సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్, ఇతర కార్యవర్గ సభ్యులకు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 18న నమోదు చేసిన కేసులో వారిని అరెస్ట్ చేయవద్దని ఉప్పల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మూడు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఆడిటర్లు, ఇతర సభ్యులతో కుమ్మక్కై ఖాతాలను తారుమారు చేశారని, ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారంటూ టి. శేష్ నారాయణ్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెండర్ల జారీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ పోలీసులు అర్షద్ అయూబ్, పురుషోత్తం అగర్వాల్ తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో వారి అరెస్ట్‌పై స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.