ఆటలకు అండగా నిలుస్తాం!
►కేరళ బ్లాస్టర్స్ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్
►హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీతో ఒప్పందం
హైదరాబాద్: క్రీడలను అభిమానించేవారి సహకారం లేకుండా ఏ క్రీడలు కూడా అభివృద్ధి చెందలేవని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ జట్టు కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు. ఇదే కారణంతో గత కొంత కాలంగా తాము అన్ని రకాల క్రీడలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిభ గల చిన్నారులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రసాద్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ (హెచ్‌ఎఫ్‌ఏ)తో బ్లాస్టర్స్ జత కట్టింది. దీని ద్వారా హెచ్‌ఎఫ్‌ఏలో ఇప్పటికే శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది ట్రైనీలకు బ్లాస్టర్స్ యాజమాన్యం సాంకేతిక సహకారం అందిస్తుంది.
‘ఇక్కడ శిక్షణ పొందిన మెరికల్లాంటి ఆటగాళ్లు త్వరలో మా జట్టుతో పాటు భారత జట్టులో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నాం. కేరళ టీమ్ కోచ్‌లు కూడా ఈ అకాడమీలో అవసరమైన ట్రైనింగ్ అందిస్తారు. గతంలో భారత ఫుట్‌బాల్‌లో అనేక మంది దిగ్గజాలు హైదరాబాద్‌కు చెందినవారే. నాటి వైభవం తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నంలోనే ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టాం’ అని ప్రసాద్ చెప్పారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఆటకు మరింత గుర్తింపు తెచ్చేందుకు తమ అకాడమీ కృషి చేస్తోందని హెచ్‌ఎఫ్‌ఏ ఫౌండర్ మొహమ్మద్ ఆతిఫ్ హైదర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఎఫ్‌ఏ ప్రతినిధులు తేజో అనంత్ దాసరి, పవన్ కుమార్ దువ్వా, కోచ్ తంగ్‌బోయ్, బ్లాస్టర్స్ ఆటగాళ్లు రినో, ప్రశాంత్‌లతో పాటు చాముండేశ్వరీనాథ్ పాల్గొన్నారు.