Indian Super League football
-
హైదరాబాద్ ఎఫ్‌సీ ‘హ్యాట్రిక్’
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం సొంత మైదానం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో గోవా ఎఫ్‌సీని ఓడించింది. హైదరాబాద్ తరఫున ఏకైక గోల్‌ను సివెరియో 11వ నిమిషంలో నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన హైదరాబాద్ తర్వాతి మూడు మ్యాచ్‌లలో గెలిచింది. చదవండి: T20 WC 2022: పాకిస్తాన్ - నెదర్లాండ్స్ మ్యాచ్.. కామెంటేటర్‌గా మిథాలీ రాజ్ -
మూడు నిమిషాల్లో రెండు గోల్స్...
మార్గావ్ (గోవా): ఓటమి ఖాయం అనుకున్న చోట గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఫార్వర్డ్ ఇగోర్ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం ఎఫ్‌సీ గోవా, బెంగళూరు ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు కాగా... మూడో మ్యాచ్ మాత్రం అసలైన ఫుట్‌బాల్ వినోదాన్ని పంచింది. బెంగళూరు ఆటగాళ్లు సిల్వా (27వ నిమిషంలో), ఆంటోనియో గొంజాలెజ్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. గోవా తరఫున ఇగోర్ (66వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి జట్టును గట్టెక్కించాడు. సునీల్ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్జోత్ సింగ్ లాంగ్ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన సిల్వా... తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్ ఎండెల్ హెడర్‌తో ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన ఆంటోనియో బెంగళూరును 2–0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా కనిపించింది. అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్ దెబ్బ తీశాడు. అల్బెర్టో, జెసురాజ్ ఇచ్చిన పాస్‌లను గోల్స్‌గా మలిచి... మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
నార్త్ఈస్ట్ యునైటెడ్ బోణీ
వాస్కోడగామా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏడో సీజన్లో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) బోణీ కొట్టింది. ఇక్కడి తిలక్ మైదాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ 1–0తో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. జట్టుకు లభించిన పెనాల్టీని 49వ నిమిషంలో గోల్‌గా మలిచిన అపియా నార్త్ఈస్ట్కు విజయం దక్కేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై... ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్‌ను ఆరంభించింది. ముఖ్యంగా అహ్మద్ జాహూ, హ్యూగో బౌమస్, ఒగ్బెచే చక్కటి సమన్వయంతో కదులుతూ నార్త్ఈస్ట్పై ఒత్తిడి పెంచారు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ దగ్గరికి బంతిని తీసుకెళ్లినా... ఫినిష్ చేయడంలో సఫలం కాలేకపోయారు. నేటి మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడుతుంది. -
మళ్లీ ఓడిన హైదరాబాద్
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 1–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్‌కు పది మ్యాచ్‌ల అనంతరం మరో విజయం లభించింది. తాజా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభ మ్యాచ్‌లో తొలి విజయం సాధించిన కేరళ... తిరిగి 11వ మ్యాచ్‌లో కానీ రెండో గెలుపు రుచిని చూడలేదు. ఈ విజయంతో ఈ సీజన్ ఆరంభంలో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి కేరళ బదులు తీర్చుకుంది. కేరళ ఆటగాళ్లు ఒగ్బెచె (33వ, 74వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ద్రొబరోవ్ (39వ నిమిషంలో), మెస్సీ బౌలి (45వ నిమిషంలో), సెత్యసేన్ (59వ నిమింలో) తలా ఒక గోల్ వేశారు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బొబొ (14వ నిమిషంలో) సాధించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో చెన్నైయిన్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
ముంబైపై గోవా విజయం
ముంబై: సొంత ప్రేక్షకుల మధ్య ముంబై సిటీ ఎఫ్‌సీ తడబడింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 2–4 గోల్స్ తేడాతో గోవా ఎఫ్‌సీ చేతిలో ఓడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన గోవా ఎఫ్‌సీ సీజన్లో రెండో విజయాన్ని ఖాయం చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో గోవా ఆటగాళ్లలో లెన్ని రోడ్రిగస్ (27వ ని.), ఫెర్రాన్ కొరొమినస్ (45వ ని.), హ్యూగో బొవుమౌస్ (59వ ని.), కార్లోస్ పెన (89వ ని.) తలా ఓ గోల్ చేశారు. ముంబై తరఫున సార్థక్ గోలుయ్ (49వ ని.), సౌవిక్ చక్రబర్తి (55వ ని.) చెరో గోల్ సాధించారు. -
ఫుట్‌బాల్ రాత మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడినుంచి సాకర్ స్టార్లను తయారు చేస్తామని చెప్పారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కొత్తగా ఈ ఏడాది హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రవేశించింది. వచ్చే నెల 20న మొదలయ్యే ఈ సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడనుంది. ఈ సందర్భంగా ఆదివారం టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేశ్, భారత క్రికెట్ మాజీ కెపె్టన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడు అజహరుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జట్టు యజమాని విజయ్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా నగరంలో ఫుట్‌బాల్‌ను విస్తరిస్తామని అన్నారు. నగరానికి ఫుట్‌బాల్‌లో చక్కని చరిత్ర ఉందని, తమ జట్టు దాన్ని మరింత బలబరిచేందుకు కృషి చేస్తుందని సహ యజమాని వరుణ్ త్రిపురనేని చెప్పారు. వెంకటేశ్ మాట్లాడుతూ ‘ఓ క్రీడాభిమానిగా హైదరాబాద్ ఎఫ్‌సీ ఫ్రాంచైజీకి స్వాగతం పలుకుతున్నా. ఐఎస్ఎల్లో తలపడేందుకు ఇప్పుడు మనకంటూ ఓ జట్టు ఉందని సంతోషం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి పలువురు అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో ఎనిమిది మంది హైదరాబాదీలే. ఈ క్లబ్‌తో మళ్లీ నగరానికి సాకర్ వైభవం రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. అజహర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఎఫ్‌సీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొమ్మిదేళ్ల క్రితమే తాను ఫుట్‌బాల్ అభివృద్ధికి తపించానని... అయితే అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. -
ఢిల్లీ, పుణే మ్యాచ్ డ్రా
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ఢిల్లీ డైనమోస్, పుణే సిటీ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచారుు. పుణే తరఫున 45వ నిమిషంలో జీసస్ టాటో గోల్ చేశాడు. ఆ తర్వాత 79వ నిమిషంలో మిలాన్ సింగ్ చేసిన గోల్‌తో ఢిల్లీ జట్టు స్కోరు సమం చేసింది. -
నార్త్ ఈస్ట్‌పై ముంబై విజయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం ముంబైలోనే నార్త్ ఈస్ట్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది. ముంబైకి 55వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను ఫోర్లాన్ గోల్‌గా మలిచాడు. మ్యాచ్ మొత్తం నార్త్ ఈస్ట్ అనేక అవకాశాలు సృష్టించుకున్నా... వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన నార్త్ ఈస్ట్‌కు ఇది తొలి ఓటమి. -
అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం
కేరళ బ్లాస్టర్స్ యజమాని సచిన్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ మూడో సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని మాజీ క్రికెటర్, కేరళ బ్లాస్టర్స్ టీమ్ యజమాని సచిన్ టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది వైఫల్యం తర్వాత ఈ సారి అనేక మార్పులతో జట్టు బరిలోకి దిగుతోంది. బుధవారం ఇక్కడ బ్లాస్టర్స్ జెర్సీ ఆవిష్కరణతో పాటు జట్టు సభ్యుల పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. సచిన్‌తో పాటు ఫ్రాంచైజీ సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా ఇందులో పాల్గొన్నారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో వీరు హాజరయ్యారు. ‘కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో కూడిన మా జట్టులో మంచి ప్రతిభ ఉంది. అటాకింగ్ తరహా ఆటతో మైదానంలో దూసుకుపోవాలని వారు ఉత్సాహంగా ఉన్నారు‘ అని సచిన్ అన్నారు. అందరూ ఇష్టపడే తరహాలో కేరళ శైలిలో ఫుట్‌బాల్ ఆడాలన్నారు. గత ఏడాది ఆడిన జట్టులో ఆంటోనియా జర్మన్, జోసూలతో పాటు ఐదుగురు భారత ఆటగాళ్లను ఈ సారి కూడా బ్లాస్టర్స్ కొనసాగించింది. 27 మంది సభ్యుల టీమ్‌లో మిగతావారంతా కొత్తవారే. మార్క్యూ ప్లేయర్ ఆరోన్ హ్యూజెస్‌తో పాటు దిదియార్ బోరిస్, సెడ్రిక్ హెంగ్బార్ట్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ కోపెల్‌ను ఈ సారి జట్టు కోచ్‌గా ఎంచుకుంది. సీజన్ ఆరంభానికి ముందు కేరళ బ్లాస్టర్స్ జట్టు థాయ్‌లాండ్‌లో కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. -
ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ విజేత కోల్‌కతా
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో కోల్‌కతా విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా 1-0తో కేరళపై విజయం సాధించి ట్రోఫీ సొంతం చేసుకుంది. -
మరో నలుగురు స్టార్స్
ముంబై: ఐపీఎల్ తరహాలోనే ఫుట్‌బాల్‌లో త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఆడేందుకు మరో న లుగురు మాజీ అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు అంగీకరించారు. జుంగ్‌బర్గ్, స్ట్రయికర్ డ్వైట్ యార్క్, పైర్స్, క్రెస్పో ఈ లీగ్‌కు అందుబాటులో ఉంటామని ధృవీకరించినట్టు నిర్వాహకులు ఐఎంజీ-రిలయన్స్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మార్చి 30 వరకు జరిగే ఈ లీగ్‌లో మాంచెస్టర్ యునెటైడ్ మాజీ గోల్ కీపర్ పీటర్ ష్మిచెల్, 1998లో ప్రపంచకప్ గెలుచుకున్న ఫ్రాన్స్ జట్టులో సభ్యుడు మార్సెల్ డెసల్లీ రెండు ఫ్రాంచైజీలకు మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. పదేళ్ల పాటు ఈ లీగ్‌లో సంయుక్త భాగస్వామ్యులుగా ఉంటూ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ ఇండియాతో ఐఎంజీ ఒప్పందం చేసుకుంది. భారత్‌లో ఫుట్‌బాల్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు జరుగుతున్న ఈ లీగ్‌లో ఎనిమిది నగరాల పేర్లతో జట్లు పాల్గొంటాయి. ఆయా జట్లలో 22 మంది ఆటగాళ్లుంటారు. వీరిలో 10 మంది విదేశీ, ఎనిమిది మంది దేశవాళీ, అండర్-23 విభాగానికి చెందిన నలుగురు స్థానిక ఆటగాళ్లుంటారు. ఫ్రాంచైజీల కోసం బిడ్డింగ్ ఈనెల 25 నుంచి నవంబర్ 5 మధ్య జరిగే అవకాశం ఉంది. జట్లను కొనేందుకు కనీస ధర రూ.25 కోట్లు. మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న ఐ-లీగ్‌కు చెందిన చాలా క్లబ్బులు (మహ్మదన్ స్పోర్టింగ్, యునెటైడ్ మినహా) తమ ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం విడుదల చేసేందుకు అంగీకరించడం లేదు.