ఇగోర్ (జెర్సీ–17) కు సహచరుడి అభినందన
మార్గావ్ (గోవా): ఓటమి ఖాయం అనుకున్న చోట గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఫార్వర్డ్ ఇగోర్ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్‌లో భాగంగా ఆదివారం ఎఫ్‌సీ గోవా, బెంగళూరు ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు కాగా... మూడో మ్యాచ్ మాత్రం అసలైన ఫుట్‌బాల్ వినోదాన్ని పంచింది. బెంగళూరు ఆటగాళ్లు సిల్వా (27వ నిమిషంలో), ఆంటోనియో గొంజాలెజ్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు.
గోవా తరఫున ఇగోర్ (66వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి జట్టును గట్టెక్కించాడు. సునీల్ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్‌జోత్ సింగ్ లాంగ్ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన సిల్వా... తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్ ఎండెల్ హెడర్‌తో ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన ఆంటోనియో బెంగళూరును 2–0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా కనిపించింది. అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్ దెబ్బ తీశాడు. అల్బెర్టో, జెసురాజ్ ఇచ్చిన పాస్‌లను గోల్స్‌గా మలిచి... మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment