అసలు జర్మనీ ఎలా గెలిచింది?
అసలు జర్మనీ ఎలా గెలిచింది?
Published Mon, Jul 14 2014 11:59 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
జర్మనీ ఇప్పుడు ప్రపంచ ఫుట్ బాల్ సామ్రాట్టు. జర్మనీలో సంబరాలు ఇంకా సద్దుమణగలేదు. దేశం దేశమంతా పండగ చేసుకుంటోంది.
అయితే 2000 నాటికి జర్మన్ ఫుట్ బాల్ పతనం అంచులకు చేరింది. యూరో లీగ్ ఫుట్ బాల్ పోటీల్లో పాయింట్ల జాబితాల్లో అట్టడుగులో ఉంది. ఫుట్ బాల్ అధోగతికి చేరింది. అందరూ జర్మనీ కథ ఖతం అనుకున్నారు.
పతనం అంచులనుంచి అదే జర్మనీ ఇప్పుడు ప్రపంచ విజయం దాకా వచ్చింది. ఇదేలా సాధ్యమైంది?
2000 లోనే జర్మన్ ప్రభుత్వం ఫుట్ బాల్ ప్రతిభను గుర్తించి జర్మన్ టీమ్ కి మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు పూనుకుంది. ప్రణాళికా బద్ధంగా అడుగులు వేసింది. ఈ ప్రణాళిక 2003 లో అమలైంది.
* ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయసులోనే ఫుట్ బాల్ ప్రతిభలను గుర్తించింది. వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించింది. వీరందరికీ శిక్షణనిచ్చేందుకు దేశవ్యాప్తంగా అకాడెమీలను స్థాపించింది. ఇలా ఎంపికైన పిల్లల్లో ప్రతిభను అనుసరించి వారికి ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని నిర్ధారించింది.
* జర్మన్ టీమ్ లోని ఆటగాళ్లలో వయసు మళ్లిన వారి స్థానంలో యువకులను రంగంలోకి దింపింది. కొన్నేళ్లలోనే జర్మన్ టీమ్ ఆటగాళ్లందరూ కోడెవయసు కుర్రాళ్లే ఉండేలా చేశారు. జూలియన్ డ్రాక్స్ లర్, ఆంద్రే ష్కుర్లె, స్వెన్ బెండర్, థామస్ ముల్లర్,టోనీ క్రూస్, మార్కో రియస్ వంటి ఆటగాళ్లందరూ ఈ ప్రణాళిక ద్వారా ఎదిగిన వారే.
* ఈ యువ క్రీడాకారుల తయారీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ కోచ్ లను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. జర్మనీలో బి లైసెన్స్ ఉన్న కోచ్ లు 28000 మంది, ఏ లైసెన్స్ ఉన్న వారు 5500 మంది ఉన్నారు. వీరందరినీ ఉపయోగించుకుని ఆటగాళ్లకు సానపట్టారు.
* ఫిఫా కప్ ను గెలిచేందుకు అన్ని ప్రత్యర్థి టీమ్ ల ఆటను నిశితంగా పరిశీలించారు. బ్రెజిల్ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశారు. బ్రెజిల్ లో ఉండే వేడి, చెమటను తట్టుకునేందుకు ఆటగాళ్లు గత ఆరునెలలుగా హాట్ రూమ్ లలో ఆటలు ఆడేవారు. ఏసీ రూమ్ లలోఉండటం మానేశారు. బ్రెజిల్ వాతావరణాన్ని తట్టుకునేందుకు పూర్తిగా అలవాటు పడేలా చేశారు.
ఇంత నిశితమైన అధ్యయనం, నిరంతర ప్రయత్నం వల్లే పదేళ్ల కింద పతనం అంచున ఉన్న జర్మనీ ఈ రోజు ప్రపంచ విజేత అయింది.
Advertisement