బ్రిస్టల్: ప్రపంచ కప్‌లో వర్షం దెబ్బకు మూడో మ్యాచ్ కొట్టుకుపోయింది. టాస్ వేసే అవకాశమూ లేనంతటి వానతో శ్రీలంక–బంగ్లాదేశ్ మధ్య మంగళవారం ఇక్కడ జరగాల్సిన వన్డే రద్దయింది. మధ్యలో రెండుసార్లు తెరిపినిచ్చినా... ఆ వెంటనే ప్రారంభమైంది. మైదానంలో నీటిని తోడేందుకు గ్రౌండ్స్‌మెన్ అవిశ్రాంతంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. చివరకు అంపైర్లు ఆట సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. లంకకు ఈ పరిస్థితి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఎదురవడం గమనార్హం. గత శుక్రవారం పాకిస్తాన్‌తో ఆ జట్టు మ్యాచ్ ఒక్క బంతీ పడకుండానే రద్దయింది.
అంతకుముందు వర్షం ప్రభావంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధనలు వర్తింపజేసిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను లంక 34 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆ జట్టు్ట ఖాతాలో నాలుగు పాయింట్లున్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాపై గెలిచి... ఇంగ్లండ్ మీద భారీ తేడాతో, న్యూజిలాండ్ చేతిలో త్రుటిలో ఓడిన బంగ్లాదేశ్ (4 మ్యాచ్‌లు, 2 పాయింట్లు)కు ఓ విధంగా బలహీన లంకతో పోరు కీలకమైనదే. వారు గెలిచే వీలున్న పరిస్థితుల్లో వర్షం దెబ్బకొట్టింది. ఈ పరిణామం రెండు జట్ల నాకౌట్ అవకాశాలపై ప్రభావం చూపేదే.
మనకూ తప్పదా?
వర్షం ప్రభావం గురువారం నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరగాల్సిన భారత్–న్యూజిలాండ్ మ్యాచ్‌పైనా పడే ప్రమాదం కనిపిస్తోంది. తాజా అంచనాల ప్రకారం బుధవారం సాయంత్రం వరకు భారీ వర్షాలకు అవకాశముంది. గురువారం మధ్యాహ్నానికి కాని సాధారణ వాతావరణం నెలకొనదని తెలుస్తోంది. దీంతో మన మ్యాచ్‌కు కొంతమేరయినా ఇబ్బంది కలిగే వీలుంది. అయితే, వాన తగ్గినా... ఆటగాళ్లకు శీతల గాలుల కష్టాలు తప్పేలా లేవు. గరిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలను మించకపోవడమే దీనికి కారణం.
మబ్బులు కమ్మిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ వ్యాప్తంగా రెండ్రోజులుగా నిరంతరం జల్లులు పడుతున్నాయి. అంటే, బుధవారం టాంటన్‌లో పాకిస్తాన్–ఆస్ట్రేలియా మ్యాచ్‌కూ గండం పొంచి ఉన్నట్లే. మరోవైపు ఈ వారమంతా ఇలాగే ఉంటుందంటూ ఇప్పటికే నాటింగ్‌హామ్ వాతావరణ శాఖ స్థానికులకు సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా భారీ వరదలకూ ఆస్కారం ఉంటుందని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment