
'ఆసీస్ పై నెగ్గుతాం.. వరల్డ్ కప్ కూడా గెలుస్తాం'
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరగనున్న ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ పై అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తిరువనంతపురం: టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరగనున్న ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ పై అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొహాలీలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం కచ్చితంగా భారత్ దేనని టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ ధీమా వ్యక్తంచేశాడు. భారత్ కు విజయం చేకూరాలని విజయ సంకేతం చూపించాడు. నేటి మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా రాణిస్తుందని, కప్పు కూడా మనదేనని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తొలి టీ20 వరల్ట్ కప్ నెగ్గడంలో శ్రీశాంత్ కీలకపాత్ర పోషించాడు. పటిష్ట ఆసీస్ జట్టుకు ఆ ప్రపంచకప్ లో చుక్కలు చూపించాడు. మ్యాచ్ నేపథ్యంలో పాత విషయాలను ఓసారి గుర్తుచేసుకున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో పాక్ బ్యాట్స్ మన్ మిస్బా ఇచ్చిన క్యాచ్ భారత బౌలర్ శ్రీశాంత్ పట్టే దృశ్యం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో మెదలుతూనే ఉంటుంది.