బుమ్రా- పంత్
What Happened To Jasprit Bumrah?: ‘‘దేవుడి దయ వల్ల.. నా విషయంలో అంతా బాగుంది. అప్పుడప్పుడు గాయాలపాలు కావడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. మన వాళ్లు ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు క్రికెట్ ఆడుతున్నారు. కాబట్టి.. గాయాల బారిన పడకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
ఐపీఎల్ చాలా గొప్ప లీగే.. కాదనను. అయితే, అదే ఏదో ఒకరోజు మిమ్మల్ని నాశనం చేస్తుంది కూడా! చిన్నపాటి గాయాలు ఉన్నా మీరు ఐపీఎల్ ఆడతారు. కానీ దేశం కోసం మాత్రం ఆడరు. దీర్ఘకాలం పాటు బ్రేక్ తీసుకుంటారు.. అంతే కదా!.
ఇక్కడ బీసీసీఐ గమనించాల్సిన విషయం ఒకటుంది. మన ఆటగాళ్లకు స్వల్ప గాయమైనపుడు.. ఐపీఎల్‌లో ముఖ్యమైన మ్యాచ్ ఆడాల్సి ఉంటే కచ్చితంగా బరిలోకి దిగుతారు. కాబట్టి మన వాళ్లు ఏడాదిలో ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఎంతకాలం ఆడుతున్నారన్న విషయాలపై దృష్టి సారించాలి.
ఈరోజు మీ దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయి. కావాల్సినంత డబ్బుంది. కానీ.. ఏడాదికి 3-5 క్యాలెండర్లు మాత్రం ఉండవు కదా! అసలు మన క్రికెట్ బోర్డు తీరే తప్పుగా ఉంది’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. బీసీసీఐ, టీమిండియా క్రికెటర్లను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.
ఐపీఎల్‌కు ఉన్న విలువలేదు!
భారత ఆటగాళ్లు ఐపీఎల్‌కు ఇస్తున్న విలువ.. దేశం కోసం ఆడటానికి ఇవ్వడం లేదని మండిపడ్డాడు. ‘ది వీక్’తో ముచ్చటించిన ఈ లెజెండరీ ఆల్‌రౌండర్.. టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమవడాన్ని ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
అసలు బుమ్రాకు ఏమైంది?
‘‘అసలు బుమ్రాకు ఏమైంది? అతడు కోలుకున్నాడని చెబుతున్నారు.. ఒకవేళ తను వరల్డ్‌కప్ సెమీస్, ఫైనల్ నాటికైనా అందుబాటులో లేకపోతే అతడి కోసం సమయం వృథా చేసినట్లే కదా! ఇక రిషభ్ పంత్.. గొప్ప క్రికెటర్. ఒకవేళ అతడే గనుక జట్టుతో ఉంటే మన టెస్టు క్రికెట్ పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ ఏం జరిగింది?’’ అంటూ కపిల్ దేవ్.. యువ ఆటగాళ్ల తీరును విమర్శించాడు.
కాగా వెన్ను నొప్పి కారణంగా బుమ్రా దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన ఆసియా కప్, ప్రపంచకప్ ఈవెంట్లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇక రిషభ్ పంత్ స్వయంగా కారు నడుపుతూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు కూడా దాదాపు ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ వీరిద్దరిని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
MLC 2023: 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అరాచకం! కానీ పాపం పూరన్‌కు మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment