154 స్కోరుకు, 159 స్కోరుకు మధ్య తేడా ఐదు పరుగులే! కానీ వికెట్ల పతనం డబుల్ అయింది. ఈ డబుల్ ధమాకా భువనేశ్వర్‌ది. మొదటి స్కోరు వద్ద నాలుగు వికెట్లతో ఉన్న సఫారీ జట్టు రెండో స్కోరుకల్లా మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. అంతలా... భువీ దెబ్బతీశాడు. కాదు కాదు... దెబ్బ మీద దెబ్బ తీశాడు. వన్డేల్లో ఆధిపత్యాన్ని కొనసాగించిన కోహ్లి సేన... తాజాగా టి20ల్లోనూ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
జొహన్నెస్‌బర్గ్: ధావన్ ధనాధన్ పరుగులు, భువనేశ్వర్ ఫటాఫట్ వికెట్లు సఫారీని కుదిపేశాయి. శిఖర్ ఇన్నింగ్స్ భారీ స్కోరుకు బాట వేస్తే, భువీ బౌలింగ్ ప్రత్యర్థిని ఉన్నపళంగా కూల్చేసింది. పటిష్టస్థితి నుంచి పరాజయానికి పడేసింది. దీంతో తొలి టి20లో భారత్ 28 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీస్కోరు చేసింది. ధావన్ (39 బంతుల్లో 72; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు.
అనంతరం సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్‌డ్రిక్స్ (50 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (5/24) నిప్పులు చెరిగాడు. రెండో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. మోకాలి గాయంతో దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ ఈ సిరీస్‌కు దూరం కాగా... చేతి వేలి గాయంతో ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఆడలేదు.
సిక్స్‌లతో మొదలైంది...
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌కు సిక్సర్లతో శ్రీకారం చుట్టాడు రోహిత్ శర్మ. ప్యాటర్సన్ వేసిన తొలి ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే ఇదెంతో సేపు సాగలేదు. మరుసటి ఓవర్లోనే రోహిత్ (9 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు ముగిశాయి. డాలా బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఏడాది తర్వాత బరిలోకి దిగిన రైనా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలోనే నిష్క్రమించాడు. ఈ దశలో ధావన్, కోహ్లి జోరు కొనసాగించారు. షమ్సీ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ తొలిబంతికి లాంగాన్‌లో బెహర్దీన్ క్యాచ్ చేజార్చడంతో బతికిపోయిన కోహ్లి (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)... ఆ ఓవర్లో ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. అయితే షమ్సీ వేసిన మరుసటి ఓవర్లో భారత కెప్టెన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం మనీశ్ పాండే, ధోని, పాండ్యా రాణించడంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది.
రాణించిన హెన్‌డ్రిక్స్...
కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ఓపెనర్ హెన్‌డ్రిక్స్ వెన్నెముకగా నిలిచాడు. టాపార్డర్ విఫలమైనా... బెహర్దీన్ (27 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి హెన్‌డ్రిక్స్ గట్టెక్కించే ప్రయత్నం చేసినా భువనేశ్వర్ దెబ్బకు సాధ్యపడలేదు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) డాలా 21; ధావన్ (సి) క్లాసెన్ (బి) ఫెలుక్‌వాయో 72; రైనా (సి అండ్ బి) డాలా 15; కోహ్లి ఎల్బీడబ్ల్యూ (బి) షమ్సీ 26; పాండే (నాటౌట్) 29; ధోని (బి) మోరిస్ 16; పాండ్యా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203.
వికెట్ల పతనం: 1–23, 2–49, 3–108, 4–155, 5–183. బౌలింగ్: ప్యాటర్సన్ 4–0–48–0, డాలా 4–0–47–2, మోరిస్ 4–0–39–1, షమ్సీ 4–0–37–1, స్మట్స్ 2–0–14–0, ఫెలుక్‌వాయో 2–0–16–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: స్మట్స్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 14; హెన్‌డ్రిక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 70; డుమిని (సి) రైనా (బి) భువనేశ్వర్ 3; మిల్లర్ (సి) ధావన్ (బి) పాండ్యా 9; బెహర్దీన్ (సి) పాండే (బి) చహల్ 39; క్లాసెన్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 16; ఫెలుక్‌వాయో (సి) చహల్ (బి) ఉనాద్కట్ 13; మోరిస్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 0; ప్యాటర్సన్ (రనౌట్) 1; డాలా (నాటౌట్) 2; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175.
వికెట్ల పతనం: 1–29, 2–38, 3–48, 4–129, 5–154, 6–158, 7–158, 8–159, 9–175.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–24–5, ఉనాద్కట్ 4–0–33–1, బుమ్రా 4–0–32–0, హార్దిక్ పాండ్యా 4–0–45–1, యజువేంద్ర చహల్ 4–0–39–1. 5 భారత్ తరఫున టి20ల్లో 5 వికెట్లు తీసిన తొలి పేసర్
భువనేశ్వర్.
78 పవర్‌ప్లేలో టీమిండియా చేసిన పరుగులు. భారత్‌కిదే అత్యధికం.
203 దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన అత్యధిక స్కోరు.
1 కేవలం 8.2 ఓవర్లలోనే భారత్ 100 కొట్టడం ఇదే తొలిసారి.
12 పుష్కర కాలం క్రితం భారత్ తొలి అంతర్జాతీయ టి20 ఆడింది ఇక్కడే. అప్పటి జట్టులో ఆడినవారిలో ధోని, రైనా ఇప్పుడు ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment