
మాజీలపై మండిపడ్డ వకార్ యూనస్
కరాచీ: గర్వి, ద్వేష పూరిత స్వభావం కలవాడు అంటూ మాజీ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనస్ మండిపడ్డాడు. తనకు గర్వము, ద్వేషము ఉంటే ఇంత స్థాయికి వచ్చే వాడిని కాదంటూ తాజాగా కౌంటర్ ఇచ్చాడు. సోమవారం ఒక స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటూర్యూలో వకార్ ఘాటుగా స్పందించాడు. దేశానికి సేవచేసి, ఒక స్టార్ గా ఎదిగిన తనను మాజీ ఆటగాళ్లు, విమర్శకులు టార్గెట్ చేయడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించాడు. ఆటగాళ్లు తమ శైలిని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వకార్ హెచ్చరించిన నేపథ్యంలో అతనిపై తాజాగా పలు విమర్శలు చోటు చేసుకున్నాయి.
దీనిలో భాగంగానే స్పందించిన వకార్.. తాను ఎవరికీ తలొగ్గే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశాడు. ఒకవేళ మనం ఒకసారి వెనక్కు తగ్గితే అందులో ఎదుగుదల అసాధ్యమంటూ పాకిస్థాన్ క్రికెట్ ను పరోక్షంగా హెచ్చరించాడు. 'నాకు జట్టులోని ఆటగాళ్లు అందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఎవరిపైనా రాగ ద్వేషాలు అనేవి నాలో లేవు. నేను ఎప్పుడూ ఏ ఆటగాడి క్రికెట్ జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదు'అంటూ వకార్ స్పష్టం చేశాడు.
2011 లో టీమిండియాతో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫెనల్ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ ను ఎందుకు తప్పించాల్సి వచ్చింది?అనే దానిపై కూడా వకార్ దీటుగా బదులిచ్చాడు. ఆ సమయంలో అక్తర్ కంటే వహాబ్ రియాజ్, ఉమర్ గుల్ తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లు రాణిస్తున్న కారణంగా వారిని ఎంపిక చేయాల్సి వచ్చిందన్నాడు. ఆ మ్యాచ్ లో రియాజ్ ఐదు వికెట్లు తీసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడన్నాడు. షోయబ్ అక్తర్ తన శరీరాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకుని మరిన్ని వికెట్లు తీసి ఉంటే జట్టులో అతని స్థానం ఉండేందంటూ వకార్ తెలిపాడు.