మెండీ ‘మ్యాజిక్' గోల్
చెన్నై: ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత అరుదుగా కనిపించే కిక్.. సైక్లింగ్ కిక్. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేయగలిగే ఆటగాడే ఈ షాట్‌ను అత్యంత విజయవంతంగా పూర్తి చేస్తాడు. అయితే ఇలాంటి సన్నివేశమే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో మంగళవారం నాటి మ్యాచ్‌లో ప్రేక్షకులను సమ్మోహన పరిచింది. ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీ స్ట్రయికర్ బెర్నార్డ్ మెండీ కీలక సమయంలో ఈ సూపర్ కిక్‌తో అదరగొట్టాడు.
ఫలితంగా చెన్నైయిన్ 2-1తో నెగ్గింది. మెండీ విన్యాసాన్ని స్టేడియంలోనే ఉన్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ , తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు కేరళ సహ యజమాని సచిన్ టెండూల్కర్ సైతం అబ్బురపడి చప్పట్లతో స్వాగతించారు. అటు చెన్నైయిన్‌కిది వరుసగా రెండో విజయం కాగా కేరళకు వరుసగా రెండో పరాజయం. చెన్నైయిన్ తరఫున ఎలనో (14వ నిమిషంలో), మెండీ (63వ ని.) గోల్స్ సాధించగా... కేరళ తరఫున హుమే (50వ ని.) ఏకైక గోల్ సాధించాడు.
లీగ్‌లో ఈ జట్టుకిదే తొలి గోల్. మ్యాచ్ ప్రారంభంలో లభించిన పెనాల్టీ అవకాశాన్ని 14వ నిమిషంలో ఎలనో సులువుగా గోల్ చేసి చెన్నైయిన్‌కి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక ద్వితీయార్ధం 50వ నిమిషంలో గోల్ పోస్టుకు అతి సమీపంలోనే ఉన్న ఇయాన్ హుమే వేగంగా స్పందించి స్కోరును సమం చేశాడు. అయితే 63వ నిమిషంలో టోర్నీకే హైలైట్ అనదగ్గ సైక్లింగ్ కిక్‌తో బెర్నార్డ్ మెండీ కేరళ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఆధిపత్యం కొనసాగించిన చెన్నై విజయాన్ని అందుకుంది.