'నేను ఎప్పుడూ ఎల్లో కలర్ను నమ్ముతాను'
తిరువనంతపురం : మా జట్టు చాలా పటిష్టమైనది, నైపుణ్యం గల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని క్రికెట్ దిగ్గజ ఆటగాడు, కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ ఆటకు ఐపీఎల్ ఉన్నట్లే, గతేడాది ఫుట్బాల్ మ్యాచ్లకోసం ఐఎస్ఎల్ లీగ్ ప్రారంభిన విషయం విదితమే. 2014లో జరిగిన ఐఎస్ఎల్ మ్యాచ్ల్లో సచిన్ జట్టు కేరళ రన్నరప్గా నిలిచింది. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ స్పాన్సర్ల సమక్షంలో సచిన్ తన జట్టు ఆటగాళ్ల జెర్సీని ఆవిష్కరించారు.
పసుపు రంగు జెర్సీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. 'నేను ఎల్లో కలర్ను విశ్వసిస్తాను. గతేడాది లీగ్ ఆరంభానికి ముందు మా ఆటగాళ్ల నైపుణ్యం గురించి ఎవరికీ తెలియదు. సీజన్ ముగిశాక వారి ప్రతిభ బయటపడింది'అని సచిన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు రాబడుతుందని, మీ సహకారం, ప్రేమ కావాలంటూ సచిన్ అభిమానులను కోరాడు. ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ ఈ సీజన్లో ఆ జట్టుకు ప్రధాన స్పాన్సరర్. ఈ సీజన్ తొలి మ్యాచ్ కేరళ బ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్ల మధ్య అక్టోబర్ 6న జరుగుతుందన్న విషయం విదితమే.