కటక్‌లోనే కొట్టేయాలి! | High-flying India aim to clinch series vs England in 2nd ODI | Sakshi
Sakshi News home page

కటక్‌లోనే కొట్టేయాలి!

Published Thu, Jan 19 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

కటక్‌లోనే కొట్టేయాలి!

కటక్‌లోనే కొట్టేయాలి!

సిరీస్‌ విజయమే భారత్‌ లక్ష్యం
ఒత్తిడిలో ఇంగ్లండ్‌
నేడు రెండో వన్డే   


కొండలనైనా పిండి చేసే కోహ్లి తత్వానికి గత మ్యాచ్‌లో జాదవ్‌ జత కలవడంతో భారత జట్టు ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 351 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా అందుకొని వన్డే క్రికెట్‌లో తమ బలాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మళ్లీ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు ఎంత భారీ స్కోరు చేసినా గత మ్యాచ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయిన ఇంగ్లండ్‌ శిబిరంలో కాస్త ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. బారాబతి స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డు ఉండటం మరో సానుకూలాంశం.  

కటక్‌: టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన కోహ్లి సేన ఇప్పుడు వన్డే సిరీస్‌ విజయానికి మరో మ్యాచ్‌ దూరంలో నిలిచింది. తొలి వన్డేలో చెలరేగి మ్యాచ్‌ను గెలుచుకున్న భారత్, నేడు (గురువారం) జరిగే రెండో వన్డేలో ఇంగ్లండ్‌తో పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు 350 పరుగులు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయిన ఇంగ్లండ్, సిరీస్‌లో కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఇరు జట్లలోనూ దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌కు లోటు లేకపోవడంతో మళ్లీ పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్, ఇంగ్లండ్‌ బుధవారమే కటక్‌ చేరుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాయి. అయితే భారత కెప్టెన్‌ కోహ్లి నెట్స్‌కు దూరంగా ఉన్నాడు.


అశ్విన్‌ రాణించేనా...
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో తనదైన శైలిలో కోహ్లి సాగించిన వేట, జాదవ్‌ మెరుపు బ్యాటింగ్‌ భారత్‌కు విజయాన్నందించాయి. అయితే కొన్ని ఇతర లోపాలు కూడా ఇందులో కనిపించకుండా పోయాయి. వీరిద్దరు మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. భారత్‌ ఆరంభంలోనే నలుగురు ప్రధాన ఆటగాళ్ల వికెట్‌లు కోల్పోయింది. కోహ్లి, జాదవ్‌ భారీ భాగస్వామ్యం లేకపోతే ఫలితంలో తేడా వచ్చేది. కానీ ఇలాంటి అదృష్టం ప్రతీ రోజు కలిసి రాకపోవచ్చు. ముఖ్యంగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన సత్తా ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. చాలా రోజులుగా అతడి నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. అన్నింటికి మించి ఇద్దరు ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నారనేది వాస్తవం. పునరాగమనం చేసిన యువరాజ్‌తో పాటు ఇప్పుడు కేవలం బ్యాటింగ్‌ నైపుణ్యంతోనే జట్టులో కొనసాగాల్సిన ధోని కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. లేదంటే కెప్టెన్‌ కోహ్లికి ఇది సమస్యగా మారవచ్చు. హార్దిక్‌ పాండ్యా రాణించడం సానుకూలాంశం కాగా, భారీ స్కోరు నమోదైన మ్యాచ్‌లోనూ జడేజా ఓవర్‌కు ఐదు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అశ్విన్‌ ఫామ్‌ ఆందోళన రేపుతోంది. టెస్టుల్లో తిరుగులేని బౌలింగ్‌ చేసిన ఈ నంబర్‌వన్‌ స్పిన్నర్‌ వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. గత 14 వన్డేలలో అతను ఎనిమిది సార్లు కనీసం తన ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేకపోయాడు. అతని స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను తీసుకోవచ్చని వినిపిస్తున్నా... కోహ్లి తన ప్రధాన స్పిన్నర్‌పై ఇంత తొందరగా నమ్మకం కోల్పోకపోవచ్చు. ఉమేశ్, బుమ్రా పుణేలో విఫలమైనా ఈ మ్యాచ్‌లో వారి స్థానాలకు ఢోకా లేదు.

ఏం చేయాలి?
భారత పర్యటనలో ఇంగ్లండ్‌ తమ తొలి విజయాన్ని అందుకోవాలంటే అద్భుతం చేయాల్సిందేనేమో! అన్ని రంగాల్లో భారత్‌పై ఆ జట్టు ఆధిక్యం ప్రదర్శిస్తే గానీ గెలుపు రుచి చూడకపోవచ్చు. తొలి వన్డేలో రనౌటైన హేల్స్‌ మినహా ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా రాణించడం వల్లే ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయగలిగింది. రాయ్, రూట్, స్టోక్స్‌ మంచి ఫామ్‌లో ఉండగా, మోర్గాన్, బట్లర్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌ దిశను మార్చగల సమర్థులు. ఈసారి కూడా జట్టు తమ బ్యాటింగ్‌పైనే ప్రధానంగా ఆధార పడుతోంది. బౌలింగ్‌లో ఇద్దరు పేసర్లు వోక్స్, విల్లీ ప్రభావం చూపించగా, బాల్, స్టోక్స్‌ విఫలమయ్యారు. భారత్‌లాగే ఇంగ్లండ్‌ను కూడా తన స్పిన్‌ విభాగం కలవరపెడుతోంది. ఇద్దరు స్పిన్నర్లు రషీద్, మొయిన్‌ అలీ ఘోరంగా విఫలమయ్యారు. నిజానికి టెస్టులకంటే కూడా రషీద్‌కు పరిమిత ఓవర్లలోనే మంచి రికార్డు ఉంది. కానీ పుణే మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ను భారత్‌ చితక్కొట్టింది. రషీద్‌ స్థానంలో మరో పేసర్‌ ప్లంకెట్‌ను ఆడించాలని కూడా ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఓవరాల్‌గా తమ బౌలింగ్‌పై పెద్దగా నమ్మకం ఉంచే పరిస్థితి లేకపోవడంతో మరోసారి భారీ స్కోరుపైనే ఇంగ్లండ్‌ ఆశలు పెట్టుకుంది.

తుది జట్ల వివరాలు
(అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రాహుల్, యువరాజ్, ధోని, జాదవ్, పాండ్యా, జడేజా, అశ్విన్‌/మిశ్రా, బుమ్రా, ఉమేశ్‌.
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, హేల్స్, రూట్, బట్లర్, స్టోక్స్, అలీ, వోక్స్, విల్లీ, బాల్, రషీద్‌/ ప్లంకెట్‌.


పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై తొలి మ్యాచ్‌లాగే ఈసారి కూడా భారీ స్కోరుకు అవకాశం ఉంది. బారాబతి స్టేడియంలో బౌండరీలు చిన్నగా ఉండటం కూడా మరో కారణం. బుధవారం పిచ్‌పై కాస్త పచ్చిక ఉన్నా, మ్యాచ్‌ ముందు దానిని తొలగించవచ్చు. అయితే మంచు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి టాస్‌ కీలకం కానుంది.

ఈ మైదానంలో ఆడిన 15 వన్డేల్లో భారత్‌
11 గెలిచి, 4 ఓడింది. ఇందులో నాలుగు సార్లు భారత్, ఇంగ్లండ్‌ తలపడ్డాయి. వీటిలో ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు నెగ్గాయి.

రెండేళ్ల క్రితం ఇక్కడ శ్రీలంకతో జరిగిన
వన్డేలో 363 పరుగులు చేసిన భారత్‌ 169 పరుగులతో విజయం సాధించింది. ఇందులో ధావన్, రహానే సెంచరీలు చేశారు.

మధ్యాహ్నం
గం. 1.30 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో
ప్రత్యక్షప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement