
మెల్‌బోర్న్: కొన్ని రోజుల క్రితం ముగిసిన యాషెస్ సిరీస్‌లో తనతో పాటు పీటర్ సీడెల్ కూడా గాయంతోనే ఆడాడని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైనీ పేర్కొన్నాడు. తాను వేలి గాయంతో బాధపడితే, సిడెల్ తుంటి గాయంతో సతమతమయ్యాడన్నాడు. తమ ఇద్దరి గాయాలు పెద్దగా ఆందోళన పరిచే గాయాలు కాకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదన్నాడు. చివరి టెస్టులో తన వేలికి తీవ్ర గాయమైనప్పటికీ వెంటనే రికవరీ అయినట్లు తెలిపాడు. తనకు అన్నికంటే ముఖ్యమైనది ఎర్రబంతి క్రికెట్‌లో ఆడటమేనని స్పష్టం చేశాడు. అందుకోసం కొన్ని త్యాగాలను చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.
‘నాకు ఆసీస్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమైనది. జట్టును ముందుండి నడిపించడంపైనే దృష్టి పెడుతున్నా. దాంతో బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)ను వదిలేయాలని నిర్ణయించుకున్నా. ఒక కెప్టెన్‌గా నాకొచ్చి ప్రతీ చాన్స్‌ను వినియోగించుకోవాలంటే నేను రీచార్జ్ కావాల్సి ఉంది. ఆ క్రమంలోనే బీబీఎల్‌కు స్వస్తి చెబుదామని అనుకుంటున్నా. నా టెస్టు కెరీర్ ముగిసిన తర్వాతే బీబీఎల్‌లో అడుగుపెడతా. ప్రస్తుతం నా దృష్టంతా నాపై ఉన్న బాధ్యతపైనే’ అని పైనీ పేర్కొన్నాడు. ఆసీస్ తన తదుపరి టెస్టును పాకిస్తాన్‌తో ఆడనుంది. నవంబర్ 21వ తేదీన పాకిస్తాన్‌తో గబ్బా స్టేడియంలో జరుగనున్న టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ తలపడనుంది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment