సాక్షి, హైదరాబాద్: సొంత ప్రేక్షకుల మధ్య స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో తొలి విజయాన్ని అందుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్‌కు సొంత మైదానం కలిసొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–1 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై గెలిచింది. హైదరాబాద్ ఆటగాళ్లు స్టాంకోవిచ్ (54వ ని.), మార్సెలినో (81వ ని.) చెరో గోల్ సాధించారు. కేరళ తరఫున ప్రవీణ్ (34వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలో ప్రత్యర్థి బలహీన డిఫెన్స్‌ను పదే పదే ఛేదించిన కేరళ హైదరాబాద్ గోల్ పోస్టుపైకి దాడులు చేసింది. 34వ నిమిషంలో సమద్ అందించిన పాస్‌ను గోల్ పోస్టులోకి నెట్టిన 19 ఏళ్ల కేరళ ఆటగాడు ప్రవీణ్ 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. విరామం తర్వాత హైదరాబాద్ పుంజుకుంది. 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన స్టాంకోవిచ్ స్కోర్‌ను సమం చేశాడు. 9 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఫ్రీ కిక్‌ను కళ్లు చెదిరే రీతిలో గోల్ పోస్టులోకి పంపిన మార్సెలినో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment