Kerala blasters
-
పంజాబ్ ఎఫ్‌సీ బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు శుభారంభం చేసింది. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చివరి పది నిమిషాల్లో మూడు గోల్స్ కావడం విశేషం. పంజాబ్ తరఫున 86వ నిమిషంలో లుకా మాజ్సెన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు.ఇంజ్యూరీ సమయంలోని 90+2వ నిమిషంలో జిమెనెజ్ గోల్‌తో కేరళ జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. 90+5వ నిమిషంలో ఫిలిప్ మిర్జాక్ గోల్‌తో పంజాబ్ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. -
బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను పెళ్లాడిన భారత ఫుట్‌బాల్ స్టార్.. ఫొటోలు వైరల్
Sahal Abdul Samad Married Reza Farhat: భారత ఫుట్‌బాల్ స్టార్ సాహల్ అబ్దుల్ సమద్ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కేరళ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రెజా ఫర్హత్‌ను పెళ్లిచేసుకున్నాడు. గతేడాది జూలైలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట గురువారం నిఖా చేసుకుంది. కేరళలోని కన్నూర్‌లో వీరి వివాహ వేడుక జరిగింది. సమద్ సహచర ఆటగాళ్లు, ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ ప్లేయర్లు పెళ్లికి హాజరయ్యారు. సచిన్ సురేశ్, రాహుల్ కేపీ తదితరులు సమద్- రెజా వివాహ వేడుకలో సందడి చేశారు. కాగా 26 ఏళ్ల సమద్ భారత ఫుట్‌బాల్ జట్టులో కీలక సభ్యుడు. మిడ్‌ఫీల్డర్ అయిన సమద్.. 2017లో కేరళ బ్లాస్టర్స్‌కు తొలిసారి ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 92 మ్యాచ్‌లలో భాగమై 10 గోల్స్ సాధించాడు. భారత్ తరఫున 30 మ్యాచ్‌లు ఆడి మూడు గోల్స్ చేశాడు. ఇటీవల SAFF Championship గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. ఇక ఆటగాళ్ల బదిలీల క్రమంలో సమద్ కేరళ బ్లాస్టర్స్‌ను వీడి మోహన్ బగన్ సూపర్ జెయింట్‌కు ఆడనున్నాడు. అతడి కోసం ఈ ఫ్రాంఛైజీ ఏకంగా రికార్డు స్థాయిలో 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. సమద్ భార్య రెజా కేరళ తరఫున పలు బ్యాడ్మింటన్ ఈవెంట్లలో పాల్గొంది. ఈ క్రీడా జంట నిఖాకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే -
ISL 2022: కేరళ బ్లాస్టర్స్ విజయం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో గత సీజన్ రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 3–1 గోల్స్ తేడాతో ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టును ఓడించింది. కేరళ తరఫున ఇవాన్ కలియుజినీ (82వ, 89వ ని.లో) రెండు గోల్స్ సాధించగా ... అడ్రియన్ లూనా (72వ ని.లో) ఒక గోల్ చేశాడు. ఈస్ట్ బెంగాల్ జట్టుకు అలెక్స్ లీమా (88వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. బెంగళూరులో నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ ఆడుతుంది. -
ISL 2022: నేటినుంచి ఐఎస్ఎల్–9
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీకి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ బరిలోకి దిగుతుండగా...నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడుతుంది. ఆదివారం హైదరాబాద్ తమ తొలి పోరులో ముంబై సిటీ జట్టును ఎదుర్కొంటుంది. గత రెండు సీజన్లు కరోనా కారణంగా ఐఎస్ఎల్ మ్యాచ్‌లు గోవాకే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు 11 టీమ్‌లకు కూడా సొంత వేదికల్లో, ప్రత్యర్థి వేదికల్లో (హోం అండ్ అవే) మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తుండటం విశేషం. అభిమానులను కూడా ఆయా స్టేడియాల్లో అనుమతిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ సీజన్ కొనసాగనుంది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్స్ ద్వారా మరో రెండు స్థానాలను నిర్ణయిస్తారు. -
ISL: నరాలు తెగే ఉత్కంఠ.. ఎట్టకేలకు తొలి టైటిల్ గెలిచిన హైదరాబాద్
Indian Super League- Hyderabad FC Won Maiden Trophy- ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ‘షూటౌట్’లో 3–1తో కేరళ బ్లాస్టర్స్ జట్టును ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ మరో గోల్ కాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. హైదరాబాద్ గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్లు కొట్టిన మూడు షాట్స్‌ను నిలువరించి తమ జట్టును విజేతగా నిలిపాడు. చాంపియన్ హైదరాబాద్ జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు ఆట 68వ నిమిషంలో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు రాహుల్ గోల్ అందించి 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే 88వ నిమిషంలో సాహిల్ గోల్‌తో హైదరాబాద్ 1–1తో సమం చేసింది. కేరళ జట్టు మూడోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. 2014, 2016లోనూ కేరళ జట్టు ఫైనల్లో ఓడింది. మరోవైపు హైదరాబాద్ జట్టు మూడో ప్రయత్నం లో చాంపియన్‌గా నిలువడం విశేషం. 2019లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలువగా.. 2020– 2021 సీజన్లో ఐదో స్థానాన్ని పొందింది. ‘షూటౌట్’ సాగిందిలా... కేరళ బ్లాస్టర్స్- స్కోరు - హైదరాబాద్ లెస్కోవిచ్ - 01 -జావో విక్టర్ నిషూ కుమార్- 01 - సివెరియో ఆయుష్- 12 - కమారా జీక్సన్ సింగ్ - 13 - హాలీచరణ్ నోట్: ఫలితం తేలిపోవడంతో ఐదో షాట్‌ను తీసుకోలేదు చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు First Appearance in the Final ✅ First #HeroISL trophy ✅ A memorable night for @2014_manel & @HydFCOfficial as they end their campaign in style! 🏆🤩#HFCKBFC #HeroISLFinal #FinalForTheFans #HeroISL #LetsFootball pic.twitter.com/zauxXrqGga — Indian Super League (@IndSuperLeague) March 20, 2022 -
కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌ను వీడిన సందేశ్ జింగాన్
భారత ఫుట్‌బాల్ జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్ కేరళ బ్లాస్టర్స్ క్లబ్‌ను వీడాడు. ఆరేళ్లుగా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన అతను పరస్పర ఒప్పందం మేరకే తమ జట్టును వీడుతున్నట్లు బ్లాస్టర్స్ అధికారి ఒకరు తెలిపారు. చండీగఢ్‌కు చెందిన 26 ఏళ్ల సందేశ్ డిఫెన్స్‌లో దిట్ట. ఐఎస్ఎల్లో రెండుసార్లు (2014, 2016) కేరళను ఫైనల్‌కు చేర్చడంతో కీలకపాత్ర పోషించాడు. గాయంతో గత 2019–20 సీజన్‌కు పూర్తిగా దూరం కావడంతో కేరళ బ్లాస్టర్స్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. 10 జట్లు తలపడిన ఐఎస్ఎల్లో కేరళ పేలవమైన ఆటతీరుతో ఏడో స్థానంలో నిలిచింది. -
కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్‌పై వేటు
న్యూఢిల్లీ: కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ ఫ్రాంచైజీ తరఫున కేవలం ఒక సీజన్‌కు మాత్రమే పనిచేసిన ఈల్కో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. 2019–20 ఐఎస్ఎల్ సీజన్లో ఈల్కో పర్యవేక్షణలోని కేరళ జట్టు 19 పాయింట్లతో ఏడో స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ‘కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సీతో హెడ్ కోచ్ ఈల్కో బంధం ముగిసింది. కోచ్‌గా అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. అతనికి భవిష్యత్‌లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని కేరళ బ్లాస్టర్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నెదర్లాండ్స్‌కు చెందిన 48 ఏళ్ల ఈల్కో ఐఎస్ఎల్లో కేరళ కన్నా ముందు నార్త్ ఈస్ట్ యునైటెడ్(2018–19)కు హెడ్ కోచ్‌గా వ్యవహరించి ఆ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
మళ్లీ ఓడిన హైదరాబాద్
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 1–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్‌కు పది మ్యాచ్‌ల అనంతరం మరో విజయం లభించింది. తాజా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభ మ్యాచ్‌లో తొలి విజయం సాధించిన కేరళ... తిరిగి 11వ మ్యాచ్‌లో కానీ రెండో గెలుపు రుచిని చూడలేదు. ఈ విజయంతో ఈ సీజన్ ఆరంభంలో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి కేరళ బదులు తీర్చుకుంది. కేరళ ఆటగాళ్లు ఒగ్బెచె (33వ, 74వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ద్రొబరోవ్ (39వ నిమిషంలో), మెస్సీ బౌలి (45వ నిమిషంలో), సెత్యసేన్ (59వ నిమింలో) తలా ఒక గోల్ వేశారు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బొబొ (14వ నిమిషంలో) సాధించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో చెన్నైయిన్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
కేరళ బ్లాస్టర్స్ శుభారంభం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కేరళ 2–1తో అట్లెటికో డి కోల్‌కతాపై గెలిచింది. కేరళ ఆటగాడు బార్తలోమెవ్ ఒగ్బెచ్ రెండు గోల్స్ సాధించగా... కోల్‌కతా తరఫున కార్ల్ మెక్‌హ్యూ గోల్ చేశాడు. ఆట 6వ నిమిషంలో కార్ల్ మెక్‌హ్యూ గోల్ చేసి కోల్‌కతాకు ఆధిక్యాన్నిచ్చాడు. అయితే 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన ఒగ్బెచె స్కోర్‌ను సమం చేశాడు. మొదటి అర్ధ భాగం చివరి నిమిషంలో మరో గోల్ చేసిన ఒగ్బెచె కేరళకు 2–1తో ఆధిక్యాన్నిచ్చాడు. చివరిదాకా కేరళ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో మూడు పాయింట్లు వేసుకుంది. మ్యాచ్‌కు ముందు ప్రారంత్సవంలో బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు ఆడుతుంది. -
ఇంగ్లండ్ గెలవాలి: సచిన్
హైదరాబాద్: ఫిఫా ప్రంపకప్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఫ్రాన్ ఫైనల్ చేరుకోగా.. మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లండ్- క్రోయేషియా తలపడనున్నాయి. ఎవరికి అందని అంచనాలతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టే కప్పు గెలవాలని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. ట్విటర్ వేదికగా బ్రిటీష్ జట్టుకు మద్దతు తెలుపుతూ సచిన్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్, కేరళ బ్లాస్టర్ మేనేజర్ డేవిడ్ జేమ్స్‌ను ట్యాగ్ చేశాడు. ‘హాయ్ గాయ్స్, ఈ సారీ నేను పుట్‌బాల్‌లో ఇంగ్లండ్‌కు మద్దతు ఇస్తున్నాను.. కమాన్ ఇంగ్లండ్’ అంటూ సచిన్ వీడియోను చిత్రీకరించి పోస్ట్‌చేశారు. ఇప్పడా ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఇంగ్లండ్‌కు అభిమానుల మద్దతు మరింత పెరిగింది. ఇతర క్రీడలపై అభిమానం.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలపై అభిమానం ఎక్కువే. ఫుట్‌బాల్‌ను సచిన్ అమితంగా ఇష్టపడతాడు కాబట్టే ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమానిగా వ్యవహరిస్తూ ఫుట్‌బాల్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. టెన్సిస్‌ను కూడా ఇష్టపడే సచిన్ రోజర్ ఫెడరర్‌కు వీరాభిమాని. దేశంలో కబడ్డీని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రో కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్‌ను కొనుగోలు చేశారు. Come on England!! #FIFA18@JamosFoundation pic.twitter.com/S9PZ9EWQHk — Sachin Tendulkar (@sachin_rt) July 11, 2018 -
ఆటలకు అండగా నిలుస్తాం!
►కేరళ బ్లాస్టర్స్ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ ►హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీతో ఒప్పందం హైదరాబాద్: క్రీడలను అభిమానించేవారి సహకారం లేకుండా ఏ క్రీడలు కూడా అభివృద్ధి చెందలేవని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ జట్టు కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు. ఇదే కారణంతో గత కొంత కాలంగా తాము అన్ని రకాల క్రీడలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిభ గల చిన్నారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రసాద్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ (హెచ్ఎఫ్ఏ)తో బ్లాస్టర్స్ జత కట్టింది. దీని ద్వారా హెచ్‌ఎఫ్‌ఏలో ఇప్పటికే శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది ట్రైనీలకు బ్లాస్టర్స్ యాజమాన్యం సాంకేతిక సహకారం అందిస్తుంది. ‘ఇక్కడ శిక్షణ పొందిన మెరికల్లాంటి ఆటగాళ్లు త్వరలో మా జట్టుతో పాటు భారత జట్టులో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నాం. కేరళ టీమ్ కోచ్‌లు కూడా ఈ అకాడమీలో అవసరమైన ట్రైనింగ్ అందిస్తారు. గతంలో భారత ఫుట్‌బాల్‌లో అనేక మంది దిగ్గజాలు హైదరాబాద్‌కు చెందినవారే. నాటి వైభవం తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నంలోనే ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాం’ అని ప్రసాద్ చెప్పారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఆటకు మరింత గుర్తింపు తెచ్చేందుకు తమ అకాడమీ కృషి చేస్తోందని హెచ్ఎఫ్ఏ ఫౌండర్ మొహమ్మద్ ఆతిఫ్ హైదర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఏ ప్రతినిధులు తేజో అనంత్ దాసరి, పవన్ కుమార్ దువ్వా, కోచ్ తంగ్బోయ్, బ్లాస్టర్స్ ఆటగాళ్లు రినో, ప్రశాంత్‌లతో పాటు చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు. -
కోల్‌కతాకే కిరీటం
రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ కైవసం ∙రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్‌కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆదివారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నువ్వా.. నేనా అనే రీతిలో జరిగిన ఫైనల్లో అట్లెటికో డి కోల్‌కతా రెండోసారి విజేతగా నిలిచింది. సొంతగడ్డపై తొలి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీపై కోల్‌కతా 4–3 తేడాతో పెనాల్టీ షూటౌట్ ద్వారా నెగ్గింది. లీగ్ తొలి సీజన్ ఫైనల్లోనూ కోల్‌కతా జట్టు కేరళపైనే నెగ్గింది. అలాగే ఈ సీజన్లో సొంతగడ్డపై వరుసగా ఆరు విజయాలు సాధించిన కేరళకు ఇదే తొలి పరాజయం. చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్లు దక్కగా.. రన్నరప్ కేరళకు రూ.4 కోట్లు అందించారు. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయానికి ఇరు జట్లు్ల 1–1తో సమంగా నిలిచాయి. కేరళ బ్లాస్టర్స్ నుంచి మొహమ్మద్ రఫీఖ్ (37), కోల్‌కతా నుంచి సెరెనో (44) గోల్స్ చేశారు. దీంతో ఫలితం కోసం అదనపు సమయాన్ని కేటాయించినా గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో మొదట కేరళ నుంచి ఆంటోనియో జర్మన్, బెల్ఫోర్ట్, రఫీఖ్ గోల్స్ సాధించగా డోయో, హెంగ్బర్ట్ విఫలమయ్యారు. ఇక కోల్‌కతా నుంచి డౌటీ, బోర్జా, లారా, జ్యువెల్ రాజా విజయవంతం కాగా హ్యూమే ఒక్కడు విఫలమయ్యాడు. అంతకుముందు మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీ ఆటతో తమ ఉద్దేశాన్ని చాటుకున్నాయి. తొలి భాగంలోనే ఒక్కో గోల్ సాధించాయి. రెండో అర్ధభాగంలో రెండు జట్లు ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. ఫలితం కోసం మరో అరగంట అదనపు సమయం కేటాయించారు. గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. -
ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్
షూటౌట్లో ఢిల్లీ డైనమోస్‌పై విజయం 18న కోల్‌కతాతో టైటిల్ పోరు న్యూఢిల్లీ: టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈసారి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన కేరళ బ్లాస్టర్స్ లక్ష్యానికి చేరువైంది. ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ 3–0తో పెనాల్టీ షూటౌట్లో విజయాన్ని దక్కించుకుంది. ఈనెల 18న జరిగే ఫైనల్లో అట్లెటికో డి కోల్‌కతాతో కేరళ బ్లాస్టర్స్ తలపడుతుంది.కొచ్చిలో జరిగిన తొలి అంచె సెమీఫైనల్లో 1–0తో నెగ్గిన కేరళ బ్లాస్టర్స్... ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన రెండో అంచె సెమీఫైనల్లో 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ తరఫున పెరీరా (21వ ని.లో), రోచా (45వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... కేరళ జట్టుకు నజోన్ (24వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. రెండు అంచెల సెమీఫైనల్ తర్వాత ఇరు జట్ల స్కోరు 2–2తో సమం కావడంతో ఫలితం తేలడానికి పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జోసు కురైస్, కెర్వెన్ బెల్ఫోర్ట్, మొహమ్మద్ రఫీక్ సఫలమవ్వగా... ఢిల్లీ తరఫున ఫ్లోరెంట్ మలూదా, బ్రూనో పెలిసారి, ఎమర్సన్ గోమ్స్ విఫలమయ్యారు. మలూదా కొట్టిన షాట్ గోల్ పోస్ట్ పైనుంచి బయటకు వెళ్లగా... పెలిసారి, గోమ్స్ షాట్లను కేరళ గోల్‌కీపర్ సందీప్ నందీ నిలువరించాడు. -
కేరళ బ్లాస్టర్స్‌ను గెలిపించిన బెల్ఫోర్ట్
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ తొలి అంచె మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ జట్టు కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఢిల్లీ డైనమోస్‌పై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు భారీగా ఎగబడ్డారు. సుమార్ 50 వేల మంది ప్రత్యక్షంగా తిలకించిన ఈ మ్యాచ్‌లో కేరళ సొంతగడ్డపై తన జైత్రయాత్రను కొనసాగించింది. హోమ్ గ్రౌండ్లో సచిన్ జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకై క గోల్‌ను బెల్ఫోర్ట్ 65వ నిమిషంలో సాధించి కేరళకు అద్భుత విజయాన్నందించాడు. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఒక్క గోల్ అయిన లేకుండానే ఈ సెషన్ ముగిసింది. అనంతరం రెండో అర్ధభాగంలో బెల్ఫోర్ట్ అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలచడంతో కేరళ గెలుపొందింది. -
కేరళ రికార్డు విజయం
కొచ్చి: సొంత గడ్డపై కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ మరోసారి ఆధిపత్యం చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా శుక్రవారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఘనవిజయం సాధించింది. స్థానిక నెహ్రూ స్టేడియంలో ఈ జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఇది ఐఎస్ఎల్ రికార్డు. కేరళ తరఫున నజోన్ (7వ నిమిషంలో), హ్యూజెస్ (57) గోల్స్ చేశారు. రోడ్రిగెజ్ (90) పుణేకు ఏకైక గోల్‌ను అందించాడు. -
కేరళ బ్లాస్టర్స్ గెలుపు
ఇండియన్ సూపర్ లీగ్ ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్‌లో గత మూడు మ్యాచ్‌లలో ఓటమి ఎరుగని కేరళ బ్లాస్టర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కేరళ 2-1 గోల్స్ తేడాతో ఎఫ్‌సీ గోవాపై విజయం సాధించింది. కేరళ తరఫున 46వ నిమిషంలో మొహమ్మద్ రఫీ, 84వ నిమిషంలో కెర్వెన్స బెల్ఫోర్ట్ గోల్స్ సాధించాడు. గోవా జట్టు ఆటగాళ్లలో 24వ నిమిషంలో జూలియో సీజర్ ఏకై క గోల్ నమోదు చేశాడు. ఈ విజయంతో కేరళకు 3 పారుుంట్లు దక్కారుు. తాజా ఫలితం తర్వాత పారుుంట్ల పట్టికలో కేరళ ఐదో స్థానానికి చేరగా, గోవా ఆఖరి స్థానంలో ఉంది. -
అట్లెటికో డి కోల్‌కతా బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో అట్లెటికో డి కోల్‌కతా జట్టు విజయాల బోణీ చేసింది. కేరళ బ్లాస్టర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అట్లెటికో జట్టు 1-0తో నెగ్గింది. 53వ నిమిషంలో జావీ లారా ఏకై క గోల్ చేసి అట్లెటికో జట్టును గెలిపించాడు. చెన్నైరుున్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను అట్లెటికో 2-2తో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. -
అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం
కేరళ బ్లాస్టర్స్ యజమాని సచిన్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ మూడో సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని మాజీ క్రికెటర్, కేరళ బ్లాస్టర్స్ టీమ్ యజమాని సచిన్ టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది వైఫల్యం తర్వాత ఈ సారి అనేక మార్పులతో జట్టు బరిలోకి దిగుతోంది. బుధవారం ఇక్కడ బ్లాస్టర్స్ జెర్సీ ఆవిష్కరణతో పాటు జట్టు సభ్యుల పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. సచిన్‌తో పాటు ఫ్రాంచైజీ సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా ఇందులో పాల్గొన్నారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో వీరు హాజరయ్యారు. ‘కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో కూడిన మా జట్టులో మంచి ప్రతిభ ఉంది. అటాకింగ్ తరహా ఆటతో మైదానంలో దూసుకుపోవాలని వారు ఉత్సాహంగా ఉన్నారు‘ అని సచిన్ అన్నారు. అందరూ ఇష్టపడే తరహాలో కేరళ శైలిలో ఫుట్‌బాల్ ఆడాలన్నారు. గత ఏడాది ఆడిన జట్టులో ఆంటోనియా జర్మన్, జోసూలతో పాటు ఐదుగురు భారత ఆటగాళ్లను ఈ సారి కూడా బ్లాస్టర్స్ కొనసాగించింది. 27 మంది సభ్యుల టీమ్‌లో మిగతావారంతా కొత్తవారే. మార్క్యూ ప్లేయర్ ఆరోన్ హ్యూజెస్‌తో పాటు దిదియార్ బోరిస్, సెడ్రిక్ హెంగ్బార్ట్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ కోపెల్‌ను ఈ సారి జట్టు కోచ్‌గా ఎంచుకుంది. సీజన్ ఆరంభానికి ముందు కేరళ బ్లాస్టర్స్ జట్టు థాయ్‌లాండ్‌లో కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. -
కేరళపై పుణే విజయం
ఐఎస్ఎల్-2 పుణే: స్ట్రయికర్ కలూ ఉచే రెండు గోల్స్‌తో రెచ్చిపోవడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్‌సీ పుణే సిటీ 3-2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పుణే తరఫున మరో గోల్ సాన్లీ సాధించాడు. కేరళ నుంచి రెండు గోల్స్ రఫీ చేశాడు. ఆట ప్రారంభమైన నిమిషంలోనే రఫీ కేరళకు శుభారంభాన్ని అందించాడు. అయితే ఏమాత్రం ఒత్తిడికి లోనుకాని పుణే సిటీ తమ దాడులను కొనసాగించి 16వ నిమిషంలో ఉచే గోల్‌తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదయ్యాయి. మొదట 23వ నిమిషంలో ఉచే తన రెండో గోల్‌తో పుణే ఆధిక్యాన్ని సాధించినా... రఫీ 30వ నిమిషంలో స్కోరును 2-2తో సమం చేశాడు. అయితే 72వ నిమిషంలో సాన్లీ హెడర్‌తో పుణే విజయాన్ని అందుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైతో నార్త్ఈస్ట్ తలపడుతుంది. -
