FC Goa
-
మూడు నిమిషాల్లో రెండు గోల్స్...
మార్గావ్ (గోవా): ఓటమి ఖాయం అనుకున్న చోట గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఫార్వర్డ్ ఇగోర్ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం ఎఫ్‌సీ గోవా, బెంగళూరు ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు కాగా... మూడో మ్యాచ్ మాత్రం అసలైన ఫుట్‌బాల్ వినోదాన్ని పంచింది. బెంగళూరు ఆటగాళ్లు సిల్వా (27వ నిమిషంలో), ఆంటోనియో గొంజాలెజ్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. గోవా తరఫున ఇగోర్ (66వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి జట్టును గట్టెక్కించాడు. సునీల్ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్జోత్ సింగ్ లాంగ్ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన సిల్వా... తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్ ఎండెల్ హెడర్‌తో ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన ఆంటోనియో బెంగళూరును 2–0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా కనిపించింది. అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్ దెబ్బ తీశాడు. అల్బెర్టో, జెసురాజ్ ఇచ్చిన పాస్‌లను గోల్స్‌గా మలిచి... మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
బెంగళూరును గెలిపించిన సునీల్ చెత్రి
బెంగళూరు: ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్‌తో (59వ, 84వ నిమిషాల్లో) మెరిశాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో గోవాపై నెగ్గింది. గోవా తరఫున హ్యూగో (61వ నిమిషంలో) గోల్ సాధించాడు. నేటి మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో అట్లెటికో డి కోల్‌కతా తలపడుతుంది. -
గోవా చేతిలో కోల్‌కతాకు చుక్కెదురు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రస్తుత సీజన్లో నిలకడగా ఆడుతోన్న మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాకు చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 1–2తో ఎఫ్‌సీ గోవా చేతిలో కంగుతింది. మ్యాచ్ మొదటి అర్ధ భాగాన్ని ఇరు జట్లు గోల్స్ లేకుండానే ముగించాయి. గోవా తరఫున 60వ నిమిషంలో మౌర్తాడ ఫాల్... 66వ నిమిషంలో ఫెరాన్ కొరొమినాస్ ఒక్కో గోల్ చేశారు. 64వ నిమిషంలో కోల్‌కతాకు జాబీ జస్టిన్ ఏకైక గోల్ అందించాడు. నేడు ముంబైతో బెంగళూరు ఆడుతుంది. -
ఢిల్లీ డైనమోస్ ఘనవిజయం
న్యూఢిల్లీ: మార్సెలో పెరీరా మూడు గోల్స్, గాడ్జే రెండు గోల్స్ చేయడంతో... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు 5-1 తేడాతో ఎఫ్‌సీ గోవాను మట్టికరిపించింది. 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 20 పారుుంట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. -
గోవాను వణికించిన నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2-0తో నెగ్గింది. ఈ రెండు గోల్స్‌ను స్టయికర్ ఎమిలియానో అల్ఫరోనే (20, 62వ నిమిషాల్లో) చేశాడు. ఆట ప్రారంభమైన 12వ నిమిషంలోనే నార్త్ఈస్ట్కు గోల్ చేసే అవకాశం దక్కింది. కోఫీ క్రిస్టియాన్ క్రాస్‌ను కట్సుమి యుసా గోల్ పోస్టులోకి పంపే లోపే కీపర్ లక్ష్మికాంత్ కట్టిమాని డైవింగ్ చేసి అడ్డుకున్నాడు. అయితే 20వ నిమిషంలో అల్ఫరో జట్టు తరఫున బోణీ చేశాడు. గోవా కెప్టెన్ లూసియో బ్యాక్పాస్ను తమ కీపర్ వైపు అందించగా అతడు బంతిని అందుకునేందుకు ముందుకు రాకుండా అక్కడే వెయిట్ చేయడంతో అల్ఫరో ఈలోపే వేగంగా స్పందించి దాన్ని గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలోనూ గోవా తమ దూకుడును ప్రదర్శించింది. అయితే సమష్టిగా ఆడిన నార్త్ఈస్ట్కు 62వ నిమిషంలో అల్ఫరో మరో అద్భుత గోల్ చేసి విజయాన్ని ఖాయం చేశాడు. -
గోవా ఎఫ్సీకి రూ.11 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ:ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో భాగంగా గతేడాది డిసెంబర్లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం గోవా ఎఫ్‌సీ జట్టు క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించినందుకు రూ. 11 కోట్ల భారీ జరిమానా పడింది. దీంతో పాటు ఆ ఫ్రాంచైజీ యజమానులు దత్తరాజ్ సాల్గాకోర్పై మూడు సంవత్సరాలు, శ్రీనివాస్ డెంపోపై రెండు సంవత్సరాలు నిషేధాన్ని విధించింది. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ఐఎస్ఎల్ కమిషన్ సుదీర్ఘంగా విచారించిన అనంతరం గురువారం గోవా ఎఫ్‌సీపై చర్యలకు ఆదేశించింది. ఈ మొత్తంలో రూ. 10 కోట్లను ఫుట్ బాల్ స్పోర్ట్ డెవలప్ మెంట్(ఎఫ్ఎస్డీఎల్) ఇవ్వాలని ఐఎస్ఎల్ కమిషన్ స్పష్టం చేసింది. ఆనాటి తుదిపోరులో గోవా ఎఫ్‌సీ 2-3 తేడాతో చెన్నైయిన్పై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా ఆటగాళ్లు, అధికారులు రిఫరీని చుట్టుముట్టి భయాందోళనకు గురి చేశారు. మ్యాచ్ ఫిక్సయిందంటూ నానా హంగామా స్పష్టించారు. మరోవైపు జట్టు యజమాని సాల్గాకోర్ ను చెన్నైయిన్ ఎఫ్‌సీ ఆటగాడు ఎలానో బ్లమర్ దూషించాడంటూ ఆరోపించింది. దీనిలో భాగంగా ఆ మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమాన్ని కూడా గోవా ఎఫ్‌సీ బహిష్కరించింది. -
ఎఫ్‌సీ గోవాకు షోకాజ్ నోటీసు
పణజీ: ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ఎఫ్‌సీ గోవాకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) షోకాజ్ నోటీసు జారీ చేసింది. గత నెల 20న జరిగిన ఫైనల్లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో ఓడిన అనంతరం చేసిన అల్లరిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదో తెలపాల్సిందిగా అందులో కోరింది. జట్టుతో పాటు ఆటగాళ్లకు కూడా ఈమేరకు నోటీసులు పంపి ఈనెల 8లోగా సమాధానమివ్వాల్సిందిగా స్పష్టం చేసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, అధికారులు ఎక్విప్మెంట్ మేనేజర్ రాజేశ్ మాల్గి ఆధ్వర్యంలో రిఫరీని చుట్టుముట్టి ఆయన్ని భయాందోళనకు గురి చేశారని ఏఐఎఫ్ఎఫ్ పేర్కొంది. జపాన్‌కు చెందిన రిఫరీలను బూతులు తిట్టడమే కాకుండా భౌతికంగా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని, అలాగే బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయడం కూడా నిబంధనలకు వ్యతిరేకమని తెలిపింది. మరోవైపు ఐఎస్ఎల్, ఏఐఎఫ్ఎఫ్ను విమర్శించడంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన ఎఫ్‌సీ గోవా అధ్యక్షుడు దత్తరాజ్ సాల్గావ్‌కర్‌ను విడిగా వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. -
చెన్నైయిన్ కెప్టెన్ ఎలనో అరెస్ట్, విడుదల
పణజి: ఐఎస్ఎల్ రెండో సీజన్లో విజేతగా నిలిచిన అనంతరం చెన్నైయిన్ ఎఫ్‌సీ ఆటగాళ్ల విజయోత్సవాలు స్ట్రయికర్ ఎలనో బ్లమ్మర్కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో ఎఫ్‌సీ గోవాను 3-2తో ఓడించిన అనంతరం ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. అయితే కాస్త అతిగా స్పందించిన ఎలనో... ఎఫ్‌సీ గోవా సహ యజమాని దత్తరాజ్ సాల్గావ్‌కర్‌ను తన మోచేతితో గుద్దాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సాల్గావ్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎలనోను అదే రోజు రాత్రి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే జట్టు ఆటగాళ్లతో పాటు రిలయన్స్ స్పోర్ట్స్ అధికారులు అతడికి బెయిల్ ఇప్పించారు. వెంటనే సోమవారం ఉదయం 5 గంటలకు తను బ్రెజిల్ వెళ్లిపోయినట్టు న్యాయవాది రాజీవ్ గోమ్స్ తెలిపారు. ఎలనో వ్యవహారంపై ఐఎస్ఎల్ సీరియస్ అయ్యింది. ఇలాంటి ఘటనలు లీగ్ ఇమేజిని దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. ఇలాంటివి సహించేది లేదని, అందుకే విషయాన్ని క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేసినట్టు తెలిపింది. -
ఐఎస్ఎల్-2 విజేత చెన్నైయిన్
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ లో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఎఫ్‌సీ గోవాపై 3-2తో గెలిచి చెన్నైయిన్ జట్టు కప్ కైవసం చేసుకుంది. ఐఎస్ఎల్లో కొత్త చాంపియన్ గా అవతరించింది. కొంపముంచిన సెల్ఫ్ గోల్: గోవా ఓటమిలో స్వయంకృతమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జట్టు గోల్ కీపర్ చేసిన తప్పిదంతో గోవా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సెల్ఫ్ గోల్ గోవా కొంప ముంచింది. గోల్ కీపర్ కట్టిమణి సెల్ప్ గోల్ కొట్టడంతో గోవా కు టైటిల్ కు దూరమైంది. చెన్నైయిన్ తరపున మెండోజా, బ్రునో పెలిసారి గోల్స్ చేశారు. -
ఢిల్లీని గెలిపించిన రాబిన్ సింగ్
ఐఎస్ఎల్ తొలి అంచె సెమీస్‌లో గోవా ఓటమి న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ తొలి అంచె సెమీస్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఆకట్టుకుంది. గోవా ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 1-0తో గెలిచింది. లీగ్ చరిత్రలో గోవా జట్టుపై ఢిల్లీ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో అంచె సెమీస్ 15న గోవాలో జరుగుతుంది. ఢిల్లీ తరఫున ఏకైక గోల్ రాబిన్ సింగ్ (42వ నిమిషంలో) చేశాడు. లీగ్ దశలో టాపర్‌గా నిలిచిన గోవాపై ఆరంభం నుంచే ఢిల్లీ ఆటగాళ్లు ప్రణాళిక ప్రకారం ఆడారు. గోవా అటాకింగ్ ఆటను అడ్డుకుంటూనే తమ దాడులు తీవ్రం చేశారు. ఫలితంగా 42వ నిమిషంలో అండర్సన్ చికావో పంపిన క్రాస్‌ను రాబిన్ సింగ్ హెడర్ గోల్ చేసి జట్టు శిబిరంలో ఆనందం నింపాడు. -
ఐఎస్ఎల్: ఢిల్లీ డైనమోస్ పై గోవా విజయం
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2015లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో ఢిల్లీ డైనమోస్‌పై విజయం సాధించింది. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఆడటంతో ప్రేక్షకుల మద్ధతు కూడగట్టుకున్న గోవా జట్టు చెలరేగిపోయింది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలో ఢిల్లీ ప్లేయర్ సౌవిక్ చక్రవర్తి చేసిన తప్పిదంతో గోవా జట్టు ఖాతా తెరిచినట్లయింది. బంతిని అడ్డుకునే ప్రయత్నంలో తానే గోల్ పోస్ట్ లోకి బంతిని నెట్టడంతో గోవా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రథమార్ధం చివరి నిమిషంలో స్టార్ ప్లేయర్ రీనాల్డో గోల్ చేయడంతో గోవా 2-0తో ఢిల్లీపై ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. చివరివరకూ గోల్ పోస్ట్‌లపై దాడులు చేసినప్పటికీ ఢిల్లీ మాత్రం తన ఖాతా తెరవలేకపోయింది. దీంతో గోవా జట్టు 2-0 తేడాతో ఢిల్లీపై విజయాన్ని సొంతం చేసుకుంది. -
దుబాయ్ లో ఎఫ్ సీ గోవా కసరత్తు
మరి కొద్ది రోజుల్లో రెండో సీజన్ ప్రారంభం కానుండటంతో ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ లన్నీ విదేశీ ఆటగాళ్ల వేటలో పడ్డాయి. కొత్త ఒప్పందాలతో బిజీగా ఉన్నాయి. లేటెస్ట్ గా ఎఫ్ సీ గోవా స్ట్రైకర్ డెరిల్ డఫ్పీ తో ఒప్నందం కుదుర్చుకుంది. తమ టీమ్ లో ఖాళీగా ఉన్న ఇంటర్నేషనల్ ప్లేయర్, అడిషనల్ ప్లేయర్ స్థానాల కోసం రెండు డీల్స్ కుదుర్చుకుందని మేనేజ్ మెంట్ మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే డఫ్పీ కేవలం ఐసీఎల్ సీజన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. సీజన్ ముగిసిన వెంటనే స్వంత క్లబ్ కు తిరిగి వెళ్లనున్నాడని తెలుస్తోంది. మరో వైపు గోవా తమ టీమ్ లోని ఎనిమిది మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కోటా పూర్తి కావడంతో.. అడిషనల్ ప్లేయర్ కోటాలో పూనే డిఫెండర్ లూసియానో సబ్రోసాను తెచ్చుకుంది. ఆటగాళ్ల ఎంపిక పూర్తి కావడంతో ఎఫ్ సీ గోవా టీమ్ ప్రీ సెషన్ ట్రైనింగ్ కోసం ఇవాళ దుబాయ్ బయల్దేరి వెళ్లనుంది. -
గోవాపై నెగ్గిన కేరళ
ఐఎస్ఎల్ కొచ్చి: సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ సత్తా చూపింది. గురువారం స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. స్ట్రయికర్ మిలాగ్రెస్ గొంజాల్వెస్ (64వ నిమిషంలో) కేరళ తరఫున ఏకైక గోల్ సాధించాడు. దీంతో ఏడు పాయింట్లతో కేరళ తన చివరి స్థానాన్ని మెరుగుపరుచుకోగా పుణే నాలుగు పాయింట్లతో అట్టడుగున నిలిచింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన భార్య అంజలితో కలిసి వచ్చి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాడు.