Indian Super League (ISL)
-
హెడ్‌కోచ్‌పై వేటు.. అసిస్టెంట్ కోచ్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తమ హెడ్ కోచ్ తంగ్బోయ్ సింగ్టో(Thangboi Singto)కు ఉన్నపళంగా ఉద్వాసన పలికింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో అతడిని తప్పించింది. 13 జట్లు తలపడుతున్న ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ 12వ స్థానంలో ఉంది.పదకొండు మ్యాచ్‌లాడిన జట్టు కేవలం రెండింట గెలిచి ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగా... 8 మ్యాచ్‌లో ఓడింది. నిరాశజనక ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నపళంగా మణిపూర్‌కు చెందిన కోచ్‌పై వేటు వేసింది. అసిస్టెంట్ కోచ్ షమీల్ చెంబకత్కు తాత్కాలిక హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించింది. గత ఐదేళ్లుగా సింగ్టో జట్టుతో ఉన్నాడు. మొదట్లో (2020లో) డైరెక్టర్‌గా ఉన్న అతడు.. తదనంతరం అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. గతేడాది జూలైలో హెడ్‌కోచ్‌గా నియమించారు. -
ఐఎస్ఎల్ 1000వ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చరిత్రలో 1000వ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. ముంబై జట్టు తరఫున నాథన్ రోడ్రిగ్స్ (63వ నిమిషంలో) ఒక గోల్ సాధించగా... చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున కెప్టెన్ ర్యాన్ ఎడ్వర్డ్స్ (60వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు చెరో 14 షాట్లు ఆడగా... అందులో ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగేసి సార్లు దాడులు చేశాయి. ముంబై జట్టు చిన్న చిన్న పాస్‌లతో ముందుకు సాగగా... చెన్నైయన్జట్టు 15 ఫౌల్స్ చేసింది. ఈ ఫలితంతో 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకున్న చెన్నైయన్ జట్టు 12 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానానికి చేరగా... 10 పాయింట్లు ఖాతాలో ఉన్న ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌తో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. -
ఇండియన్ సూపర్ లీగ్.. జంషెడ్పూర్ ఎఫ్‌సీ కీలక విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్‌సీ కీలక విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో జంషెడ్పూర్ 3–2 గోల్స్ తేడాతో ముంబై సిటీ ఎఫ్‌సీని ఓడించింది. జంషెడ్పూర్ తరఫున 36వ నిమిషంలో జె.ముర్రే...44వ, 50వ నిమిషాల్లో జేవీ హెర్నాండెజ్ గోల్స్ నమోదు చేశారు. ముంబై ఆటగాళ్లలో ఎన్.కరేలిస్ 18వ నిమిషంలో, వాన్ నీఫ్ 77వ నిమిషంలో గోల్స్ సాధించారు.కోల్‌కతాలో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్, ఎఫ్‌సీ గోవా మధ్య జరిగిన మరో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. మొహమ్మదాన్ తరఫున 66వ నిమిషంలో పెనాల్టీ ద్వారా ఎ.గోమెజ్ గోల్ కొట్టగా...గోవా ఆటగాళ్లలో ఎ.సాదికు (90+4) ఏకైక గోల్ సాధించాడు. కొచ్చిలో నేడు జరిగే మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
ఐఎస్ఎల్ విజేత ఏటీకే మోహన్ బగాన్
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్‌ను ఏటీకే మోహన్ బగాన్ (కోల్‌కతా) ఫుట్‌బాల్ క్లబ్ తొలిసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో ఏటీకే మోహన్ బగాన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 4–3తో బెంగళూరు ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’ లో మోహన్ బగాన్ తరఫున వరుసగా పెట్రాటోస్, లిస్టన్, కియాన్, మాన్వీర్ గోల్స్ చేశారు. బెంగళూరు తరఫున అలన్ కోస్టా, రాయ్ కృష్ణ, సునీల్ చెత్రి సఫలంకాగా... రమిరెస్, పెరెజ్ విఫలమయ్యారు. -
ISL 2023: సెమీస్‌లో ముగిసిన హైదరాబాద్ ఎఫ్‌సీ పోరాటం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. సోమవారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ క్లబ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ కూడా తొలి సెమీఫైనల్ మాదిరిగానే 0–0తో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ నిర్వహించారు. ‘షూటౌట్’లో మోహన్ బగాన్ 4–3తో హైదరాబాద్‌ను ఓడించింది. షూటౌట్లో హైదరాబాద్ తరఫున జావో, డాను, రీగన్ సఫలంకాగా... సివెరియో, ఒగ్బెచె విఫల మయ్యారు. ఈనెల 18న గోవాలో జరిగే ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీతో మోహన్ బగాన్ ఆడుతుంది. -
ISL 2023: బెంగళూరును గెలిపించిన సునీల్ ఛెత్రి
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మొద టి సెమీ ఫైనల్ తొలి అంచెలో ముంబై సిటీ ఎఫ్‌సీపై బెంగళూరు ఎఫ్‌సీ పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో ముంబైని ఓడించింది. మ్యాచ్ 79వ నిమిషంలో స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన ఏకైక గోల్‌తో బెంగళూరు విజేతగా నిలిచింది. అయితే ఈ గెలుపుతో బెంగళూరు ఫైనల్ చేరడం ఖాయం కాలేదు. ఇంటా, బయటా పద్ధతిలో ఒక సెమీస్ మ్యాచ్‌ను రెండు అంచెలుగా నిర్వహిస్తుండగా... ఇరు జట్లు ఆదివారం బెంగళూరులో జరిగే రెండో అంచె పోరులో మళ్లీ తలపడతాయి. మరో వైపు రెండో సెమీఫైనల్లో భాగంగా గురువారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ మధ్య గురువారం హైదరాబాద్‌లో తొలి అంచె మ్యాచ్ జరుగుతుంది. -
ISL 2023: సెమీఫైనల్లో మోహన్ బగాన్ జట్టు
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఏటీకే మోహన్ బగాన్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంత ప్రేక్షకుల మధ్య శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మోహన్‌బగాన్ 2–0 గోల్స్ తేడాతో ఒడిషా ఎఫ్‌సీపై ఘన విజయం సాధించింది. మోహన్‌బగాన్ తరఫున బోమన్ (36వ నిమిషం), డి.పెట్రాడోస్ (58వ నిమిషం) గోల్స్ సాధించారు. తాజా విజయంతో 20 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 34 పాయింట్లు సాధించిన మోహన్‌బగాన్ నాలుగో జట్టుగా ఐఎస్ఎల్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో 10 విజయాలు సాధించిన టీమ్ 6 ఓడి మరో 4 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఈ ఫలితంతో సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీతో మోహన్‌బగాన్ ప్రత్యర్థిగా తలపడటం ఖాయమైంది. సెమీఫైనల్ మ్యాచ్ రెండు అంచెలుగా జరుగుతుంది. ఇరు జట్ల మధ్య తొలి పోరు ఈ నెల 9న హైదరాబాద్, రెండో పోరు ఈ నెల 13న రెండో పోరు కోల్‌కతాలో జరుగుతుంది. మరో సెమీస్ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడనున్నాయి. -
హైదరాబాద్ ఎఫ్సీకి వరుసగా రెండో పరాభవం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 1–0తో హైదరాబాద్‌ను ఓడించింది. మోహన్ బగాన్ తరఫున 11వ నిమిషంలో బుమూస్ ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
ISL 2022: కేరళ బ్లాస్టర్స్ విజయం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో గత సీజన్ రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 3–1 గోల్స్ తేడాతో ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టును ఓడించింది. కేరళ తరఫున ఇవాన్ కలియుజినీ (82వ, 89వ ని.లో) రెండు గోల్స్ సాధించగా ... అడ్రియన్ లూనా (72వ ని.లో) ఒక గోల్ చేశాడు. ఈస్ట్ బెంగాల్ జట్టుకు అలెక్స్ లీమా (88వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. బెంగళూరులో నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ ఆడుతుంది. -
ఐఎస్ఎల్ ఫైనల్లో హైదరాబాద్
