కేరళ బ్లాస్టర్స్ జట్టు సహ యజమానులు, ఆటగాళ్లతో సచిన్ సెల్ఫీ
కేరళ బ్లాస్టర్స్ యజమాని సచిన్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ మూడో సీజన్‌లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని మాజీ క్రికెటర్, కేరళ బ్లాస్టర్స్ టీమ్ యజమాని సచిన్ టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది వైఫల్యం తర్వాత ఈ సారి అనేక మార్పులతో జట్టు బరిలోకి దిగుతోంది. బుధవారం ఇక్కడ బ్లాస్టర్స్ జెర్సీ ఆవిష్కరణతో పాటు జట్టు సభ్యుల పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. సచిన్‌తో పాటు ఫ్రాంచైజీ సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా ఇందులో పాల్గొన్నారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో వీరు హాజరయ్యారు. ‘కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో కూడిన మా జట్టులో మంచి ప్రతిభ ఉంది. అటాకింగ్ తరహా ఆటతో మైదానంలో దూసుకుపోవాలని వారు ఉత్సాహంగా ఉన్నారు‘ అని సచిన్ అన్నారు.
అందరూ ఇష్టపడే తరహాలో కేరళ శైలిలో ఫుట్‌బాల్ ఆడాలన్నారు. గత ఏడాది ఆడిన జట్టులో ఆంటోనియా జర్మన్, జోసూలతో పాటు ఐదుగురు భారత ఆటగాళ్లను ఈ సారి కూడా బ్లాస్టర్స్ కొనసాగించింది. 27 మంది సభ్యుల టీమ్‌లో మిగతావారంతా కొత్తవారే. మార్క్యూ ప్లేయర్ ఆరోన్ హ్యూజెస్‌తో పాటు దిదియార్ బోరిస్, సెడ్రిక్ హెంగ్‌బార్ట్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ కోపెల్‌ను ఈ సారి జట్టు కోచ్‌గా ఎంచుకుంది. సీజన్ ఆరంభానికి ముందు కేరళ బ్లాస్టర్స్ జట్టు థాయ్‌లాండ్‌లో కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది.