
మ్యాచ్ తర్వాత చాలా బాధపడ్డాను: కోహ్లీ
కోల్ కతా: తాను చాలా బాధపడ్డానని భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. అదేంటీ దాయాది జట్టు పాక్ ను మట్టికరిపించినందుకు విరాట్ భాద పడటం ఏంటని కంగారు పడకండీ. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 15న జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైనందుకు చాలా ఫీలయ్యానని చెప్పాడు. ఆ మ్యాచ్ లో తాను 23 పరుగులు మాత్రమే చేసి ఔటయినందుకు చాలా బాధపడ్డానని విరాట్ వెల్లడించాడు. అయితే 40-45 పరుగులు చేసినట్లయితే మ్యాచ్ భారత్ గెలుస్తుందని భావించానని తన మనసులో మాటను బయటపెట్టాడు.
గత మ్యాచ్ ఓటమి వల్ల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చాలా ఓపికగా, చాలా కూల్ గా ఇన్నింగ్స్ ఆడినట్లుగా కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడల్లా తన బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ వస్తుందన్నాడు. పాకిస్తాన్ తో ఈడెన్ గార్డెన్ మైదానంలో అర్ధ సెంచరీ సాధించినప్పుడు భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఎప్పటిలాగానే బ్యాట్ పైకెత్తి చూపించడంతో ఆగిపోలేదు. స్టేడియంలోని ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది. అది తాను ఎంతో అభిమానించే క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లి చెప్పిన విషయం తెలిసిందే.