
ఐపీఎల్ వేలం (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై న్యూజిలాండ్ క్రికెటర్ల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ వేలంతో క్రికెటర్లను సంతలో పశువుల్లా మార్చారని అసోసియేషన్ అధ్యక్షుడు హీత్ మిల్స్ మండిపడ్డారు. స్థానిక హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఐపీఎల్ వేలం పద్దతి ఆటగాళ్లందరినీ ఘోరంగా అవమానపరిచింది. ప్రపంచం ముందు సంతలో పశువుల్లా నిలబెట్టింది. ఐపీఎల్ వల్ల చాలా లాభాలున్నాయి. కానీ వేలం నిర్వహించే పద్దతి ఇది కాదు. అనైతిక చర్య’ అని మిల్స్ అభిప్రాయపడ్డారు.
వేలం వల్ల ఏ జట్టుకు ఆడుతామో తెలియదని, యజమాని, కెప్టెన్ ఎవరో కూడా తెలియదని, కోచ్‌లతో సత్సంబంధాలు కూడా ఉండవని ఇది క్రికెట్‌కు మంచిది కాదని ఈ న్యూజిలాండ్ క్రికెటర్ చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో కొంతమంది ప్లేయర్లు అయితే ఏకంగా ఐదు, ఆరు జట్లకు ఆడటం చూశామని, ఇలా ఏ క్రీడాలీగ్‌లో జరగదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు ఈ పద్దతి మారేలా చూడాలని కోరారు.
ఐపీఎల్‌తో ఫిక్సింగ్, బెట్టింగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్‌తో క్రికెట్ ఆటకు ఒరిగిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక భారత దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ సైతం ఐపీఎల్ వేదికను మనీ ల్యాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment