హైదరాబాద్ ఓటమి
పుణే చేతిలో ఓడిన ఏసెస్
సాక్షి, హైదరాబాద్: తొలి పోరులో గెలిచి శుభారంభం చేసిన హైదరాబాద్ ఏసెస్‌కు రెండో మ్యాచ్‌లో చుక్కెదురైంది. చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి ఎల్బీ స్టేడియం సెంటర్‌కోర్టులో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణే మరాఠాస్ 26-25 గేమ్‌ల (3-2 మ్యాచ్‌లు) తేడాతో హైదరాబాద్ ఏసెస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో చాంపియన్స్ టెన్నిస్ లీగ్ హైదరాబాద్ రౌండ్ పోటీలు ముగిశాయి.
రద్వాన్‌స్కా జోరు
మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో రద్వాన్‌స్కా 6-3 తేడాతో హింగిస్ పై విజయం సాధించింది. వరల్డ్ నంబర్ 6 రద్వాన్‌స్కా ముందు అలనాటి చాంపియన్ హింగిస్ తలవంచింది. లెజెండ్స్ మ్యాచ్ లో హైదరాబాద్ ప్లేయర్ మార్క్ ఫిలిప్పోసిస్ 6-3 స్కోరుతో ప్యాట్‌క్యాష్‌ను చిత్తు చేశాడు. ఆ తర్వాత మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ లో ఏసెస్ జోడి యూజ్నీ-హింగిస్ 6-5 (5-3)తో పుణే జంట బాగ్దాటిస్-రద్వాన్‌స్కాపై విజయం సాధించింది.
అనంతరం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్‌లో మరాఠా ద్వయం బాగ్దాటిస్-సాకేత్ మైనేని 6-5 తేడాతో ఏసెస్ టీమ్ యూజ్నీ-జీవన్ నెడుంజెళియన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో నెట్ వద్ద చక్కటి ఆటతీరుతో సాకేత్ ఆకట్టుకున్నాడు. ఈ ఫలితంలో ఇరు జట్లు 2-2 మ్యాచ్‌లతో సమంగా నిలిచాయి. కీలకమైన ఆఖరి మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో బాగ్దాటిస్ 6-5 (5-2) తేడాతో యూజ్నీపై గెలుపొంది తన జట్టుకు విజయాన్ని అందించాడు.