'నేను ఎప్పుడూ ఎల్లో కలర్‌ను నమ్ముతాను'
తిరువనంతపురం : మా జట్టు చాలా పటిష్టమైనది, నైపుణ్యం గల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని క్రికెట్ దిగ్గజ ఆటగాడు, కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ ఆటకు ఐపీఎల్ ఉన్నట్లే, గతేడాది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకోసం ఐఎస్ఎల్ లీగ్ ప్రారంభిన విషయం విదితమే. 2014లో జరిగిన ఐఎస్ఎల్ మ్యాచ్‌ల్లో సచిన్ జట్టు కేరళ రన్నరప్‌గా నిలిచింది. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ స్పాన్సర్ల సమక్షంలో సచిన్ తన జట్టు ఆటగాళ్ల జెర్సీని ఆవిష్కరించారు. పసుపు రంగు జెర్సీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. 'నేను ఎల్లో కలర్‌ను విశ్వసిస్తాను. గతేడాది లీగ్ ఆరంభానికి ముందు మా ఆటగాళ్ల నైపుణ్యం గురించి ఎవరికీ తెలియదు. సీజన్ ముగిశాక వారి ప్రతిభ బయటపడింది'అని సచిన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు రాబడుతుందని, మీ సహకారం, ప్రేమ కావాలంటూ సచిన్ అభిమానులను కోరాడు. ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ ఈ సీజన్లో ఆ జట్టుకు ప్రధాన స్పాన్సరర్. ఈ సీజన్ తొలి మ్యాచ్ కేరళ బ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్ల మధ్య అక్టోబర్ 6న జరుగుతుందన్న విషయం విదితమే. -
ఐఎస్ఎల్ సెమీస్‌లో కేరళ
పుణేపై 1-0తో గెలుపు కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కేరళ 1-0తో నెగ్గి నాకౌట్ దశకు చేరిన మూడో జట్టయ్యింది. 23వ నిమిషంలో ఇయాన్ హుమే సూపర్ ఫ్రీకిక్‌తో జట్టుకు గోల్‌ను అందించాడు. ఆతర్వాత బంతిపై పట్టు కోసం పుణే ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. చెన్నైయిన్, ఢిల్లీ గేమ్ డ్రా చెన్నై: ఐఎస్ఎల్లో తమ చివరి లీగ్ మ్యాచ్‌ను చెన్నైయిన్ ఎఫ్‌సీ, ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్లు 2-2తో డ్రా చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఢిల్లీ సెమీస్‌కు చేరేది. మరోవైపు ఈ ఫలితంతో నార్త్ఈస్ట్ జట్టు లీగ్ నుంచి బయటకు వెళ్లిన తొలి జట్టయ్యింది. మ్యాచ్ 16వ నిమిషంలోనే చెన్నైయిన్కి పెలిస్సారి గోల్ అందించాడు. 28వ నిమిషంలో జే జే ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ద్వితీయార్ధంలో ఢిల్లీ చెలరేగడంతో 53వ నిమిషంలో డెల్ పియరో, 88వ నిమిషంలో ముల్డర్ రూపంలో స్కోరును సమం చేసింది. -
గోవాపై నెగ్గిన కేరళ
ఐఎస్ఎల్ కొచ్చి: సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ సత్తా చూపింది. గురువారం స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. స్ట్రయికర్ మిలాగ్రెస్ గొంజాల్వెస్ (64వ నిమిషంలో) కేరళ తరఫున ఏకైక గోల్ సాధించాడు. దీంతో ఏడు పాయింట్లతో కేరళ తన చివరి స్థానాన్ని మెరుగుపరుచుకోగా పుణే నాలుగు పాయింట్లతో అట్టడుగున నిలిచింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన భార్య అంజలితో కలిసి వచ్చి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాడు. -
కేరళకు తొలి విజయం
ఎఫ్‌సీ పుణేపై 2-1తో గెలుపు పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు ఎట్టకేలకు బోణీ చేసింది. తమ గత మ్యాచ్‌లో పటిష్ట కోల్‌కతా జట్టును నిలువరించిన ఉత్సాహంలో ఉన్న కేరళ... గురువారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌ను 2-1తో గెలుచుకుంది. కేరళ తరఫున సబీత్ (41వ నిమిషంలో), ఒర్జి (65వ ని.) గోల్స్ చేయగా పుణే నుంచి ట్రెజెగె ్వట్ (15వ ని.) ఏకైక గోల్ చేశాడు. శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుంచే హోరాహోరీగా సాగింది. 15వ నిమిషంలో లెఫ్ట్ వింగ్ నుంచి జాప్ గోసెన్స్ సంధించిన బలమైన షాట్‌ను అందుకున్న డేవిడ్ ట్రెజెగ్వెట్ చక్కటి వ్యాలీతో పుణేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత జోరు పెంచిన కేరళ 41వ నిమిషంలో ఫలితం సాధించింది. కార్నర్ కిక్‌ను అందుకున్న స్టీఫెన్ పియర్సన్ హెడర్ గోల్‌కు యత్నించి విఫలం కాగా వెంటనే ఆ బంతిని అందుకున్న సీఎస్ సబీత్ పొరపాటు చేయకుండా కాలితో గోల్‌పోస్టులోకి పంపాడు. దీంతో స్కోరు సమమైంది. ద్వితీయార్ధంలోనూ బంతిపై పట్టు సాధించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు జోరుగా తలపడ్డారు. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన పెన్ ఒర్జి 65వ నిమిషంలో చేసిన గోల్‌తో కేరళ తొలి విజయాన్ని అందుకుంది.+ ఐఎస్ఎల్లో నేడు విశ్రాంతి దినం -
మెండీ ‘మ్యాజిక్' గోల్
చెన్నై: ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత అరుదుగా కనిపించే కిక్.. సైక్లింగ్ కిక్. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేయగలిగే ఆటగాడే ఈ షాట్‌ను అత్యంత విజయవంతంగా పూర్తి చేస్తాడు. అయితే ఇలాంటి సన్నివేశమే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మంగళవారం నాటి మ్యాచ్‌లో ప్రేక్షకులను సమ్మోహన పరిచింది. ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీ స్ట్రయికర్ బెర్నార్డ్ మెండీ కీలక సమయంలో ఈ సూపర్ కిక్‌తో అదరగొట్టాడు. ఫలితంగా చెన్నైయిన్ 2-1తో నెగ్గింది. మెండీ విన్యాసాన్ని స్టేడియంలోనే ఉన్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ , తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు కేరళ సహ యజమాని సచిన్ టెండూల్కర్ సైతం అబ్బురపడి చప్పట్లతో స్వాగతించారు. అటు చెన్నైయిన్కిది వరుసగా రెండో విజయం కాగా కేరళకు వరుసగా రెండో పరాజయం. చెన్నైయిన్ తరఫున ఎలనో (14వ నిమిషంలో), మెండీ (63వ ని.) గోల్స్ సాధించగా... కేరళ తరఫున హుమే (50వ ని.) ఏకైక గోల్ సాధించాడు. లీగ్‌లో ఈ జట్టుకిదే తొలి గోల్. మ్యాచ్ ప్రారంభంలో లభించిన పెనాల్టీ అవకాశాన్ని 14వ నిమిషంలో ఎలనో సులువుగా గోల్ చేసి చెన్నైయిన్కి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక ద్వితీయార్ధం 50వ నిమిషంలో గోల్ పోస్టుకు అతి సమీపంలోనే ఉన్న ఇయాన్ హుమే వేగంగా స్పందించి స్కోరును సమం చేశాడు. అయితే 63వ నిమిషంలో టోర్నీకే హైలైట్ అనదగ్గ సైక్లింగ్ కిక్‌తో బెర్నార్డ్ మెండీ కేరళ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఆధిపత్యం కొనసాగించిన చెన్నై విజయాన్ని అందుకుంది. -
'భారత ఫుట్‌బాల్ ముఖచిత్రం మారుతుంది'
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) తో భారత ఫుట్‌బాల్ ముఖచిత్రం మారుతుందన్న ఆశాభావాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తం చేశాడు. ఆదివారం ప్రారంభమైన ఐఎస్ఎల్ కు అద్భుత స్పందన వచ్చిందని పేర్కొన్నాడు. 'ఇది కొత్త ఆరంభం. దీనికోసమే ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఆరంభ మ్యాచ్ లో రెండు జట్లు గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాయి. ప్రేక్షకుల స్పందన బాగుంది' అని సచిన్ అన్నాడు. తన టీమ్ కు మద్దతుగా సచిన్ ఇక్కడకు వచ్చాడు. సచిన్ సహ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టుకు ఇంగ్లండ్ గోల్ కీపర్ డేవిడ్ జేమ్స్ నాయకత్వం వహిస్తున్నాడు. పీవీపీ వెంచర్స్‌తో కలిసి సచిన్ ఈ జట్టు కొన్నాడు.