ఆసియా కప్ హాకీలో భారత్ బోణీ
ఇపో (మలేసియా): ఆసియా కప్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లోనే హాకీ బేబీలైన ఒమాన్‌ను 8-0 గోల్స్‌తో ఇండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం ఇండియా ఆధిపత్యం చెలాయించింది. ప్రథమార్థంలోనే ఇండియా కీలకమైన 4-0 లీడ్‌కు దూసుకెళ్లింది. మన్‌దీప్‌సింగ్ రెండు గోల్స్ చేయగా, రమణ్‌దీప్‌సింగ్ రెండు గోల్స్ చేశాడు.
రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్, మలక్ సింగ్, ఊతప్ప ఒక్కో గోల్ చేశారు. ఆసియా కప్ హాకీ విజేతకే వల్డ్ కప్ అర్హత నేరుగా లభిస్తుంది. సౌత్ కొరియా ఇది వరకే వల్డ్ కప్ అర్హత సాధించింది. దాంతో వల్డ్ కప్‌లో వున్న ఒక్కస్థానం కోసం ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్, మలేసియా పోరాడుతున్నాయి.
కాగా ఈ టోర్నమెంట్ విజేత జట్టు మాత్రమే వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది. 1971లో మొదలైన ప్రపంచ కప్‌లో ఇప్పటిదాకా ప్రతిసారీ భారత్ బరిలోకి దిగింది. ఒకవేళ ఈసారి ఆసియా కప్‌లో భారత్ విఫలమైతే మాత్రం తొలిసారి టీమిండియా లేకుండానే ప్రపంచ కప్ జరుగుతుంది.
మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘ఎ’లో పాకిస్థాన్, జపాన్, మలేసియా, చైనీస్ తైపీ; గ్రూప్ ‘బి’లో భారత్, ఒమన్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా ఉన్నాయి. సర్దార్ సింగ్ నాయకత్వంలోని 18 మంది సభ్యులుగల జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లే ఉన్నారు.