ఆస్ట్రేలియా జోరు
హ్యాండ్స్‌కోంబ్ సెంచరీ
ఆసీస్ 538/8 డిక్లేర్డ్
సిడ్నీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు కూడా ఆస్ట్రేలియా జోరు కొనసాగింది. ఓవర్‌నైట్ స్కోరు 365/3తో బుధవారం బరిలోకి దిగిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 538 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (110; 9 ఫోర్లు) ఈ సిరీస్‌లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 126 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ (64 బ్యాటింగ్; 7 ఫోర్లు), అజహర్ అలీ (58 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
అరుదైన ఘనత: 195 బంతుల్లో కోంబ్ తన కెరీర్‌లో రెండో శతకం అందుకున్నాడు. ఆ వెంటనే రియాజ్ బౌలింగ్‌లో వెనక్కి జరిగి షాట్ ఆడబోయిన అతను ‘హిట్‌వికెట్’గా నిష్క్రమించాడు. ఆడిన తొలి నాలుగు టెస్టుల్లోనూ కనీసం అర్ధ సెంచరీ చేసిన రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా (1920లో హెర్బీ కొలిన్స్ తర్వాత) హ్యాండ్స్‌కోంబ్ నిలవడం విశేషం. ఈ నాలుగు మ్యాచ్‌లలో అతను 54, 105, 54, 110 పరుగులు సాధించాడు.