బాంబోలిమ్ (గోవా): హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఏటీకే మోహన్ బగాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ రెండో దశ మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1తో పరాజయం పాలైంది. మోహన్ బగాన్ తరఫున 79వ నిమిషంలో కృష్ణ గోల్ నమోదు చేశాడు. అయితే ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన తొలి దశ సెమీ ఫైనల్లో హైదరాబాద్ 3–1తో విజయం సాధించింది. ఇప్పుడు రెండు సెమీఫైనల్ మ్యాచ్‌ల తర్వాత ఓవరాల్‌గా 3–2 గోల్స్ తేడాతో హైదరాబాద్ ముందంజ వేసింది. ఈ నెల 20న జరిగే ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ తలపడుతుంది. -
Indian Super League: ముంబై సిటీ నాలుగో విజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై సిటీ ఎఫ్‌సీ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 4–2 గోల్స్ తేడాతో జంషెడ్పూర్ ఎఫ్‌సీపై నెగ్గింది. ముంబై తరఫున క్యాసినో (3వ నిమిషంలో), బిపిన్ సింగ్(17వ నిమిషంలో), ఇగోర్ (24వ నిమిషంలో), వైగోర్ (70వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. జంషెడ్పూర్ ఆటగాళ్లు కోమల్ (48వ నిమిషంలో), ఎలి సబియా (55వ నిమిషంలో) చెరో గోల్ వేశారు. -
Indian Super League: హైదరాబాద్, జంషెడ్పూర్ మ్యాచ్ ‘డ్రా’
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గురువారం హైదరాబాద్, జంషెడ్పూర్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. జంషెడ్పూర్ తరఫున స్టీవర్ట్ (41వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే ఆట 56వ నిమిషంలో జావో విక్టర్ ఇచ్చిన పాస్‌ను ఎటువంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్ట్‌లోకి పంపిన హైదరాబాద్ స్ట్రయికర్ ఒగ్బెచె స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్‌లో ఓడగా...ఇప్పుడు ‘డ్రా’ చేసుకుంది. -
ముంబై మురిసింది
మార్గోవా: లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) అసలు సిసలు అంతిమ సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020– 2021 సీజన్లో చాంపియన్‌గా అవతరించింది. ఏటీకే మోహన్ బగాన్ క్లబ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ముంబై సిటీ జట్టు 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించి తొలిసారి ఐఎస్ఎల్ ట్రోఫీని హస్తగతం చేసుకుంది. మ్యాచ్ నిర్ణీత సమయం ముగియడానికి మరో నిమిషం ఉండగా రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఇక అదనపు సమయానికి మ్యాచ్ దారితీస్తుందని భావిస్తున్న తరుణంలో ముంబై సిటీ ఆటగాడు బిపిన్ సింగ్ అద్భుతం చేశాడు. ‘డి’ ఏరియా అంచులో మోహన్ బగాన్ గోల్‌కీపర్ బంతిని ఒడిసి పట్టుకోవడంలో విఫలం కావడం... వెంటనే ముంబై ఆటగాడు ఒగ్బెచె దానిని అందుకొని బిపిన్ సింగ్‌కు పాస్ ఇవ్వగా... బిపిన్ సింగ్ కళ్లుచెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించడం... ముంబై సిటీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లడం సెకన్లలో జరిగిపోయింది. 90 నిమిషాలు ముగిశాక ఇంజ్యూరీ టైమ్‌గా అదనంగా నాలుగు నిమిషాలు ఆడించారు. ఈ నాలుగు నిమిషాలు ముంబై జట్టు ప్రత్యర్థిని నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆట 18వ నిమిషంలో విలియమ్స్ గోల్‌తో మోహన్ బగాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 29వ నిమిషంలో మోహన్ బగాన్ జట్టు డిఫెండర్ టిరీ సెల్ఫ్ గోల్‌తో ముంబై సిటీ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో పలు మార్లు గోల్‌చేసే అవకాశాలను వదులుకున్నాయి. చివరి నిమి షంలో బిపిన్ సింగ్ అద్భుత గోల్‌తో ముంబై ఖాతాలో విజయం చేరింది. విజేత ముంబై సిటీకి రూ. 8 కోట్లు... రన్నరప్ మోహన్ బగాన్‌కు రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీ లభిం చాయి. ‘గోల్డెన్ బూట్’ అవార్డును సీజన్లో 14 గోల్స్ చేసిన ఇగోర్ (గోవా) దక్కించుకోగా... ‘గోల్డెన్ గ్లవ్’ అవార్డు మోహన్ బగాన్ గోల్‌కీపర్ ఆరిందమ్ భట్టాచార్య పొందాడు. బెంగళూరు తర్వాత (2018–2019 సీజన్) లీగ్ దశలో ‘టాప్ ర్యాంక్’లో నిలువడంతోపాటు టైటిల్‌నూ నెగ్గిన రెండో జట్టుగా ముంబై గుర్తింపు పొందింది. -
నార్త్ ఈస్ట్ యునైటెడ్ బోణీ
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ 2–1తో ఒడిశాపై గెలిచింది. నార్త్ ఈస్ట్ ఆటగాళ్లు రెడీమ్ త్లాంగ్ (2వ ని.), గ్యాన్ (84వ ని.) చెరో గోల్ సాధించారు. ఒడిశా తరఫున హెమాండేజ్ (71వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలోనే గోల్ సమర్పించుకున్న ఒడిశా ఆ తర్వాత తేరుకుంది. 71వ నిమిషంలో స్కోర్‌ను సమం చేసింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఒడిశా ప్లేయర్ డెల్గాడోకు రెడ్‌కార్డు లభించడంతో ఆ జట్టు చివరి 18 నిమిషాలు 10 మందితోనే ఆడింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ గ్యాన్ చివర్లో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. -
కోల్‌కతా 5 హైదరాబాద్ 0
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తొలిసారి అడుగు పెట్టిన హైదరాబాద్ పుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయం ఎదురైంది. మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా (ఏటీకే)తో ఇక్కడి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–5 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. గోల్స్ పరంగా ఐఎస్ఎల్లో కోల్‌కతా జట్టుకిదే పెద్ద విజయం. 2015లో గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4–0తో నెగ్గింది. తాజా గెలుపుతో కోల్‌కతా ఆ రికార్డును సవరించింది. హైదరాబాద్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున డేవిడ్ విలియమ్స్ (25వ, 44వ నిమిషాల్లో), గార్సియా (88వ, 90+4వ నిమిషంలో) చెరో రెండు గోల్స్ చేయగా... కృష్ణా రాయ్ (27వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. మ్యాచ్‌లో బంతి ఎక్కువ శాతం కోల్‌కతా ఆధీనంలోనే ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఒడిశాతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు తలపడుతుంది. -
'నేను ఎప్పుడూ ఎల్లో కలర్‌ను నమ్ముతాను'
తిరువనంతపురం : మా జట్టు చాలా పటిష్టమైనది, నైపుణ్యం గల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని క్రికెట్ దిగ్గజ ఆటగాడు, కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ ఆటకు ఐపీఎల్ ఉన్నట్లే, గతేడాది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకోసం ఐఎస్ఎల్ లీగ్ ప్రారంభిన విషయం విదితమే. 2014లో జరిగిన ఐఎస్ఎల్ మ్యాచ్‌ల్లో సచిన్ జట్టు కేరళ రన్నరప్‌గా నిలిచింది. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ స్పాన్సర్ల సమక్షంలో సచిన్ తన జట్టు ఆటగాళ్ల జెర్సీని ఆవిష్కరించారు. పసుపు రంగు జెర్సీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. 'నేను ఎల్లో కలర్‌ను విశ్వసిస్తాను. గతేడాది లీగ్ ఆరంభానికి ముందు మా ఆటగాళ్ల నైపుణ్యం గురించి ఎవరికీ తెలియదు. సీజన్ ముగిశాక వారి ప్రతిభ బయటపడింది'అని సచిన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు రాబడుతుందని, మీ సహకారం, ప్రేమ కావాలంటూ సచిన్ అభిమానులను కోరాడు. ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ ఈ సీజన్లో ఆ జట్టుకు ప్రధాన స్పాన్సరర్. ఈ సీజన్ తొలి మ్యాచ్ కేరళ బ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్ల మధ్య అక్టోబర్ 6న జరుగుతుందన్న విషయం విదితమే.