హైదరాబాద్: లోధా కమిటీ సిఫారసులను అనుసరించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు జి.వినోద్ డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. హెచ్‌సీఏలో ప్రకాశ్ చంద్ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న అడ్‌హాక్ కమిటీతో కలసి ఆయన శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 20న నిర్వహించిన హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని అయూబ్ రెండు నిమిషాల్లోనే ముగించారు. లోధా కమిటీ సూచనలను పాటిస్తామని అసోసియేషన్ అంగీకరించింది.
ఇదే జరిగితే ఆ వెంటనే అయూబ్ అనర్హులవుతారు. ఇంకా ఆయనకు కొనసాగే నైతిక హక్కు లేదు. అందుకే డిసెంబర్ 24న ఎన్నికలు జరపాలని అడ్‌హాక్ కమిటీ నిర్ణరుుంచింది’ అని వినోద్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హెచ్‌సీఏలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం తరఫున సలహాదారుడిని నియమించాలని కూడా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శేష్ నారాయణ్, బాబూరావు సాగర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.