
'నా కూతురు పతకం సాధిస్తుంది'
రియో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు చాలా కీలకం కానుంది. ముఖ్యంగా భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేటి రాత్రి ఆమె పాల్గొనే ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో దీపా కర్మాకర్ విజయం సాధించాలని ఆమె సొంత రాష్ట్రం త్రిపురలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ గా ఇప్పటికే దీపా కర్మాకర్ పేరు మార్మోగిపోయింది. దీపాకు ప్రధానంగా బైల్స్(అమెరికా) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది.
దీపా కర్మాకర్ తండ్రి దులాల్ కర్మాకర్ మాట్లాడుతూ.. దేశమంతా ఆమెకు అండగా నిలిచింది, అందరూ ఆమె కోసం పూజలు చేస్తున్నారని చెప్పారు. దేశమంతా ఆమెపై ఎన్నో అంచనాలు పెంచుకుందని, తన కూతురు పతకం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అందరి మద్ధతు కూడగట్టుకుని తన కూతురు మెరుగైన ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.