మరో నలుగురు!
మరో నలుగురు!
Published Tue, Sep 24 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
ముంబై: ఐపీఎల్-6 ఫిక్సింగ్ ఉదంతంలో మరో నలుగురు క్రికెటర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆటగాళ్లు హనుమ విహారి, ఆశిష్ రెడ్డి, కరణ్ శర్మ, తిసారా పెరీరా కలిసి రూ. 6 కోట్లు తీసుకున్నారని ఓ బుకీ ముంబై పోలీసులకు చెప్పాడు. గత శనివారం ఫైల్ చేసిన చార్జిషీట్‌లో ముంబై పోలీసులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ఏప్రిల్ 17న పుణే, సన్‌రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ నలుగురు ఆటగాళ్లు తమకు సహకరించారని బుకీ చంద్రేశ్ పటేల్ విచారణలో పోలీసులకు చెప్పాడు.
‘సన్‌రైజర్స్ మ్యాచ్‌ను ఫిక్స్ చేయడానికి రూ. 5 కోట్లు ఆటగాళ్లకు ఇవ్వాలని, ఒక కోటి తమకు కమిషన్ అని యూసుఫ్ అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించాడు. ఏప్రిల్ 16న పుణేలోని ఒక హోటల్‌లో ఈ నలుగురు ఆటగాళ్లను మాకు పరిచయం చేశాడు. సన్‌రైజర్స్ స్కోరు తొలి 10 ఓవర్లలో 60, మొత్తం 20 ఓవర్లలో 140 పరుగులు దాటకూడదని మాట్లాడుకున్నాం. అలాగే మ్యాచ్ ఓడిపోవాలని కూడా అడిగాం’ అని పటేల్ చెప్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచింది. మ్యాచ్ మీద రూ.9 కోట్లు పందెం కాసిన చంద్రేశ్ ఆ మొత్తం ఓడిపోయాడు. స్కోర్ల మీద రూ.3.5 కోట్లు పందెం కాసి గెలిచాడు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా వెలువడే ఓ ఆంగ్ల పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.
ఆటగాడి సోదరుడు సూత్రధారి?
చార్జిషీట్‌లో ముంబై పోలీసులు హైదరాబాద్ ఆటగాడు ఆశిష్ రెడ్డి సోదరుడు ప్రీతమ్ రెడ్డి పేరును ప్రస్తావించారు. ‘బుకీలు ప్రీతమ్‌తోనే డీల్ కుదుర్చుకున్నారు. రూ. 6 కోట్లు ఇస్తామని ఫిక్సింగ్ చేయాలని బుకీలు అతడిని కోరారు. దీనికి అతను అంగీకరించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వికెట్ పడితే డీల్ ఓకే అయినట్లని ప్రీతమ్ బుకీలతో చెప్పాడు. (ఆ మ్యాచ్‌లో డి కాక్ రెండో ఓవర్లో అవుటయ్యాడు) దీంతో బుకీలు పందేలు కాశారు’ అని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
విచారణకు ఎందుకు పిలవలేదు?
పోలీసులు చార్జిషీట్‌లో ఈ నలుగురు క్రికెటర్ల పేర్లను ప్రస్తావించారు. బుకీ చంద్రేశ్ జూన్ 17న ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నలుగురు క్రికెటర్లను పోలీసులు విచారణకు ఎందుకు పిలవలేదనేది పెద్ద ప్రశ్న. అంటే బుకీ చెప్పిన విషయాన్ని పోలీసులు నమ్మలేదా? లేక తగిన సాక్ష్యాలు లభించలేదా? అనేది తేలాల్సి ఉంది. ఏమైనా విహారి, ఆశిష్ రెడ్డి లాంటి వర్ధమాన క్రికెటర్ల భవిష్యత్‌కు ఇది పెద్ద దెబ్బ.
ప్రస్తుతం జట్టుతోనే...
ఆరోపణలు వచ్చిన నలుగురు క్రికెటర్లు ప్రస్తుతం చాంపియన్స్ లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. వీరంతా జట్టుతో పాటే మొహాలీలో ఉన్నారు. ఒకవేళ వీళ్ల మీద అనుమానం ఉంటే కనీసం బీసీసీఐకి గానీ, జట్టుకు గానీ పోలీసులు చెప్పాల్సింది. కానీ ఇప్పటివరకూ జట్టుకు అలాంటి సమాచారం ఏమీ లేదు.
మేం నమ్మడం లేదు: లంక బోర్డు
తమ ఆటగాడు తిసారా పెరీరా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన కథనాలను శ్రీలంక బోర్డు ఖండించింది. పెరీరా మీద తమకు పూర్తిగా నమ్మకం ఉందని పేర్కొంది. ‘ఈ విషయం గురించి భారత్‌లోని అధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. మా క్రికెటర్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతను అలాంటి పనులకు పాల్పడడు’ అని లంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
‘మా అబ్బాయి మీద నమ్మకం ఉంది’
ఫిక్సింగ్ కథనాన్ని విహారి తల్లి విజయలక్ష్మి ఖండించారు. ఇవన్నీ ఆధారం లేని కథనాలని పేర్కొన్నారు. ‘మా అబ్బాయి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుర్రాడు ఇలా ఎందుకు చేస్తాడు? ఇవన్నీ నిరాధార కథనాలు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ప్రస్తుతం ఇంతకంటే మాట్లాడటానికేం లేదు’ అని ఆమె ‘సాక్షి’తో చెప్పారు.
Advertisement
Advertisement