవహరించారు. ‘డెలాయిట్, ఇతర ఆడిట్ నివేదికల్లో అయూబ్, జాన్ మనోజ్‌లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలింది. దీనికి సంబంధించి మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే వెంటనే బహిష్కరణ విధించాం. ఈ విషయంలో వారి నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయూబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాపై సస్పెన్షన్ విధించారు. దానికి ఇది కక్ష సాధింపు చర్యగా అనుకోకూడదు’ అని శేష్‌నారాయణ్ వివరించారు. అయూబ్, జాన్ మనోజ్‌లపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సమావేశం తీర్మానించిందని శేష్‌నారాయణ్ తెలిపారు. అయూబ్, జాన్ మనోజ్ హయాంలో ఇతర కార్యవర్గ సభ్యులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయని... వారిపై కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. ఆధారాలు లభించగానే ఇతర సభ్యులపై కూడా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయూబ్, జాన్ మనోజ్‌లను సస్పెండ్ చేయడంతో... ఇక నుంచి వీరిద్దరికి చెందిన జట్లు హెచ్‌సీఏకు సంబంధించిన మ్యాచ్‌ల్లో ఆడే అర్హతను కోల్పోయాయి. సమాచారం లేదు: అయూబ్ తనపై హెచ్‌సీఏ జీవితకాల బహిష్కరణ విధించిన విషయం అధికారికంగా తెలియదని అర్షద్ అయూబ్ వివరించారు. అధికారిక సమాచారం లభించాకే ఈ విషయంపై స్పందిస్తానని ఆయన అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు హెచ్‌సీఏ కార్యవర్గానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారమే లేదు. నేనైతే ఎలాంటి తప్పు చేయలేదు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదు’ అని భారత జట్టు మాజీ సభ్యుడైన అయూబ్ తెలిపారు. -
అయూబ్ తదితరులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్, ఇతర కార్యవర్గ సభ్యులకు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 18న నమోదు చేసిన కేసులో వారిని అరెస్ట్ చేయవద్దని ఉప్పల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మూడు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆడిటర్లు, ఇతర సభ్యులతో కుమ్మక్కై ఖాతాలను తారుమారు చేశారని, ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారంటూ టి. శేష్ నారాయణ్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెండర్ల జారీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ పోలీసులు అర్షద్ అయూబ్, పురుషోత్తం అగర్వాల్ తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో వారి అరెస్ట్‌పై స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
హెచ్‌సీఏలో ఎన్నికలు నిర్వహించండి
హైదరాబాద్: లోధా కమిటీ సిఫారసులను అనుసరించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు జి.వినోద్ డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. హెచ్‌సీఏలో ప్రకాశ్ చంద్ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న అడ్హాక్ కమిటీతో కలసి ఆయన శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 20న నిర్వహించిన హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని అయూబ్ రెండు నిమిషాల్లోనే ముగించారు. లోధా కమిటీ సూచనలను పాటిస్తామని అసోసియేషన్ అంగీకరించింది. ఇదే జరిగితే ఆ వెంటనే అయూబ్ అనర్హులవుతారు. ఇంకా ఆయనకు కొనసాగే నైతిక హక్కు లేదు. అందుకే డిసెంబర్ 24న ఎన్నికలు జరపాలని అడ్హాక్ కమిటీ నిర్ణరుుంచింది’ అని వినోద్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హెచ్‌సీఏలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం తరఫున సలహాదారుడిని నియమించాలని కూడా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శేష్ నారాయణ్, బాబూరావు సాగర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అడగని ప్రశ్న.. చెప్పని జవాబు
జియా ఉల్ హఖ్, భుట్టోను కూలదోయడానికి ముందు... పాకిస్తాన్‌లోని ఉన్నత వర్గాలవారు పెద్ద దొరల్లా ప్రవర్తించేవారు. అధికారులంతా ఆంగ్లీకరణం చెందిన బ్రిటిష్ రాజ్ బిడ్డలే. రాజకీయ జోక్యం ఏమంతగా లేకుండా వారే దేశాన్ని పాలించారు. భారత ప్రభుత్వం నేడు వారికి పూర్తిగా భిన్నమైన పాక్ ప్రభుత్వంతో వ్యవహరించాల్సి ఉంది. నేడు అక్కడ అధికారంలో ఉన్నవారెవరైనా... ఎన్నికల్లో నెగ్గినవారైనా సరే మత ఛాందసవాదులతో రాజీ పడనిదే మనుగడ సాగించలేరు. ఎలాంటి శాంతి ప్రక్రియకైనా ఉన్న అడ్డంకుల్లో అది ఒకటి. భారత, పాకిస్తాన్ల మధ్య జరిగిన 1965 యుద్ధానికి సంబంధించి ఒక ప్రశ్నను ఎవరూ అడగలేదు. కాబట్టి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న చిన్నదే అయినా ప్రాధాన్యంగలది. పాకిస్తాన్ రెండు దశలుగా చేపట్టిన ఆ యుద్ధంలోని మొదటి భాగానికి అది ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ అని ఎందుకు పేరు పెట్టింది? పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి పంపిన మిలీషియా బలగాలు తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్న కశ్మీరీల్లా నటిస్తుండగా చేపట్టిన సైనిక చర్య అది. దానికి ఇంకా బ్రిటన్ అధీనంలోనే ఉన్న స్పెయిన్ తీరంలోని ఒక చిన్న రాతి ద్వీపం పేరును ఎందుకు పెట్టినట్టు? మోసగిం చడానికి ఉద్దేశించినది అయితే తప్ప... అది విడ్డూరమనిపించకపోయి నా విలక్షణమైనదని అనిపిస్తుంది. కానీ ఆ పేరుకు, పాకిస్తాన్ మిలి టెంట్ల మదిలో మారుమోగేటంతటి ఓ అర్థముంది. ప్రపంచ చరిత్రనే మార్చేసిన ముస్లిం అరబ్బుల విజయానికి తెర దీసిన వేదికగా జిబ్రాల్టర్ చరిత్రలో ఊపిరిపోసుకుంది. చాలా ప్రదేశాల స్పానిష్ పేర్లలాగానే అది అపభ్రంశ రూపం పొందిన అరబిక్ పేరు. తారిఖ్ ఇబన్ జియాద్, విసిగోత్ రాజు రోడ్రిక్ను ఓడించడంతో ఐబీరి యన్ ద్వీపకల్పంపైన ముస్లింల పరిపాలన ఆ తదుపరి సహస్రాబ్ది మధ్య వరకు కొనసాగడానికి పునాదులు పడ్డాయి. అందుకే ఆ ద్వీపానికి అరబ్బులు ‘జబల్ తారిఖ్ ’ (తారిఖ్ పర్వతం) అని పేరు పెట్టారు. అదే జిబ్రాల్టర్ అయింది. అరబ్బులు దిగ్భ్రాంతికరమైన మెరుపు విజయం సాధిం చారు. ఆ తదుపరి ‘‘అరబ్బులు పడమటి నుంచి తూర్పునకు సాగ డానికి బదులుగా పడమటికే తిరిగి ఉంటే బ్రిటన్ సైతం పతనమై ఉండేదిగావచ్చు, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి టవర్లకు బదులు మినార్లు దర్శనమిచ్చేవి గావచ్చు.’’ ఇది ‘ద హిస్టరీ ఆఫ్ ద డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్’ను రచించిన సుప్రసిద్ధ చరిత్రకారుడు ఎడ్వర్డ్ గిబ్బన్ అభిప్రాయం. నాటి పాకిస్తాన్ నియంత జనరల్ అయూబ్ ఖాన్ వాస్తవికవాదని చాలామంది అంటుంటారు. కాబట్టి ఆ యుద్ధంలో ఆయన ఆకాంక్షలు ఏమిటో అంత ఇదమిద్ధంగా చెప్పలేను. కానీ జిబ్రాల్టర్ పేరు ఆయన యువ విదేశాంగ మంత్రి జుల్ఫీకర్ ఆలీ భుట్టో స్వప్నాలను మాత్రం కచ్చితంగా ప్రతిబింబించింది. 1965 నాటి జమ్మూకశ్మీర్ దురాక్రమణ దాడికి ప్రధాన రూపకర్త ఆయనే. బహుశా భుట్టోతో పోలిస్తే మాత్రమే అయూబ్‌ఖాన్ వాస్తవికవాదై ఉండాలి. 1971లో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోయినప్పటికీ, భుట్టో మాత్రం భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉండేవారు. 1965 ఆకురాలు కాలంలో పాకిస్తాన్ తన రెండు దశల దురాక్రమణ పథకాన్ని ప్రారంభించింది. తమ సైనికాధికారుల నేతృత్వంలో పాక్... తన సేనలతో పాటూ తామే శిక్షణ ఇచ్చి తర్ఫీదు చేసిన మిలీషియా సేనలను తిరుగుబాటుకు ‘ఆధారం’గా రంగంలోకి దించింది. ఇది, సరిగ్గా 1947-48 నాటి దురాక్రమణకు ప్రతిబింబంలాగా సాగింది. ఇక రెండవ దశ ‘ఆపరేషన్ గ్రాండ్ స్లామ్’. దీన్ని పాక్ సైన్యం తన సంప్రదాయక దళాలతో సాగించినది. కొంత తీవ్ర పోరాటం తదుపరి రెండూ దానికే బెడిసికొట్టాయి. సరిహద్దు రేఖ వెంబడి పాక్ తన భూభాగాన్ని పోగొట్టుకోవడం ప్రారంభమైంది. అవివే కంతో కూడిన ఆ వైఫల్యపు అంతర్జాతీయ అపఖ్యాతిని అది ఇంకా పోగొట్టుకోలేకపోతోంది. ఇంతకూ ఈ రెండో దశ పేరులో కూడా ఏదైనా ఆధారం దాగి ఉందా? ‘గ్రాండ్ స్లామ్’ అనేది బ్రిడ్జి (ఆట) నుంచి వచ్చిందని అందరికీ తెలిసిందే. అందులోనూ గ్రాండ్ స్లామ్ అంటేనే బ్రిడ్జి ఆటలోని అత్యున్నత స్థాయిదైన కాంట్రాక్టు బ్రిడ్జి. కాబట్టి గ్రాండ్ స్లామ్ అంటే అదే గొప్ప విజ యం. కానీ కాల్పుల విరమణ జరిగేటప్పటికి, ఆ సైనిక చర్యకు సంబంధించి గొప్పదనేది ఏమీ మిగల్లేదు. కాంట్రాక్టు కాస్తా శకలాలుగా ముగిసింది. అయితే ఆ పేరు మాత్రం దాని ఆలోచనా విధానాన్ని సూచిస్తుంది. జనరల్ జియా ఉల్ హఖ్, భుట్టోను కూలదోయడానికి ముందు వరకు... పాకిస్తాన్‌లోని ఉన్నత వర్గాల వారు ఇస్లామిక్ ధోరణిగల పెద్ద దొరల్లాగా (బుర్రా సాహెబ్) ప్రవర్తించే వారు. అత్యున్నతాధికారులు, అధికారులంతా ఆంగ్లీకరణం చెందిన బ్రిటిష్ రాజ్ బిడ్డలే. ఎన్నికైన రాజకీయ వర్గం జోక్యం ఏమంత లేకుండానే దేశాన్ని వారే పాలించారు. కరాచీ, రావల్పిండి (జనరల్ అయూబ్ ఖాన్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉండేది), ఇస్లామాబాద్‌ల వంటి అధికార కేంద్రాలకు వారు తమతోపాటూ ఆ దేశపు అభిరుచులను, పక్షపాత వైఖరులను కూడా పట్టుకొచ్చి ఉంటారు. ఈ అతి విశిష్టుల దర్బారు.. క్లబ్బు నిబంధనలను, ఆచా రాలను అనుసరిస్తూ జీవించేది. మంచి ఇంగ్లిష్ మాట్లాడే తామే పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వ హిస్తున్న వారమని వారు భావించే వారు. దేశానికి తాము చాలా అవసరమని ఉదారంగా అనుకునేవారు. రాజకీయంగా ప్రయోజనకరం అనిపిస్తే అప్పుడప్పుడూ ఇస్లాం పట్ల విధేయతను చూపేవారంతే. భుట్టో విస్కీ తాగడాన్ని ఛాందస వాదులు తప్పు పడితే, ఆయన నేను విస్కీ తాగుతున్నానే తప్ప ప్రజల రక్తాన్ని కాదని బదులు చెప్పేటంతటి ఔద్ధత్యాన్ని ప్రదర్శించేవాడు. ఈ వర్గం వాషింగ్టన్, లండన్లలోని, ప్రత్యేకించి ‘పెంటగాన్’, ‘సాంధర్ట్స్’ (బ్రిటన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం) లోని వారి పథ నిర్దేశకులకు సామాజికంగానూ, సాంస్కృతికం గానూ, రాజకీయంగానూ ఆకర్షణీయంగా కనిపించేవారు. భారత ప్రభుత్వం ఇప్పుడు వారికంటే పూర్తిగా భిన్నమైన పాకిస్తాన్ ప్రభుత్వంతో వ్యవహరించాల్సి ఉంది. అక్కడ అధికారంలో ఉన్నామని చెప్పు కునేవారు ఎవరైనాగానీ, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారా అధికారంలో ఉన్నాగానీ... మత ఛాందసవాదులతో రాజీ పడనిదే మనుగడ సాగించలే మని వారికి తెలుసు. ఎలాంటి రూపంలోని శాంతి ప్రక్రియకైనా ఉన్న అడ్డంకుల్లో అది ఒకటి. మన దేశంలో భుట్టో లేరే అని చింతించేవారు ఎవరైనా ఉంటారని నేను అనుకోను. అయూబ్ ఖాన్ గురించో, ఆయనకు ముందున్న వారి గురించో కొంత ఆలోచించే వారుండొచ్చు. ఆ తలబిరుసు పౌర సహాయకునికంటే జనరల్ అయూబ్కే యుద్ధం గురించి బాగా అర్థమై ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి) - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
ఎన్ఐఏ విచారణ వేగవంతం
సూర్యాపేట, జానకీపురం ఘటనలపై ఎస్పీస్థాయి అధికారి నేతృత్వంలో విచారణ బస్టాండ్‌కు, ఎన్కౌంటర్ ఘటనాస్థలికి, అర్వపల్లి దర్గాకు ఎన్ ఐఏ బృందం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో సమీక్ష అయూబ్ మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు కూంబింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన పోలీసులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాను సంచలనాలకు కేంద్రబిందువుగా నిలబెట్టిన సూర్యాపేట హైటెక్‌బస్టాండ్ కాల్పులు, జానకీపురం ఎన్కౌంటర్ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే రెండు స్థలాలను గత రెండు రోజులుగా పరిశీలిస్తున్న ఎన్ఐఏ బృందం మంగళవారం మరోసారి ఘటన స్థలాలకు వెళ్లింది. ఎస్పీ స్థాయి అధికారి ప్రతిభ నేతృత్వంలోని ఎన్ఐఏ బృందం బస్టాండ్, జాన కీపురం ఘటన స్థలాలతో పాటు దుండగులు తలదాచుకున్నారని భావిస్తున్న అర్వపల్లి దర్గా, తుంగతుర్తి పోలీసులపై దుండగులు కాల్పులు జరిపిన సీతారాంపురం సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ, అర్వపల్లి మండల కేంద్రంలో బెదిరించిన బైక్ లాక్కెళ్లిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానిక పోలీసులు, గ్రామస్తులను అడిగి వివరాలను సేకరించారు. అంతకు ముందు సూర్యాపేటలోని డీఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ కూడా హాజరయ్యారు. అనంతరం ఆయన కూడా ఎన్ఐఏ బృందంతో పాటు ఘటనాస్థలాలకు వెళ్లాల్సి ఉన్నా ఆలేరులో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లిపోయారు. నార్కట్‌పల్లిలో అయూబ్ అంత్యక్రియలు కాగా, శనివారం మోత్కూరు మండలం జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు దుండగుల్లో ఒకరైన అస్లాం అయూబ్‌కు మంగళవారం నార్కట్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అయూబ్‌కు సంబంధించిన వారు ఎవరూ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు రాకపోవడంతో ఇస్లాం సంప్రదాయం ప్రకారం నార్కట్‌పల్లిలోనే ఆయనను ఖననం చేశారు. అయితే, ఎన్కౌంటర్లో చనిపోయిన మరో దుండగుడు ఎజాజుద్దీన్ మృతదేహాన్ని సోమవారం ఆయన తండ్రి తీసుకెళ్లిన విషయం విదితమే. అయూబ్ ఖననం కూడా పూర్తికావడంతో ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు దుండగుల కథ ముగిసినట్టయింది. మరోవైపు, ఆలేరు ఘటన నేపథ్యంలో అందరి దృష్టి అటువైపునకు మళ్లింది. నిన్నటి వరకు అర్వపల్లి గుట్టలు, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలను జల్లెడ పట్టి గాలించిన పోలీసులు తాత్కాలికంగా కూంబింగ్ నిలిపివేశాయి. ఏదిఏమైనా ఆలేరు ఘటన నేపథ్యంలో జానకీపురం ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు దుండగులతో పాటు మరో ఇద్దరు మిగిలే ఉన్నారన్న వార్తలతో జిల్లా ప్రజల్లో ఆందోళన తొలగిపోలేదు. వారి గురించి పోలీసులు స్పష్టతనిస్తేనే ఈ ఆందోళన తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ఐఏ అధికారుల పరిశీలన అర్వపల్లి/మోత్కూరు: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అర్వపల్లితో పాటు జానకీపరం లలో పర్యటించారు.ఎన్ఐఏ ఎస్పీ ప్రతిభ, సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్‌లు అర్వపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కాల్పులకు సంబంధించి కేసును పరిశీలించారు. దర్గా, అర్వపల్లి గుట్ట, కాల్పులు జరిగిన సీతారాంపురంలోని ప్రాంతాన్ని, అర్వపల్లి చౌరస్తాలను వారు పరిశీలించారు. జానకీపురంలో ఎదురుకాల్పులు జరిగిన పరిస్థితులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. -
టెన్నిస్ చాంప్స్ అయూబ్, శ్రీవల్లి
ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఐటా టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో అమాన్ అయూబ్‌ఖాన్, శ్రీవల్లి రష్మిక టైటిల్స్ సాధించారు. సూర్య టెన్నిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని పల్లవి స్కూల్ ప్లే గ్రౌండ్స్‌లో జరిగిన తుదిపోరులో అయూబ్, శ్రీవల్లి గెలిచారు. బాలుర అండర్-14 ఫైనల్లో మూడో సీడ్ అయూబ్ ఖాన్ 6-4, 6-4తో నాలుగో సీడ్ సిక్కా సంచిత్పై గెలుపొందాడు. బాలికల టైటిల్ పోరులో టాప్ సీడ్ శ్రీవల్లి రష్మిక 6-2, 6-2తో రెండో సీడ్ ఐశ్వర్యపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆర్మీ బ్రిగేడ్ కల్నల్ రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్నిస్ సంఘం (ఏపీఎల్టీఏ) సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ భార్గవ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ డెరైక్టర్ ఏఆర్ రావు పాల్గొన్నారు.