
డబుల్స్‌లో సానియా కొత్త భాగస్వామి హింగిస్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ విభాగంలో కొత్త భాగస్వామిని ఎంచుకుంది. సీజన్‌లోని తదుపరి టోర్నమెంట్‌లలో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి సానియా బరిలోకి దిగనుంది. గతేడాది డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ తర్వాత కారా బ్లాక్ (జింబాబ్వే)తో విడిపోయిన సానియా... ఈ ఏడాది సు వీ సెయి (చైనీస్ తైపీ)తో కలిసి నాలుగు టోర్నమెంట్లలో ఆడింది.
ఖతార్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఈ జంట మిగతా మూడు టోర్నీల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ‘సు వీ సెయితో నాలుగు టోర్నీలు ఆడాను. కానీ మేం గొప్ప ఫలితాలు సాధించలేకపోయాం. ఇద్దరి మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. దాంతో పరస్పర అవగాహనతో మా భాగస్వామ్యానికి తెరదించుతున్నాం. మిగతా సీజన్‌లో నేను మార్టినా హింగిస్‌తో కలిసి ఆడనున్నాను’ అని డబుల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌గా ఉన్న సానియా వివరించింది.