'నేను పదవుల కోసం చూడటం లేదు'
న్యూఢిల్లీ:లోధా కమిటీ సిఫారుసుల అమలులో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో తనకు కీలక పదవిని కట్టబెట్టబోతున్నారంటూ వచ్చిన వార్తలను మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఖండించాడు. అసలు తాను బీసీసీఐలో పదవి కోసం ఎదురుచూడటం లేదని విషయాన్ని మీడియా మిత్రులు గ్రహిస్తే బాగుంటుందన్నాడు. ఒక వార్తను ప్రచురించేటప్పుడు ముందుగా దాన్ని ధృవీకరించుకున్న తరువాత మాత్రమే ప్రచురించాలని హితవు పలికాడు.
'బీసీసీఐలో పదవిని ఆశించడం లేదు. అలాగే హర్యానా క్రికెట్ అసోసియేషన్ హోదా కోసం కూడా ఎదురుచూడటం లేదు. అయితే బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్ల దీవెనలు నాపై ఎప్పుడూ ఉన్నాయి. నా రాష్ట్ర క్రికెట్ ను ఎంత గౌరవిస్తానో, నాకంటూ ప్రత్యేక స్థానం దక్కడానికి సహకరించిన బీసీసీఐకి కూడా అంతే రుణపడి ఉంటా. అలాగని నాకు పదవులు కావాలని వారిని అడగడం లేదు. అందుకోసం కూడా ఎదురుచూడటం లేదు. నాకు హర్యానా క్రికెట్ లో కీలక పదవి దక్కబోతుందన్న వార్తలు అవాస్తవం'అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.