
హోటల్లో అగ్నిప్రమాదం: క్రికెటర్లకు గాయాలు!
ఇస్లామాబాద్:కరాచీలోని స్టార్ హోటల్ సోమవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా, 75 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు మహిళలున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిలో అత్యధిక శాతం మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రీజెంట్ ప్లాజా స్టార్ హోటల్లో ఆకస్మికంగా ప్రమాదం సంభవించి భారీ ప్రాణ నష్టం జరిగింది. హోటల్ గ్రౌండ్ ఫోర్లో ఉన్న వంట గదిలో తొలుత మంటలు వ్యాపించి అవి హోటల్ కు చుట్టుముట్టాయి.
అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దేశవాళీ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్ ఒకరు అక్కడ బస చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న బౌలర్ యాసిమ్ ముర్తాజా ప్రమాదం నుంచి తప్పించుకునే యత్నంలో రెండో ఫ్లోర్ నుంచి కిందికి దూకేశాడు. దాంతో అతని చీలిమండకు తీవ్రమైన గాయమైనట్లు డాక్టర్లు తెలిపారు. మరొక క్రికెటర్ కరామాత్ అలీ అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు తెలిపారు. కాగా, అంతర్జాతీయ క్రికెటర్ షోయబ్ మస్జూద్ ఎటువంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు యూబీఎల్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ నదీమ్ ఖాన్ తెలిపారు.
ఈ తరహాలో పాక్ లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పలువురు మండిపడుతున్నారు.