వేలానికి రికార్డు చేజింగ్‌ బ్యాట్‌.. | Herschelle Gibbs To Auction Bat Used In Record Chasing | Sakshi
Sakshi News home page

వేలానికి రికార్డు చేజింగ్‌ బ్యాట్‌..

Published Sat, May 2 2020 3:00 PM | Last Updated on Sat, May 2 2020 3:54 PM

Herschelle Gibbs To Auction Bat Used In Record Chasing - Sakshi

కేప్‌టౌన్‌: వన్డే క్రికెట్‌లో రికార్డు చేజింగ్‌ దక్షిణాఫ్రికా పేరిటే ఉంది. దాదాపు 14 ఏళ్ల క్రితం ఆసీస్‌ నిర్దేశించిన 435 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా ఇంకా బంతి మిగిలి ఉండగానే ఛేదించి కొత్త రికార్డును నమోదు చేసింది. అది చేజింగ్‌లో నేటికి టాప్‌ ప్లేస్‌లో ఉంది. అయితే సఫారీ లక్ష్య చేదనలో హెర్షలీ గిబ్స్‌ పాత్ర కీలకం. ఆ మ్యాచ్‌లో గిబ్స్‌ 175 పరుగులు చేసి దక్షిణాఫ్రికా రికార్డు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. 111 బంతుల్లో 21 ఫోర్లు, 7 సిక్స్‌లతో దుమ్మురేపి దక్షిణాఫ్రికాకు ఘనమైన విజయాన్ని అందించాడు. కాగా, ఇప్పుడు ఆనాటి మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన బ్యాట్‌ను గిబ్స్‌ వేళానికి పెట్టాడు. ఎప్పుట్నుంచో తన జ్ఞాపకంగా దాచుకుంటూ వస్తున్న ఆ బ్యాట్‌ను వేలానికి ఉంచాడు. కరోనా వైరస్‌ కారణంగా తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన గిబ్స్‌ అందుకు ఆ రికార్డు చేజింగ్‌ బ్యాట్‌ సరైనదని భావించాడు. ఇప్పటికే ఆ దేశ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఒక చిరస్మరణీయమైన ఆడిన ఒక ఆర్సీబీ జెర్సీని వేళానికి పెట్టగా, ఇప్పుడు గిబ్స్‌ బ్యాట్‌ను వేళంలో పెట్టాడు. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ కోచ్‌ మికీ ఆర్థర్‌ హర్షం వ్యక్తం చేశాడు. ‘ మంచి పని చేశావ్‌ గిబ్స్‌.  వేలంలో ఆ బ్యాట్‌కు కచ్చితంగా మంచి ధరే వస్తుంది’ అని ట్వీట్‌ చేశాడు. (ఆ పాక్‌ దిగ్గజం అండగా నిలిచాడు: రషీద్‌)

2006లో దక్షిణాఫ్రికా పర్యటనకు ఆసీస్‌ రాగా,  ఐదో వన్డేలో ఈ రికార్డు నమోదైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 434 పరుగులు చేసింది. గిల్‌క్రిస్ట్‌(55), సైమన్‌ కాటిచ్‌(79)లు మంచి ఆరంభాన్ని ఇవ్వగా, అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(164; 105 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీ చేశాడు. ఇక మైక్‌ హస్సీ(81) దూకుడుగా ఆడటంతో ఆసీస్‌ నాలుగు వందల మార్కును సునాయాసంగా చేరింది. దాంతో ఆసీస్‌దే విజయం అనుకున్నారంతా. కానీ మ్యాచ్‌ తల్లక్రిందులైంది. దక్షిణాఫ్రికా జోరుకు ఆసీస్‌ బౌలింగ్‌ దాసోహమైంది. సఫారీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌(90) ధాటిగా బ్యాటింగ్‌ చేయగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన గిబ్స్‌ రెచ్చిపోయి ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికా స్కోరు 31.5 ఓవర్లలో 299 పరుగులు వద్ద గిబ్స్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ దశలో సఫారీలు వరుసగా కొన్ని కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడ్డట్టు కనిపించారు. కానీ మార్క్‌ బౌచర్‌(50 నాటౌట్‌) చివర వరకూ క్రీజ్‌లో ఉండి ఆసీస్‌ విజయాన్ని దూరం చేశాడు. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. (రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్‌: చాపెల్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement