కేరళకు తొలి విజయం
ఎఫ్‌సీ పుణేపై 2-1తో గెలుపు
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు ఎట్టకేలకు బోణీ చేసింది. తమ గత మ్యాచ్‌లో పటిష్ట కోల్‌కతా జట్టును నిలువరించిన ఉత్సాహంలో ఉన్న కేరళ... గురువారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌ను 2-1తో గెలుచుకుంది. కేరళ తరఫున సబీత్ (41వ నిమిషంలో), ఒర్జి (65వ ని.) గోల్స్ చేయగా పుణే నుంచి ట్రెజెగె ్వట్ (15వ ని.) ఏకైక గోల్ చేశాడు. శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుంచే హోరాహోరీగా సాగింది. 15వ నిమిషంలో లెఫ్ట్ వింగ్ నుంచి జాప్ గోసెన్స్ సంధించిన బలమైన షాట్‌ను అందుకున్న డేవిడ్ ట్రెజెగ్వెట్ చక్కటి వ్యాలీతో పుణేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
అయితే ఆ తర్వాత జోరు పెంచిన కేరళ 41వ నిమిషంలో ఫలితం సాధించింది. కార్నర్ కిక్‌ను అందుకున్న స్టీఫెన్ పియర్సన్ హెడర్ గోల్‌కు యత్నించి విఫలం కాగా వెంటనే ఆ బంతిని అందుకున్న సీఎస్ సబీత్ పొరపాటు చేయకుండా కాలితో గోల్‌పోస్టులోకి పంపాడు. దీంతో స్కోరు సమమైంది. ద్వితీయార్ధంలోనూ బంతిపై పట్టు సాధించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు జోరుగా తలపడ్డారు. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన పెన్ ఒర్జి 65వ నిమిషంలో చేసిన గోల్‌తో కేరళ తొలి విజయాన్ని అందుకుంది.+
ఐఎస్‌ఎల్‌లో నేడు విశ్రాంతి దినం