నేను అదృష్టవంతుడిని...
►నా ఎంపికను నేనే నమ్మలేకపోయా
►అఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్
హైదరాబాద్: ‘ఐపీఎల్ వేలంను టీవీలో చూశాను. వరల్డ్ నంబర్‌వన్ బౌలర్, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ పేరు వచ్చినప్పుడే ఎవరూ స్పందించలేదు. దాంతో ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారని అనుకున్నా. కానీ సన్‌రైజర్స్ భారీ మొత్తానికి నన్ను ఎంచుకుంది. నిజంగా నన్ను నేనే నమ్మలేకపోయా’... తన ఐపీఎల్ ఎంపికపై అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్పందన ఇది. 18 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అతడిని సన్‌రైజర్స్ జట్టు రూ. 4 కోట్లకు తీసుకోవడం విశేషం. ఇంత పెద్ద లీగ్‌లో ఆడగలగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అతను చెప్పాడు. పదకొండు మంది సభ్యుల కుటుంబం నుంచి వచ్చిన రషీద్, ఈ స్థాయికి చేరేందుకు చాలా శ్రమించినట్లు చెప్పాడు.
‘క్రికెట్ ఆడేందుకు మా దేశంలో పరిస్థితులు చాలా కష్టంగా, కఠినంగా ఉండేవి. కనీస స్థాయి సౌకర్యాలు లేవు. చెప్పుకోదగ్గ మైదానాలే కనిపించవు. అయితే కుటుంబ సభ్యుల అండదండలు, అఫ్ఘాన్ బోర్డు సహకారంతో నేను ఎదగగలిగాను. ఇప్పుడు అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి కానీ మా దేశం నుంచి మరింత మంది ఆటగాళ్లు రావాలంటే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది’ అని రషీద్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వల్ల అనేక మంది దిగ్గజాలతో కలిసే అవకాశం తనకు దక్కిందని ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. తనతో పాటు రైజర్స్‌కు ఎంపికైన నబీ కూడా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడి దాకా రాగలిగాడని, మంచి ప్రదర్శనతో తాము ప్రపంచం దృష్టిని ఆకర్షించగలమని ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.