ఇద్దరికే అత్యధికం
►సచిన్ జట్టులో భారత సంతతి ఫుట్‌బాలర్
►49 మందితో విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్
►ఇండియన్ సూపర్ లీగ్
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌లో గురువారం జరిగిన విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో ఇద్దరికే అత్యధిక ధర పలికింది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ మెండీ, జార్జి ఆర్నోలిన్‌లకు అత్యధికంగా 80 వేల డాలర్లు (రూ. 48 లక్షల 55 వేలు) దక్కాయి. మెండీని చెన్నై జట్టు, జార్జిని గోవా జట్టు తీసుకున్నాయి. ఐఎస్‌ఎల్‌లో ఆడబోతున్న మొత్తం 56 మంది విదేశీ ఆటగాళ్లకు గాను 49 మందిని డ్రాఫ్ట్‌లో ఉంచారు. మిగతా ఏడుగురు నాలుగు ఫ్రాంచైజీలతో నేరుగా ఒప్పందాలు చేసుకున్నారు. జుంకర్, మోర్టాన్ స్కోబో (ఢిల్లీ), బెలార్డీ, సిరిలో (పుణే), చాన్సా, గ్లెన్ (నార్త్‌ఈస్ట్ ఎఫ్‌సీ), బోర్జా ఫెర్నాండేజ్ (కోల్‌కతా)లు ఇందులో ఉన్నారు. ఏడు రౌండ్ల పాటు జరిగిన ఈ డ్రాఫ్ట్‌లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్రాంచైజీ ‘కేరళ బ్లాస్టర్స్’... భారత సంతతికి చెందిన ఇంగ్లిష్ ఫుట్‌బాలర్ మైకేల్ చోప్రాను 58,185 డాలర్లకు (రూ. 35 లక్షల 31 వేలు) కొనుగోలు చేసింది. స్పెయిన్ ఫుట్‌బాలర్ గోంజాలెజ్‌కు 70 వేల డాలర్ల (రూ. 42 లక్షల 48 వేలు)తో రెండో అత్యధిక ధర పలికింది. కోల్‌కతా ఫ్రాంచైజీ ఇతన్ని తీసుకుంది. ఓవరాల్‌గా డ్రాఫ్ట్‌లో ఉన్న 34 మందికి ఒక్కొక్కరికి 58,185 డాలర్లు దక్కనున్నాయి. మరో 12 మందికి ఒక్కోకరికి 38,790 డాలర్లు (రూ. 23 లక్షల 54 వేలు) చెల్లించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనుంది. షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది.
స్పెయిన్ నుంచి 9 మంది
అత్యధికంగా స్పెయిన్ నుంచి 9 మంది ఆటగాళ్లను ఐఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో ఉంచారు. ఫ్రాన్స్ (8), చెక్ రిపబ్లిక్ (8), బ్రెజిల్ (5), పోర్చుగల్ (5), కొలంబియా (4), దక్షిణ కొరియా (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అర్జెంటీనా, కెనడా, సెర్బియా, సెనెగల్, బుర్కినా ఫాసో, ఇంగ్లండ్, గ్రీస్, కామెరూన్‌ల నుంచి ఒక్కొక్కరు డ్రాఫ్ట్‌లో ఉన్నారు.
బెంగళూరు స్థానంలో చెన్నై ఫ్రాంచైజీ
ఐఎస్‌ఎల్ నుంచి తప్పుకున్న బెంగళూరు స్థానంలో చెన్నై ఫ్రాంచైజీని తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌కు ముందు ఈ అంశాన్ని టోర్నీ సీఈఓ అనుపమ్ దత్తా ప్రకటించారు. అయితే చెన్నై ఫ్రాంచైజీ యజమానులు ఎవరనేది వెల్లడించలేదు. డ్రాఫ్ట్‌లో ఆ ఫ్రాంచైజీ తరఫున ప్రశాంత్ అగర్వాల్ అనే వ్యక్తి పాల్గొన్నారు.