
రవిచంద్రన్ అశ్విన్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చాక లీగ్ క్రికెట్ స్థానంలో అంతర్జాతీయ క్రికెట్‌కే అధిక ప్రాధాన్యమివ్వాలని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సంప్రదాయిక టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో ఎటువంటి మార్పులు చేయకుండా ఐదు రోజుల మ్యాచ్‌లనే నిర్వహించాలని కోరాడు. ‘కరోనా మహమ్మారి కట్టడి తర్వాత అందరూ లీగ్ క్రికెట్ వైపు మొగ్గుచూపుతారేమో! అలా జరుగకూడదు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ లీగ్‌లకు కేటాయించొద్దు. ప్రపంచ క్రికెట్ గాడిలో పడేందుకు అందరూ అనుకుంటున్న దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చు.
సమీప భవిష్యత్‌లో ఏం జరుగనుందో ఎవరూ ఊహించలేరు’ అని అశ్విన్ పేర్కొన్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా 350 వికెట్లు దక్కించుకున్న బౌలర్‌గా ఘనత సాధించిన అశ్విన్... టెస్టుల్ని నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదన తనకు నచ్చలేదని చెప్పాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్‌లో నేను సాధించాల్సింది ఇంకా ఉంది. నా శరీరం సహకరిస్తే మరిన్ని ఘనతల్ని అందుకోగలను. ఐసీసీ చెబుతోన్న నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనతో నేనైతే ఆనందంగా లేను. ఈ ఆలోచన మంచిదో, చెడ్డదో విశ్లేషించను గానీ ఒకరోజు ఆటపై కోత వేయడమంటే టెస్టు క్రికెట్ మజాను తగ్గించినట్లే అని నా ఉద్దేశం’ అని అశ్విన్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment