
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ తొలిసారి క్రికెట్ పరిపాలనలోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో అజహర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ పోటీల్లో సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌చంద్ జైన్‌పై 74 ఓట్ల తేడాతో అజ్జూ విజయం సాధించాడు. పోలైన 223 ఓట్లలో మాజీ కెపె్టన్‌కు 147 ఓట్లు రాగా, ప్రకాశ్‌చంద్‌కు 73 ఓట్లు పడ్డాయి. మూడో అభ్యరి్థగా ఉన్న దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో అజహర్ ప్యానెల్ మొత్తం ఆరు పదవులనూ గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది.
ఇదే గ్రూప్‌కు చెందిన జాన్ మనోజ్ (ఉపాధ్యక్షుడు), విజయానంద్ (కార్యదర్శి), నరేశ్ శర్మ (సంయుక్త కార్యదర్శి), సురేందర్ అగర్వాల్ (కోశాధికారి), అనురాధ (కౌన్సిలర్) ఎన్నికయ్యారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సిఫారసుల అనంతరం తొలిసారి అంతర్జాతీయ క్రికెటర్లకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలి్పంచారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సమయంలోనే అజహర్ అధ్యక్ష పదవికి పోటీ పడే ప్రయత్నం చేశాడు. అయితే ప్రత్యరి్థగా పోటీ చేసిన జి.వివేకానంద్... మాజీ సారథి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి అజహర్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేయగలిగాడు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అర్హత ఉందంటూ బీసీసీఐ లేఖ ఇచి్చందని, తిరస్కరణపై కోర్టుకు వెళతానంటూ అజహర్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండేళ్లు ఓపిక పట్టిన అనంతరం అజహర్ మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో నిలిచాడు. ఈ సారి అజహర్ నామినేషన్‌కు ఇబ్బంది రాకపోగా...‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కారణంగా వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. 2017 ఎన్నికల సమయంలో తన నామినేషన్ తిరస్కరించడంలో హెచ్‌సీఏ అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రకాశ్‌చంద్ జైన్‌ను ఇప్పుడు అజహర్ చిత్తుగా ఓడించటం విశేషం.
సెకండ్ ఇన్నింగ్స్ షురూ
‘నేను 99 టెస్టుల వద్దే ఆగిపోవడంపై చాలా మంది అయ్యో అంటుంటారు. అయితే ఇప్పుడు నేను చేస్తున్న పోరాటం 100వ టెస్టులాంటిదే’... అజహర్‌ను నిర్దోíÙగా చూపుతూ తీసిన సినిమా ‘అజహర్’లో డైలాగ్ ఇది. టెస్టు చరిత్రలో 99 మ్యాచ్‌లతో కెరీర్ ముగించిన ఒకే ఒక్క ఆటగాడు అజహర్. 6215 టెస్టు పరుగులు, 334 వన్డేల్లో 9378 పరుగులు, మూడు ప్రపంచకప్‌లలో భారత్‌కు నాయకత్వం వహించిన ఘనతతో పాటు పలు రికార్డులు ఆటగాడిగా అజహర్ ఖాతాలో ఉన్నాయి. అయితే 2000లో బయటపడిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అజ్జూ కెరీర్‌ను అనూహ్యంగా ముగించింది. ఇందులో అజహర్ పాత్రను నిర్ధారిస్తూ బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత దశాబ్దం అజహర్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు.
పరిస్థితి మారుతూ...
మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం గురించి అభిమానులు మెల్లగా మరచిపోతూ వస్తున్న సమయంలో అజహర్ చురుగ్గా బయట కనిపించడం మొదలు పెట్టాడు. వెటరన్ క్రికెట్ టోరీ్నలలో ఆడటంతో పాటు భార్య సంగీతాతో కలిసి సినిమా ఫంక్షన్లలో తరచూ పాల్గొనేవాడు. టీవీ చానల్స్ తమ చర్చా కార్యక్రమాలకు అజ్జూను విశ్లేషకుడిగా భాగం చేశాయి. 2009లో కాంగ్రెస్ పారీ్టలో చేరి మొరాదాబాద్‌నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కావడం అతని జీవితంలో కీలక మలుపు కాగా... 2011లో రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు అయాజుద్దీన్ మరణం పెను విషాదం. తర్వాతి ఏడాదే అజహర్‌పై నిషేధం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మాజీ కెపె్టన్‌కు ఊరట లభించింది.
విమర్శలు వచ్చినా...
ఫిక్సింగ్ అధ్యాయం ముగిసిందని అజహర్ భావిస్తూ వచి్చనా కొన్ని సార్లు అదే అంశంపై విమర్శలు తప్పలేదు. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో అతడిని ఢిల్లీ ఆటగాళ్లు కలవడంపై వివాదం రేగింది. గత ఏడాది ఈడెన్‌గార్డెన్స్‌లో అజహర్ గంట మోగించినప్పుడు గౌతం గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. అయితే హైదరాబాదీ వాటిని ఎప్పుడూ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయాడు. బీసీసీఐ వైపునుంచి కూడా అజహర్‌పై సానుకూల ధోరణే కనిపించింది. అధికారికంగా తనపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించకపోయినా... కోర్టు ఇచి్చన తీర్పును బోర్డు సవాల్ చేయలేదు కాబట్టి నిషేధం తొలగినట్లేనని అజహర్ వివరణ ఇస్తూ వచ్చాడు.
అధికారిక కార్యక్రమాల్లో తనను పిలవడం అందుకు నిదర్శనమని అతను చెప్పుకున్నాడు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి హాజరైన అజహర్‌కు 2016లో భారత్ 500వ టెస్టు సందర్భంగా అధికారిక సన్మానం జరగడంతో గత వివాదాలు ముగిసినట్లేనని అర్థమైంది. దీని తర్వాత ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ పూర్తి స్థాయిలో క్రికెట్ పరిపాలనలో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. 2017లో ఆ అవకాశం చేజారినా... ఇప్పుడు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కీలక పదవిని అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment