తిరునల్వేలి: హైదరాబాద్ ఓపెనర్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డి రంజీ మ్యాచ్‌లో రెండో రోజు కూడా తన జోరు కొనసాగించాడు. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అక్షత్ (477 బంతుల్లో 248 బ్యాటింగ్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతని కెరీర్‌లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా రెండో రోజు మంగళవారం ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 523 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అక్షత్‌కు అండగా నిలిచిన బావనక సందీప్ (221 బంతుల్లో 130; 15 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అక్షత్‌తో పాటు సీవీ మిలింద్ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్, మొహమ్మద్, రాహిల్ షా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 249/3తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను తమిళనాడు బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా 174 బంతుల్లో సందీప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత 316 బంతుల్లో అక్షత్ 150 పరుగుల మైలురాయిని దాటాడు. చివరకు లంచ్‌కు ముందు సందీప్‌ను మొహమ్మద్ ఔట్ చేయడంతో 246 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెర పడింది. కొల్లా సుమంత్ (5), ఆకాశ్ భండారి (17) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే సాకేత్ సాయిరామ్ (42) కెప్టెన్‌కు సహకరించాడు. టీ విరామ సమయానికి 199 పరుగుల వద్ద ఉన్న అక్షత్... చివరి సెషన్ ఆరంభం కాగానే ఫోర్ కొట్టి 413 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అక్షత్, సాయిరామ్ ఏడో వికెట్‌కు 109 పరుగులు జత చేశారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment