1965 నాటి పాక్ నియంత అయూబ్ (కుడి)తో జుల్ఫీకర్ అలీ భుట్టో (ఎడమ)
జియా ఉల్ హఖ్, భుట్టోను కూలదోయడానికి ముందు... పాకిస్తాన్‌లోని ఉన్నత వర్గాలవారు పెద్ద దొరల్లా ప్రవర్తించేవారు. అధికారులంతా ఆంగ్లీకరణం చెందిన బ్రిటిష్ రాజ్ బిడ్డలే. రాజకీయ జోక్యం ఏమంతగా లేకుండా వారే దేశాన్ని పాలించారు. భారత ప్రభుత్వం నేడు వారికి పూర్తిగా భిన్నమైన పాక్ ప్రభుత్వంతో వ్యవహరించాల్సి ఉంది. నేడు అక్కడ అధికారంలో ఉన్నవారెవరైనా... ఎన్నికల్లో నెగ్గినవారైనా సరే మత ఛాందసవాదులతో రాజీ పడనిదే మనుగడ సాగించలేరు. ఎలాంటి శాంతి ప్రక్రియకైనా ఉన్న అడ్డంకుల్లో అది ఒకటి.
భారత, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన 1965 యుద్ధానికి సంబంధించి ఒక ప్రశ్నను ఎవరూ అడగలేదు. కాబట్టి ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న చిన్నదే అయినా ప్రాధాన్యంగలది. పాకిస్తాన్ రెండు దశలుగా చేపట్టిన ఆ యుద్ధంలోని మొదటి భాగానికి అది ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ అని ఎందుకు పేరు పెట్టింది? పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి పంపిన మిలీషియా బలగాలు తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్న కశ్మీరీల్లా నటిస్తుండగా చేపట్టిన సైనిక చర్య అది. దానికి ఇంకా బ్రిటన్ అధీనంలోనే ఉన్న స్పెయిన్ తీరంలోని ఒక చిన్న రాతి ద్వీపం పేరును ఎందుకు పెట్టినట్టు? మోసగిం చడానికి ఉద్దేశించినది అయితే తప్ప... అది విడ్డూరమనిపించకపోయి నా విలక్షణమైనదని అనిపిస్తుంది. కానీ ఆ పేరుకు, పాకిస్తాన్ మిలి టెంట్ల మదిలో మారుమోగేటంతటి ఓ అర్థముంది.
ప్రపంచ చరిత్రనే మార్చేసిన ముస్లిం అరబ్బుల విజయానికి తెర దీసిన వేదికగా జిబ్రాల్టర్ చరిత్రలో ఊపిరిపోసుకుంది. చాలా ప్రదేశాల స్పానిష్ పేర్లలాగానే అది అపభ్రంశ రూపం పొందిన అరబిక్ పేరు. తారిఖ్ ఇబన్ జియాద్, విసిగోత్ రాజు రోడ్రిక్‌ను ఓడించడంతో ఐబీరి యన్ ద్వీపకల్పంపైన ముస్లింల పరిపాలన ఆ తదుపరి సహస్రాబ్ది మధ్య వరకు కొనసాగడానికి పునాదులు పడ్డాయి. అందుకే ఆ ద్వీపానికి అరబ్బులు ‘జబల్ తారిఖ్ ’ (తారిఖ్ పర్వతం) అని పేరు పెట్టారు. అదే జిబ్రాల్టర్ అయింది. అరబ్బులు దిగ్భ్రాంతికరమైన మెరుపు విజయం సాధిం చారు. ఆ తదుపరి ‘‘అరబ్బులు పడమటి నుంచి తూర్పునకు సాగ డానికి బదులుగా పడమటికే తిరిగి ఉంటే బ్రిటన్ సైతం పతనమై ఉండేదిగావచ్చు, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి టవర్లకు బదులు మినార్లు దర్శనమిచ్చేవి గావచ్చు.’’ ఇది ‘ద హిస్టరీ ఆఫ్ ద డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్’ను రచించిన సుప్రసిద్ధ చరిత్రకారుడు ఎడ్వర్డ్ గిబ్బన్ అభిప్రాయం.
నాటి పాకిస్తాన్ నియంత జనరల్ అయూబ్ ఖాన్ వాస్తవికవాదని చాలామంది అంటుంటారు. కాబట్టి ఆ యుద్ధంలో ఆయన ఆకాంక్షలు ఏమిటో అంత ఇదమిద్ధంగా చెప్పలేను. కానీ జిబ్రాల్టర్ పేరు ఆయన యువ విదేశాంగ మంత్రి జుల్ఫీకర్ ఆలీ భుట్టో స్వప్నాలను మాత్రం కచ్చితంగా ప్రతిబింబించింది. 1965 నాటి జమ్మూకశ్మీర్ దురాక్రమణ దాడికి ప్రధాన రూపకర్త ఆయనే. బహుశా భుట్టోతో పోలిస్తే మాత్రమే అయూబ్‌ఖాన్ వాస్తవికవాదై ఉండాలి. 1971లో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోయినప్పటికీ, భుట్టో మాత్రం భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉండేవారు.
1965 ఆకురాలు కాలంలో పాకిస్తాన్ తన రెండు దశల దురాక్రమణ పథకాన్ని ప్రారంభించింది. తమ సైనికాధికారుల నేతృత్వంలో పాక్... తన సేనలతో పాటూ తామే శిక్షణ ఇచ్చి తర్ఫీదు చేసిన మిలీషియా సేనలను తిరుగుబాటుకు ‘ఆధారం’గా రంగంలోకి దించింది. ఇది, సరిగ్గా 1947-48 నాటి దురాక్రమణకు ప్రతిబింబంలాగా సాగింది. ఇక రెండవ దశ ‘ఆపరేషన్ గ్రాండ్ స్లామ్’. దీన్ని పాక్ సైన్యం తన సంప్రదాయక దళాలతో సాగించినది. కొంత తీవ్ర పోరాటం తదుపరి రెండూ దానికే బెడిసికొట్టాయి. సరిహద్దు రేఖ వెంబడి పాక్ తన భూభాగాన్ని పోగొట్టుకోవడం ప్రారంభమైంది. అవివే కంతో కూడిన ఆ వైఫల్యపు అంతర్జాతీయ అపఖ్యాతిని అది ఇంకా పోగొట్టుకోలేకపోతోంది. ఇంతకూ ఈ రెండో దశ పేరులో కూడా ఏదైనా ఆధారం దాగి ఉందా?
‘గ్రాండ్ స్లామ్’ అనేది బ్రిడ్జి (ఆట) నుంచి వచ్చిందని అందరికీ తెలిసిందే. అందులోనూ గ్రాండ్ స్లామ్ అంటేనే బ్రిడ్జి ఆటలోని అత్యున్నత స్థాయిదైన కాంట్రాక్టు బ్రిడ్జి. కాబట్టి గ్రాండ్ స్లామ్ అంటే అదే గొప్ప విజ యం. కానీ కాల్పుల విరమణ జరిగేటప్పటికి, ఆ సైనిక చర్యకు సంబంధించి గొప్పదనేది ఏమీ మిగల్లేదు. కాంట్రాక్టు కాస్తా శకలాలుగా ముగిసింది. అయితే ఆ పేరు మాత్రం దాని ఆలోచనా విధానాన్ని సూచిస్తుంది.
జనరల్ జియా ఉల్ హఖ్, భుట్టోను కూలదోయడానికి ముందు వరకు... పాకిస్తాన్‌లోని ఉన్నత వర్గాల వారు ఇస్లామిక్ ధోరణిగల పెద్ద దొరల్లాగా (బుర్రా సాహెబ్) ప్రవర్తించే వారు. అత్యున్నతాధికారులు, అధికారులంతా ఆంగ్లీకరణం చెందిన బ్రిటిష్ రాజ్ బిడ్డలే. ఎన్నికైన రాజకీయ వర్గం జోక్యం ఏమంత లేకుండానే దేశాన్ని వారే పాలించారు. కరాచీ, రావల్పిండి (జనరల్ అయూబ్ ఖాన్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉండేది), ఇస్లామాబాద్‌ల వంటి అధికార కేంద్రాలకు వారు తమతోపాటూ ఆ దేశపు అభిరుచులను, పక్షపాత వైఖరులను కూడా పట్టుకొచ్చి ఉంటారు. ఈ అతి విశిష్టుల దర్బారు.. క్లబ్బు నిబంధనలను, ఆచా రాలను అనుసరిస్తూ జీవించేది. మంచి ఇంగ్లిష్ మాట్లాడే తామే పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వ హిస్తున్న వారమని వారు భావించే వారు. దేశానికి తాము చాలా అవసరమని ఉదారంగా అనుకునేవారు.
రాజకీయంగా ప్రయోజనకరం అనిపిస్తే అప్పుడప్పుడూ ఇస్లాం పట్ల విధేయతను చూపేవారంతే. భుట్టో విస్కీ తాగడాన్ని ఛాందస వాదులు తప్పు పడితే, ఆయన నేను విస్కీ తాగుతున్నానే తప్ప ప్రజల రక్తాన్ని కాదని బదులు చెప్పేటంతటి ఔద్ధత్యాన్ని ప్రదర్శించేవాడు. ఈ వర్గం వాషింగ్టన్, లండన్‌లలోని, ప్రత్యేకించి ‘పెంటగాన్’, ‘సాంధర్ట్స్’ (బ్రిటన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం) లోని వారి పథ నిర్దేశకులకు సామాజికంగానూ, సాంస్కృతికం గానూ, రాజకీయంగానూ ఆకర్షణీయంగా కనిపించేవారు.
భారత ప్రభుత్వం ఇప్పుడు వారికంటే పూర్తిగా భిన్నమైన పాకిస్తాన్ ప్రభుత్వంతో వ్యవహరించాల్సి ఉంది. అక్కడ అధికారంలో ఉన్నామని చెప్పు కునేవారు ఎవరైనాగానీ, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారా అధికారంలో ఉన్నాగానీ... మత ఛాందసవాదులతో రాజీ పడనిదే మనుగడ సాగించలే మని వారికి తెలుసు. ఎలాంటి రూపంలోని శాంతి ప్రక్రియకైనా ఉన్న అడ్డంకుల్లో అది ఒకటి.
మన దేశంలో భుట్టో లేరే అని చింతించేవారు ఎవరైనా ఉంటారని నేను అనుకోను. అయూబ్ ఖాన్ గురించో, ఆయనకు ముందున్న వారి గురించో కొంత ఆలోచించే వారుండొచ్చు. ఆ తలబిరుసు పౌర సహాయకునికంటే జనరల్ అయూబ్‌కే యుద్ధం గురించి బాగా అర్థమై ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.
(వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు