ఇదిగో... దేవుడి ‘ఆత్మకథ'
సచిన్ ఆటోబయోగ్రఫీ
‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిష్కరణ
హాజరైన మాజీ క్రికెటర్లు, సన్నిహితులు
ముంబై: విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ఇప్పుడు అభిమానుల చేతికి చేరింది. క్రికెట్ దిగ్గజం సచిన్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. దీనిని స్వయంగా విడుదల చేసిన సచిన్.... కూతురు సారా చేతుల మీదుగా అందరికంటే ముందు తన గురువు రమాకాంత్ అచ్రేకర్‌కు అందించాడు. అంతకు ముందు తన ఇంట్లో తొలి కాపీని తల్లి రజని టెండూల్కర్‌కు అందజేశాడు.
‘నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి ముందుగా ఈ పుస్తకం అందజేస్తున్నా’ అని ఈ సందర్భంగా సచిన్ ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన హర్షా భోగ్లే, మూడు భాగాలుగా, ఆసక్తికరంగా చర్చను నిర్వహించాడు. మొదటి ప్యానెల్‌లో మాజీ ఆటగాడు గవాస్కర్, రవిశాస్త్రి, వెంగ్‌సర్కార్, వాసు పరాంజపే ఉండగా, రెండో ప్యానెల్‌లో సహచరులు ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌లు...మూడో ప్యానెల్‌లో భార్య అంజలి, సోదరుడు అజిత్‌లతో ఈ చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా వీరంతా సచిన్‌తో తమకు ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తొలి కాపీ తల్లికి...
పుస్తకం విడుదల కార్యక్రమానికి ముందే సచిన్ తన ఆత్మకథ తొలి కాపీని తల్లి రజనీకి అందించాడు. ‘పుస్తకం తొలి కాపీని మా అమ్మకు ఇచ్చాను. ఆ సమయంలో తన ఆనందం వెలకట్టలేనిది’ అని సచిన్ పేర్కొన్నాడు.