ISL 2020-21: Mumbai City Wins Football Club ISL Title, Beats ATK Mohun Bagan 2-1 - Sakshi
Sakshi News home page

ముంబై మురిసింది

Published Sun, Mar 14 2021 5:10 AM | Last Updated on Sun, Mar 14 2021 11:22 AM

Mumbai City beat ATK Mohun Bagan 2-1 lift trophy - Sakshi

మార్గోవా: లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) అసలు సిసలు అంతిమ సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 2020– 2021 సీజన్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఏటీకే మోహన్‌ బగాన్‌ క్లబ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ముంబై సిటీ జట్టు 2–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించి తొలిసారి ఐఎస్‌ఎల్‌ ట్రోఫీని హస్తగతం చేసుకుంది. మ్యాచ్‌ నిర్ణీత సమయం ముగియడానికి మరో నిమిషం ఉండగా రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఇక అదనపు సమయానికి మ్యాచ్‌ దారితీస్తుందని భావిస్తున్న తరుణంలో ముంబై సిటీ ఆటగాడు బిపిన్‌ సింగ్‌ అద్భుతం చేశాడు.

‘డి’ ఏరియా అంచులో మోహన్‌ బగాన్‌ గోల్‌కీపర్‌ బంతిని ఒడిసి పట్టుకోవడంలో విఫలం కావడం... వెంటనే ముంబై ఆటగాడు ఒగ్‌బెచె దానిని అందుకొని బిపిన్‌ సింగ్‌కు పాస్‌ ఇవ్వగా... బిపిన్‌ సింగ్‌ కళ్లుచెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించడం... ముంబై సిటీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లడం సెకన్లలో జరిగిపోయింది. 90 నిమిషాలు ముగిశాక ఇంజ్యూరీ టైమ్‌గా అదనంగా నాలుగు నిమిషాలు ఆడించారు. ఈ నాలుగు నిమిషాలు ముంబై జట్టు ప్రత్యర్థిని నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆట 18వ నిమిషంలో విలియమ్స్‌ గోల్‌తో మోహన్‌ బగాన్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 29వ నిమిషంలో మోహన్‌ బగాన్‌ జట్టు డిఫెండర్‌ టిరీ సెల్ఫ్‌ గోల్‌తో ముంబై సిటీ 1–1తో  స్కోరును సమం చేసింది. అనంతరం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో పలు మార్లు గోల్‌చేసే అవకాశాలను వదులుకున్నాయి. చివరి నిమి షంలో బిపిన్‌ సింగ్‌ అద్భుత గోల్‌తో ముంబై ఖాతాలో విజయం చేరింది.

విజేత ముంబై సిటీకి రూ. 8 కోట్లు... రన్నరప్‌ మోహన్‌ బగాన్‌కు రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీ లభిం చాయి. ‘గోల్డెన్‌ బూట్‌’ అవార్డును సీజన్‌లో 14 గోల్స్‌ చేసిన ఇగోర్‌ (గోవా) దక్కించుకోగా...  ‘గోల్డెన్‌ గ్లవ్‌’ అవార్డు మోహన్‌ బగాన్‌ గోల్‌కీపర్‌ ఆరిందమ్‌ భట్టాచార్య పొందాడు. బెంగళూరు తర్వాత (2018–2019 సీజన్‌) లీగ్‌ దశలో ‘టాప్‌ ర్యాంక్‌’లో నిలువడంతోపాటు టైటిల్‌నూ నెగ్గిన రెండో జట్టుగా ముంబై గుర్తింపు పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement