ఎన్‌ఐఏ విచారణ వేగవంతం | NIA inquiry Speed | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ విచారణ వేగవంతం

Published Wed, Apr 8 2015 3:12 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ఎన్‌ఐఏ విచారణ వేగవంతం - Sakshi

ఎన్‌ఐఏ విచారణ వేగవంతం

 సూర్యాపేట, జానకీపురం ఘటనలపై ఎస్పీస్థాయి అధికారి నేతృత్వంలో విచారణ
 బస్టాండ్‌కు, ఎన్‌కౌంటర్ ఘటనాస్థలికి, అర్వపల్లి దర్గాకు ఎన్ ఐఏ బృందం
 సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో సమీక్ష
 అయూబ్ మృతదేహానికి
 సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
 కూంబింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన పోలీసులు

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాను సంచలనాలకు కేంద్రబిందువుగా నిలబెట్టిన సూర్యాపేట హైటెక్‌బస్టాండ్ కాల్పులు, జానకీపురం ఎన్‌కౌంటర్ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే రెండు స్థలాలను గత రెండు రోజులుగా పరిశీలిస్తున్న ఎన్‌ఐఏ బృందం మంగళవారం మరోసారి ఘటన స్థలాలకు వెళ్లింది. ఎస్పీ స్థాయి అధికారి ప్రతిభ నేతృత్వంలోని  ఎన్‌ఐఏ బృందం బస్టాండ్, జాన కీపురం ఘటన స్థలాలతో పాటు దుండగులు తలదాచుకున్నారని భావిస్తున్న అర్వపల్లి దర్గా, తుంగతుర్తి పోలీసులపై దుండగులు కాల్పులు జరిపిన సీతారాంపురం సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ, అర్వపల్లి మండల కేంద్రంలో బెదిరించిన బైక్ లాక్కెళ్లిన స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానిక పోలీసులు, గ్రామస్తులను అడిగి వివరాలను సేకరించారు. అంతకు ముందు సూర్యాపేటలోని డీఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ కూడా హాజరయ్యారు. అనంతరం ఆయన కూడా ఎన్‌ఐఏ బృందంతో పాటు ఘటనాస్థలాలకు వెళ్లాల్సి ఉన్నా ఆలేరులో ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఆయన అక్కడకు వెళ్లిపోయారు.
 
 నార్కట్‌పల్లిలో అయూబ్ అంత్యక్రియలు
 కాగా, శనివారం మోత్కూరు మండలం జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు దుండగుల్లో ఒకరైన అస్లాం అయూబ్‌కు మంగళవారం నార్కట్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అయూబ్‌కు సంబంధించిన వారు ఎవరూ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు రాకపోవడంతో ఇస్లాం సంప్రదాయం ప్రకారం నార్కట్‌పల్లిలోనే ఆయనను ఖననం చేశారు. అయితే, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మరో దుండగుడు ఎజాజుద్దీన్ మృతదేహాన్ని సోమవారం ఆయన తండ్రి తీసుకెళ్లిన విషయం విదితమే. అయూబ్ ఖననం కూడా పూర్తికావడంతో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు దుండగుల కథ ముగిసినట్టయింది. మరోవైపు, ఆలేరు ఘటన నేపథ్యంలో అందరి దృష్టి అటువైపునకు మళ్లింది. నిన్నటి వరకు అర్వపల్లి గుట్టలు, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలను జల్లెడ పట్టి గాలించిన పోలీసులు తాత్కాలికంగా కూంబింగ్ నిలిపివేశాయి. ఏదిఏమైనా ఆలేరు ఘటన నేపథ్యంలో జానకీపురం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు దుండగులతో పాటు మరో ఇద్దరు మిగిలే ఉన్నారన్న వార్తలతో జిల్లా ప్రజల్లో ఆందోళన తొలగిపోలేదు. వారి గురించి పోలీసులు స్పష్టతనిస్తేనే ఈ ఆందోళన తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 ఎన్‌ఐఏ అధికారుల పరిశీలన
 అర్వపల్లి/మోత్కూరు:     జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అర్వపల్లితో పాటు జానకీపరం లలో పర్యటించారు.ఎన్‌ఐఏ ఎస్పీ ప్రతిభ, సూర్యాపేట డీఎస్పీ ఎంఏ రషీద్‌లు  అర్వపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కాల్పులకు సంబంధించి కేసును పరిశీలించారు.  దర్గా, అర్వపల్లి గుట్ట, కాల్పులు జరిగిన సీతారాంపురంలోని ప్రాంతాన్ని, అర్వపల్లి చౌరస్తాలను వారు పరిశీలించారు. జానకీపురంలో  ఎదురుకాల్పులు జరిగిన  పరిస్థితులను  గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement